డీకే శివకుమార్‌కు సిద్ధరామయ్య డైరెక్ట్‌ కౌంటర్‌ | CM Siddaramaiah Direct Counter To DK Shivakumar | Sakshi
Sakshi News home page

డీకే శివకుమార్‌కు సిద్ధరామయ్య డైరెక్ట్‌ కౌంటర్‌

Nov 27 2025 8:33 PM | Updated on Nov 27 2025 8:33 PM

CM Siddaramaiah Direct Counter To DK Shivakumar

కర్ణాటకలో నాయకత్వ మార్పు ఎపిసోడ్‌ రసవత్తరంగా తయారైంది. డీకే, సిద్ధరామయ్య మధ్య నేరుగా ‘మాట’ల యుద్ధం మొదలైంది. డీకే శివకుమార్‌ వ్యాఖ్యలకు కౌంటర్‌ ఇచ్చేలా సీఎం సిద్దరామయ్య చేసిన ట్వీట్‌ పరిస్థితి తీవ్రతను అద్దం పడుతోంది. 

సీఎం మార్పు ఊహాగానాల వేళ అగ్రనేతల పోరు తారస్థాయికి చేరింది. ఇంతకాలం గప్‌చుప్‌గా ఉంటూ తమ వర్గీయులను ముందుంచిన సీఎం సిద్ధరామయ్య, డిప్యూటీ సీఎం డీకే శివకుమార్‌లు నేరుగా రంగంలోకి దిగారు. ఒకవైపు మీడియా మైకుల ముందు మాటలు.. ఇంకోవైపు సోషల్‌ మీడియా పోస్ట్‌లతో కర్ణాటక పాలిటిక్స్‌ను హీటెక్కిస్తున్నారు. 

 ‘‘కన్నడ ప్రజలు మాకిచ్చిన తీర్పు కేవలం ఒక క్షణం కోసం కాదు.. అది ఐదేళ్ల పూర్తి బాధ్యత. నాతో సహా కాంగ్రెస్ పార్టీ మా ప్రజలకు ఇచ్చిన మాటలను చేతల్లో చేసి చూపిస్తున్నాం. కన్నడ ప్రజలకు మేం ఇచ్చిన ‘మాట’ కేవలం ఒక నినాదం కాదు.. అదే మాకు ‘ప్రపంచం’ అంటూ.. సీఎం సిద్ధరామయ్య ఎక్స్‌ ఖాతాలో ఓ పోస్ట్‌ చేశారు. 

మాట (Word) నిలబెట్టుకోవడం కంటే గొప్ప విషయం ప్రపంచంలో మరోకటి లేదు అనే అర్థం వచ్చేలా డిప్యూటీ సీఎం డీకే శివకుమార్‌ గురువారం ఉదయం ఎక్స్‌లో ఓ పోస్ట్‌ చేసిన సంగతి తెలిసిందే. ఈ తరుణంలో.. సిద్ధరామయ్య ట్వీట్‌ డీకే శివకుమార్‌కు కౌంటర్‌లా ఉండడం గమనార్హం. 

కర్ణాటకలో నవంబర్‌ 20వ తేదీతో కాంగ్రెస్‌ ప్రభుత్వం రెండున్నరేళ్ల అధికారం పూర్తి చేసుకుంది. అయితే, అధికారం చేపట్టే సమయంలో రెండున్నరేళ్ల తర్వాత సీఎం మార్పునకు సిద్ధరామయ్య, డీకే మధ్య ఒప్పందం కుదిరిందనే ప్రచారం జోరుగా సాగుతోంది. మధ్యలో ఈ ప్రచారం తెరపైకి వచ్చినా.. అలాంటిదేం లేదంటూ ఇద్దరూ ఖండించారు కూడా. తీరా టైం రావడంతో ఇప్పుడు సీటును నిలబెట్టుకునేందుకు సిద్ధరామయ్య, తాను సీఎం పీఠం మీద కూర్చునేందుకు డీకే శివకుమార్‌ తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. అయితే ఈ పరిణామం ప్రభుత్వం కుప్పకూల్చే అవకాశం ఉండడంతో హైకమాండ్‌ ఆచితూచి నిర్ణయం తీసుకోవాలని భావిస్తోంది. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement