సాక్షి బళ్లారి: సర్వధర్మ సంస్థాపకులు, మహిమాన్వితుడు, దైవాంశ సంభూతుడు, సద్గురు అన్వరానంద బాబా నెలకొల్పిన సర్వధర్మ ఆశ్రమంలో భంభం బాబా ఆరాధన మహోత్సవం కన్నుల పండువగా భక్తిశ్రద్ధలతో ఆచరించారు. మంగళవారం ఫాల్గుణ మాసం పౌర్ణమి రోజున మైసూరు సమీపంలో మండ్య జిల్లా కేఆర్‌ఎస్ రహదారిలో బెలగొళ గ్రామ సమీపంలోని కావేరి నదీ తీరాన సువిశాల, ఆహ్లాదకరమైన వాతావరణంలో వెలసిన సర్వధర్మ ఆశ్రమంలో భం షేక్ అబ్దుల్ స్వామి 57వ ఆరాధన మహోత్సవాలు, సద్గురు భం అన్వరానంద బాబా 23వ ఆరాధన మహోత్సవాలను భం కబీర్ కిరణ్ దివ్య సన్నిధిలో అత్యంత వైభవంగా జరిగాయి. ప్రతి ఏటా మాదిరిగానే ఈ సంవత్సరం కూడా భంభం బాబా ఆరాధన మహోత్సవాలను తిలకించడానికి వేలాదిగా భక్తజన సందోహం తరలివచ్చారు.
ఉదయం నుంచి ఆధ్యాత్మిక కార్యక్రమాలు
భం కబీర్ కిరణ్ స్వామీజీ ఆధ్వర్యంలో మంగళవారం ఉదయం నుంచి వివిధ ఆధ్యాత్మిక, సేవా కార్యక్రమాలు ఘనంగా నిర్వహించారు. ముందుగా ఉదయం 6 గంటల నుంచి ధ్యాన మందిరంలో దివ్య జ్యోతిని వెలిగించి ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం స్వామీజీ అమృత హస్తాలతో ధర్మపతాకాన్ని ఆవిష్కరించారు. విశ్వశాంతి కోసం పావురాలను ఎగరవేసి ఆధ్యాత్మిక కార్యక్రమాలను ప్రారంభించారు. అనంతరం ధ్యాన మందిరం నుంచి కన్యలు కుంభాభిషేకాలతో స్వామీజీకి స్వాగతం పలుకుతూ పరమ పవిత్రమైన జ్యోతికట్ట, భం అన్వరానంద బాబా, పూజ్య మాతాజీ సన్నిధానాల వద్దకు భక్తిపూర్వకంగా భజనలు చేస్తూ వెళ్లారు. జ్యోతికట్ట వద్ద అభిషేకం, గంధం, కుంకుమ, విభూతి అంటించి, ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం 15 నిమిషాలు ధ్యానం, భజన, మహా మంగళహారతి నిర్వహించారు.
భక్తిపారవశ్యంలో మునిగిన భక్తులు
అనంతరం స్వామీజీ ఆధ్వర్యంలో నామకరణాలు, కేశఖండనాలు జరిపించారు. వేలాదిగా తరలివచ్చిన భక్తులు ఆశ్రమంలో ఆధ్యాత్మిక కార్యక్రమాలు నిర్వహించి భక్తిపారవశ్యంలో మునిగిపోయారు. ఆరాధన మహోత్సవాలకు విచ్చేసిన వేలాది మంది భక్తులకు ఉచిత అన్నదాన సేవా కార్యక్రమాలు కూడా నిర్వహించారు. కర్ణాటక నుంచే కాకుండా ఆంధ్రప్రదేశ్, తెలంగాణ తదితర రాష్ట్రాల నుంచి పెద్ద ఎత్తున భక్తులు తరలివచ్చి స్వామీజీ కృపకు పాత్రులయ్యారు. అలాగే ముఖ్యంగా భంభం బాబా ఆరాధన మహోత్సవాల సందర్భంగా మంగళవారం రాత్రి పరమ పవిత్ర గురుపూజ కార్యక్రమాలు అత్యంత భక్తిశ్రద్ధలతో జరిపారు. సర్వధర్మ ఆశ్రమం పీఠాధిపతి కబీర్ కిరణ్ స్వామీజీ గురుపూజలో నిమగ్నమై భక్తులకు దర్శనమిచ్చారు. గురుపూజలను భక్తులు ఎంతో భక్తిశ్రద్ధలతో తిలకించి పునీతులయ్యారు.
సర్వధర్మ ఆశ్రమంలో కిక్కిరిసిన
భక్తజన సందోహం
భం కబీర్ కిరణ్ స్వామీజీ
దివ్య సన్నిధిలో సేవలు


