బళ్లారి అర్బన్: హోలీ పండుగ సందర్భంగా నగరంలో ఆనందోత్సవాలతో యువతీ, యువకులు ఒకరిపై మరొకరు రంగుల నీళ్లను చల్లుకొని హోలీ సంబరాలను ఘనంగా జరుపుకొన్నారు. మంగళవారం హోలీ పండుగను చిన్నారులు, మహిళలు, యువతీ యువకులు చిన్నా పెద్ద తేడా లేకుండా రంగులను చల్లుకుని ఆచరించారు. నగరంలోని ప్రధాన వీధులు, కాలనీలు రంగులమయంగా మారాయి. స్నేహితులు, బంధువులు ఒకరిపై మరొకరు రంగులను చల్లుకుని, మిఠాయిలను పంచుకుని పండుగ శుభాకాంక్షలను తెలుపుకున్నారు. పలు చోట్ల డీజే సాంగ్స్‌తో యువతీ యువకులు నృత్యాలు చేశారు. కొన్ని ప్రాంతాల్లో సామూహిక హోలీ వేడుకలు నిర్వహించి ప్రత్యేక కార్యక్రమాలు చేపట్టారు. శాంతి భద్రతల దృష్ట్యా పోలీసు శాఖ కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేసింది. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ప్రత్యేక నిఘా ఏర్పాటు చేశారు. ప్రజలు సౌహార్థ వాతావరణంలో హోలీ పండుగను జరుపుకోవడం విశేషంగా నిలిచింది.
రాయచూరులో..
రాయచూరు రూరల్ : జిల్లాలో రంగుల హోలీ పండుగను ప్రజలు వైభవంగా జరుపుకున్నారు. నగరంలోని బెస్తవారి పేట ఉప్పార సమాజం ఆధ్వర్యంలో సోమవారం రాత్రి కామదహనం చేశారు. మంగళవారం ప్రజలు హోలీ పాటలు పాడుతూ రంగులు చల్లుకుని సంబరాల్లో మునిగి తేలారు. భంగికుంటలో ఉట్టి పగులగొట్టే పోటీల్లో యువత పోటీ పడి కుండను బద్దలు కొట్టారు.
సంబరంగా హోలీ
హొసపేటె: విజయనగర జిల్లా హగరిబొమ్మనహళ్లి పట్టణంలోని కూడ్లిగి సర్కిల్‌లో మంగళవారం హోలీ సంబరాలను ఘనంగా నిర్వహించారు. ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు వేడుకలు జరిగాయి. పండుగను పురస్కరించుకొని వేలాది యువత రంగులను చల్లుకుని సంబరాలను ఆనందంగా జరుపుకున్నారు. డీజే సౌండ్ విత్ రైన్‌తో కన్నడ పాటలకు బాలబాలికలు చేసిన నృత్యాలు చూపరులను ఆకట్టుకున్నాయి. అదే విధంగా కన్నడ సినీ ప్రసిద్ధ నటుడు దివంగత అప్పు పాటలకు అభిమానులు నృత్యం చేస్తూ ఉత్సాహంగా నినాదాలతో సంబరాల్లో పాల్గొన్నారు.
రంగులమయంగా నగర వీధులు
ఊరూవాడ మిన్నంటిన సంబరాలు
ఆ గ్రామాల్లో హోలీ వేడుక విభిన్నం
హుబ్లీ: హోలీ పండుగ అంటే అందరిలోను అత్యంత ఉత్సాహం, ఉల్లాసం, సంబరాలే. అయితే రాష్ట్రంలో రెండు గ్రామాల్లో హోలీ పండుగను ఎంతో విభిన్నంగా ఆచరిస్తారు. ధార్వాడ జిల్లా ముళముత్తళ గ్రామంలో రంగులు చల్లుకోడానికి బదలుగా తమ ఇంట్లోని ఆయుధాలతో కామన మూర్తిని చోరీ జరగకుండా కాపాడతారు. గత చరిత్రలోని ఓ ఘటన ద్వారా ఈ విశిష్ట సంప్రదాయం నేటికీ కొనసాగుతుంది. చుట్టు పక్కల గ్రామాల ప్రజలు ఈ విచిత్ర ఆచరణను చూడటానికి తరలివస్తారు. ఇది కేవలం ఆచరణే కాదు. ప్రజల విశ్వాసం కూడా. ఆ గ్రామ వ్యాయామశాల ఎదుట సుమారు 12 అడుగుల ఎత్తుతో మంటపాన్ని నిర్మించి చుట్టు కట్టెల భద్రతతో కాముడిని ప్రతిష్టాపిస్తారు. ఈ విగ్రహాన్ని ఎవరైనా చోరీ చేస్తారన్న కారణంతో పూర్వాచారం ప్రకారం ఈ పద్ధతిని అంటే ఆయుధాలను పట్టుకొని కాపలా కాస్తారు. అదే విధంగా చిత్రదుర్గ జిల్లాలో వదిన, ఆడ పడుచులు పరస్పరం తలలు ఢీకొట్టుకొని హోలీ పండుగను వైవిధ్యమయంగా ఆచరిస్తారు.
చిత్రదుర్గ జిల్లాలో..
చిత్రదుర్గ జిల్లా హిరియూరు తాలూకా చిక్కేరన్న మాళిగె గ్రామంలో హోలీ సందర్భంగా ఈ విశేష వేడుక జరుపుకుంటారు. దీని వల్ల సంబంధాలు గట్టి పడతాయని నమ్మకం. గిరిజన సంస్కృతికి నిదర్శనంగా ఈ సంప్రదాయం నిలుస్తుంది. తలలను ఢీకొట్టుకుని ప్రేమ పూర్వకంగా ప్రాచీన కాలం నుంచి వచ్చిన ఈ పండుగ సంప్రదాయాన్ని భక్తిశ్రద్ధలతో జరుపుకుంటామని ఆ గ్రామ సీనియర్ ఉపాధ్యాయుడు డాక్టర్.కరియప్ప మాళిగె తెలిపారు. ముఖ్యంగా ఈ పండుగకు ఇక్కడ పుట్టినింటికి చెందిన ఆడ పిల్లలు ఎక్కడ ఉన్నా కూడా వచ్చి ఈ వేడుకలో పాల్గొంటారని అన్నారు.


