చంద్రబాబు ప్రభుత్వానికి పతనం తప్పదు | All party delegation visits Pulivendula Medical College | Sakshi
Sakshi News home page

చంద్రబాబు ప్రభుత్వానికి పతనం తప్పదు

Mar 27 2026 3:56 AM | Updated on Mar 27 2026 3:56 AM

All party delegation visits Pulivendula Medical College

పులివెందుల మెడికల్‌ కాలేజీని సందర్శించిన అఖిలపక్షం

కళాశాలలో అత్యాధునికంగా నిర్మించిన ఓపీ, ఐపీ విభాగాల పరిశీలన

పులివెందుల మెడికల్‌ కాలేజీకి వచ్చిన 50 సీట్లను వెనక్కి పంపిన ప్రభుత్వం

కాలేజీలోని అత్యాధునిక పరికరాలు వేరే ప్రాంతాలకు తరలింపు

వైఎస్‌ జగన్‌ హయాంలో నియమించిన ప్రొఫెసర్లు, అసిస్టెంట్‌ ప్రొఫెసర్లతోపాటు భారీగా సిబ్బంది బదిలీలు

అన్ని వసతులు ఉన్నా నేడు సాధారణ ఆస్పత్రిలా మెడికల్‌ కాలేజీ

రోగులు, ఆస్పత్రి సిబ్బందితో మాట్లాడి వివరాలు తెలుసుకున్న అఖిలపక్ష బృందం.. మెడికల్‌ కాలేజీల ప్రైవేటీకరణపై నిరసన

పీపీపీ విధానాన్ని రద్దుచేసి వైద్య కళాశాలల్ని ప్రభుత్వమే నిర్వహించాలని డిమాండ్‌ 

పులివెందుల/రూరల్‌: ప్రజా వ్యతిరేక విధానాలను వీడకపోతే టీడీపీ కూటమి ప్రభుత్వానికి పతనం తప్పదని వివిధ పార్టీలతో కూడిన అఖిలపక్షం హెచ్చరించింది. పులివెందుల సహా రాష్ట్రంలో నిర్మాణంలో ఉన్న ప్రభుత్వ వైద్య కళాశాలలను త్వరలో పూర్తిచేసి ఈ విద్యా సంవత్సరం నుంచే ప్రభుత్వ రంగంలో ప్రారంభించాలని డిమాండ్‌ చేసింది. పులివెందుల ప్రభుత్వ మెడికల్‌ కళాశాలను అఖిలపక్ష బృందం గురువారం సందర్శించింది. కళాశాలలో అత్యాధునికంగా నిర్మించిన అవుట్‌ పేషెంట్‌ (ఓపీ), ఇన్‌పేషెంట్‌(ఐపీ) విభాగాలను పరిశీలించింది. 

పులివెందుల మెడికల్‌ కాలేజీకి వచ్చిన 50 సీట్లను టీడీపీ కూటమి ప్రభుత్వం వెనక్కి పంపడంపై అఖిలపక్షం మండిపడింది. కాలేజీలోని అత్యాధునిక పరికరాలు వేరే ప్రాంతాలకు తరలించడంతోపాటు గత సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి హయాంలో నియ­మించిన ప్రొఫెసర్లు, అసిస్టెంట్‌ ప్రొఫెసర్లతోపాటు భారీగా సిబ్బందిని ఇతర ప్రాంతాలకు బదిలీ చేయడమేంటని ప్రశ్నించింది.

అన్ని వసతులు ఉన్నా నేడు సాధారణ ఆస్ప­త్రిలా పులివెందుల మెడికల్‌ కాలేజీని మార్చేయడమేంటని నిలదీసింది. రోగులు, ఆస్పత్రి సిబ్బందితో మాట్లాడి వివరాలు తెలుసు­కున్న అఖిలపక్ష బృందం రాష్ట్రంలోని ప్రభుత్వ మెడికల్‌ కాలేజీల ప్రైవేటీకరణపై నిరసన వ్యక్తం చేసింది. పీపీపీ విధానాన్ని రద్దుచేసి వైద్య కళాశాలల్ని ప్రభుత్వమే నిర్వహించాలని డిమాండ్‌ చేసింది. 

అఖిలపక్ష బృందంలో వైఎస్సార్‌సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎస్వీ సతీష్‌కుమార్‌రెడ్డి, సీపీఐ రాష్ట్ర కార్య­దర్శి గుజ్జుల ఈశ్వరయ్య, కాంగ్రెస్‌ నాయకుడు తులసిరెడ్డి, సీపీఎం నేత కె.ప్రభాకర్‌రెడ్డి, సామాజిక ఉద్యమనేత ప్రొఫెస­ర్‌ సి.రామచంద్రయ్య, వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధి వేదిక అధ్యక్షుడు కె.నారాయణ, బీసీ చైతన్య సమితి అధ్యక్షుడు బీసీ రమణ, విద్యార్థి, యువజన, పౌరసంస్థల కన్వినర్‌ డాక్టర్‌ వెంకటేశ్వర్లు, జనచైతన్య వేదిక అధ్యక్షుడు వల్లంరెడ్డి లక్ష్మణ్‌రెడ్డి, సామాజికవేత్త డాక్టర్‌ వసుంధరతదితరులు ఉన్నారు. 

ప్రభుత్వ మొండివైఖరి తగదు 
ఈ సందర్భంగా అఖిలపక్ష బృందంలోని ప్రతినిధులు మాట్లాడుతూ.. వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వం ఒకేసారి 17 ప్రభుత్వ వైద్య కళాశాలలకు అనుమతులు తెచ్చి.. అందులో 7 కళాశాలలను ప్రారంభించిందన్నారు. మిగిలిన 10 కళాశాలలు నిర్మాణంలో ఉండగా కూటమి ప్రభుత్వం ఏమాత్రం పట్టించుకోకపోవడం దురదృష్టకరమన్నారు. రాష్ట్రంలో వివిధ పార్టీలు, ప్రజాసంఘాలు, విద్యార్థి, యువజన సంఘాలు, పౌర సంస్థలు ప్రభుత్వ వైద్య కళాశాలలను పీపీపీ విధానంలో ప్రైవేటు వ్యక్తులకు కట్టబెట్టడాన్ని వ్యతిరేకిస్తున్నా ప్రభుత్వం మొండిగా వ్యవహరించడం తగదన్నారు. 

పీపీపీ విధానంలో వైద్య కళాశాలలను ప్రైవేటుకు అప్పజెబితే రిజర్వేషన్లు అమలు కావని, పేద విద్యార్థులు, ప్రతిభావంతులైన విద్యార్థులు నష్టపోతారని చెప్పారు. పేద రోగులకు ఉచిత వైద్యం అందదన్నారు. ప్రభుత్వం వైద్య రంగంలో పీపీపీ విధానానికి స్వస్తి పలకాలని డిమాండ్‌ చేశారు. దాదాపు రూ.150 కోట్ల విలువ చేసే 50 ఎకరాల భూమిని, రూ.412 కోట్లతో నిర్మించిన భవనాలను ప్రైవేటు వ్యక్తులకు అప్పగించాలనే ధోరణిని విడనాడాలన్నారు. 2024–25 సంవత్సరంలోనే కేటాయించిన 50 ఎంబీబీఎస్‌ సీట్లను చంద్రబాబు ప్రభుత్వం వద్దనడం దుర్మార్గమని మండిపడ్డారు.  

ఫీజులు కట్టలేక వందలాది సీట్లు ఖాళీ 
ప్రభుత్వ మెడికల్‌ కళాశాలల పరిరక్షణ కమిటీ కన్వినర్‌ డాక్టర్‌ ఆలా వెంకటేశ్వర్లు మాట్లాడుతూ.. ప్రైవేటు వైద్య కళాశాలల్లో అధిక ఫీజులు కట్టలేక వందలాది సీట్లు ఖాళీగా ఉన్నాయన్నారు. ఈ కారణంగానే పీపీపీ టెండర్లలో ఎవరూ పాల్గొనడం లేదనే విషయాన్ని రాష్ట్ర ప్రభుత్వం గ్రహించాలన్నారు. జన చైతన్య వేదిక అధ్యక్షుడు వల్లంరెడ్డి లక్ష్మణరెడ్డి మాట్లాడుతూ.. సీఎం చంద్రబాబు ఈవెంట్ల పేరిట వేలాది కోట్ల రూపాయలను మంచినీళ్లప్రాయంగా దుబారా చేస్తున్నారన్నారు. అందులో ఏ కొంచెం ఖర్చుపెట్టినా నిర్మాణంలో ఉన్న 10 ప్రభుత్వ మెడికల్‌ కళాశాలలు పూర్తవుతాయని, లక్షలాదిమంది పేద రోగులకు ఉచిత వైద్యం అందుబాటులోకి వస్తుందని చెప్పారు.  
ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోంది 
గ్రామీణ ప్రాంతాల్లోని ప్రజలకు మెరుగైన వైద్య సేవలందించాలనే లక్ష్యంతో గత ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి రాష్ట్రవ్యాప్తంగా 17 మెడికల్‌ కళాశాలల ఏర్పాటుకు అనుమతులు తెచ్చారు. వాటిలో 7 కళాశాలలను ప్రారంభించారు. నిర్మాణంలో ఉన్న 10 కళాశాలలను టీడీపీ కూటమి ప్రభుత్వం ప్రైవేటీకరించాలనుకోవడం దురదృష్టకరం. ప్రభుత్వం మొండిగా ముందుకెళితే వైఎస్సార్‌సీపీ తరఫున పెద్దఎత్తున ఉద్యమాలు చేస్తాం.  – ఎస్వీ సతీష్‌కుమార్‌రెడ్డి, వైఎస్సార్‌సీపీ 

రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వైఎస్సార్‌ కడప జిల్లాపై టీడీపీకి కక్ష 
వైఎస్సార్‌ కడప జిల్లా అన్నా, పులివెందుల నియోజకవర్గమన్నా తెలుగుదేశం పార్టీకి కక్ష ఉంది. వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు రాష్ట్రంలో 17 మెడికల్‌ కళాశాలలు తీసుకొచ్చారు. చంద్రబాబు ప్రభుత్వం వచ్చాక భవన నిర్మాణాలు ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్న చందంగా ఉంది. పులివెందులలోనూ కళాశాల అభివృద్ధి జరగలేదు. పిడుగురాళ్ల, పులివెందుల మెడికల్‌ కళాశాలలను వెంటనే ప్రారంభించాలి.      – తులసిరెడ్డి, కాంగ్రెస్‌ పార్టీ నాయకుడు 

50 సీట్లు వెనక్కిచ్చిన బాబు
వైఎస్సార్‌సీపీ హయాంలో పులివెందులలో సుమారు 50 ఎకరాలలో రూ.500 కోట్లతో ప్రభుత్వ మెడి కల్‌ కళాశాల నిర్మించారు. కూటమి ప్రభుత్వం వచ్చాక 50 మెడికల్‌ సీట్లు కేటాయిస్తే వాటిని రద్దుచేసి వెనక్కి పంపిన ఘనత చంద్రబాబుకే దక్కుతుంది. రాష్ట్రవ్యాప్తంగా 2,500 సీట్లు ప్రైవేటీకరణైతే విద్యార్థులు భవిష్యతేం కావాలి.    – గుజ్జుల ఈశ్వరయ్య, సీపీఐ రాష్ట్ర కార్యదర్శి 

కార్పొరేట్‌కు ఇస్తే ఒప్పుకోం 
రాష్ట్రంలోని మెడికల్‌ కళాశాలలను ప్రైవేటుపరం చేసేందుకు ప్రభుత్వం యత్నిస్తోంది. ప్రజల సొమ్ముతో ఏర్పాటు చేసిన మెడికల్‌ కళాశాలలను కార్పొరేట్‌కు ఇస్తే ఒప్పుకునే ప్రసక్తే లేదు.  – డాక్టర్‌ వసుంధర, సామాజికవేత్త 

Advertisement
 
Advertisement
Advertisement