సాక్షి, శ్రీకాకుళం జిల్లా: వైఎస్సార్‌సీపీ నేతలపై చంద్రబాబు సర్కార్ వేధింపులు ఆగడం లేదు. మాజీ మంత్రి సీదిరి అప్పలరాజును పోలీసులు అరెస్ట్ చేశారు. కేసుతో సంబంధం లేకపోయినా కక్ష సాధిస్తున్నారంటూ వైఎస్సార్‌సీపీ శ్రేణులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. పోలీసులు.. కాశీబుగ్గ పోలీస్‌స్టేషన్‌కు సీదిరి అప్పలరాజును తరలిస్తున్నారు. సీదిరి అప్పలరాజు ఇంటి దగ్గర పోలీసులు మోహరించారు. పోలీసులను వైఎస్సార్‌సీపీ కార్యకర్తలు అడ్డుకోవడంతో ఉద్రిక్తత నెలకొంది. కాశీబుగ్గ పీఎస్‌కు వైఎస్సార్‌సీపీ కార్యకర్తలు భారీగా చేరుకున్నారు.
సీదిరి అప్పలరాజు అరెస్టుకు నిరసనగా పలాసలో వైఎస్సార్‌సీపీ ఆందోళనకు దిగింది. పోలీస్ స్టేషన్ నుంచి మూడు రోడ్ల జంక్షన్ వరకు భారీ ర్యాలీ నిర్వహించింది. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలతో పలాస మార్మోగింది. అప్పలరాజు అరెస్టు కక్షసాధింపు చర్యేనని వైఎస్సార్‌సీపీ మండిపడింది. వెంటనే విడుదల చేయాలని వైఎస్సార్‌సీపీ నేతలు డిమాండ్ చేశారు. పలాసలో కార్యకర్తలు భారీగా తరలివచ్చారు. ఆందోళనతో పలాస పట్టణం ఉద్రిక్తంగా మారింది.
కూటమి సర్కార్ కక్ష సాధింపుల ప్రభుత్వంగా మారిపోయింది..
మాజీ మంత్రి సీదిరి అప్పలరాజు అక్రమ అరెస్ట్‌ను వైఎస్సార్‌సీపీ తీవ్రంగా ఖండించింది. కూటమి ప్రభుత్వం కక్ష సాధింపుల ప్రభుత్వంగా మారిపోయిందని వైఎస్సార్‌సీపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. కూటమి ప్రభుత్వం లా అండ్ ఆర్డర్‌ను వదలేసి కక్ష సాధింపుల ప్రభుత్వంగా మారిందని , వైఎస్సార్‌సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గడికోట శ్రీకాంత్‌రెడ్డి మండిపడ్డారు. సీదిరి అప్పలరాజుపై రాజకీయంగా కక్ష సాధింపులు సమంజసమా? అంటూ ప్రశ్నించారు. బీసీ సోదరులపై కూటమి ప్రభుత్వం కక్ష సాధింపులు ఆపాలని శ్రీకాంత్‌రెడ్డి అన్నారు.
‘‘రోడ్డు ప్రమాదాన్ని మర్డర్ కేసుగా మార్చటం సిగ్గుచేటు. సాయికృష్ణ లాకప్‌డెత్, దళితుడు క్రాంతికుమార్ ఆత్మహత్య, గుంటూరులో మహిళను వివస్త్ర చేయటం వంటి ఘటనలతో రాష్ట్రం పరువు పోయింది. రాష్ట్రంలో తప్పు చేసిన వారిని శిక్షించే పరిస్థితి లేదు. కేవలం వైఎస్సార్‌సీపీ నేతలను టార్గెట్ చేయటమే పోలీసుల పనిగా మారింది. బీసీ వర్గానికి చెందిన సీదిరి అప్పలరాజు అరెస్టు అన్యాయం. దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. బీసీలు, దళితులపై వేధింపులు సరికాదు. ఏపీలో జరుగుతున్న దారుణాలపై దేశమంతటా చర్చ జరుగుతోంది. మా పార్టీ నేతలపై ఇలాగే వేధింపులు ఇలాగే కొనసాగితే తీవ్రంగా స్పందిస్తాం’’ అని శ్రీకాంత్‌రెడ్డి హెచ్చరించారు.


