చెంగ్డూ (చైనా): టెన్నిస్ సీజన్ తొలి గ్రాండ్‌స్లామ్ టోర్నమెంట్ ఆ్రస్టేలియన్ ఓపెన్‌కు నేరుగా అర్హత సాధించే అవకాశాన్ని భారత నంబర్‌వన్ సుమిత్ నగాల్ చేజార్చుకున్నాడు. ఆసియా–పసిఫిక్ వైల్డ్ కార్డు ప్లే ఆఫ్ టోర్నీలో ప్రపంచ 278వ ర్యాంకర్ సుమిత్ నగాల్ పోరాటం ముగిసింది. గురువారం జరిగిన పురుషుల సింగిల్స్ క్వార్టర్ ఫైనల్లో ఆరో సీడ్ సుమిత్ 2–6, 2–6తో టాప్ సీడ్, ప్రపంచ 120వ ర్యాంకర్ యుంచావోకెటె బు (చైనా) చేతిలో ఓడిపోయాడు.
మ్యాచ్ మొత్తంలో ఒక్క ఏస్ కొట్టి, ఒక్క డబుల్ ఫాల్ట్ చేసిన సుమిత్ తన సర్వీస్‌ను రెండుసార్లు కోల్పోయాడు. క్వార్టర్ ఫైనల్లో ఓడిన సుమిత్‌కు 1,500 ఆ్రస్టేలియన్ డాలర్లు (రూ. 87 వేలు) ప్రైజ్‌మనీగా లభించాయి. 28 ఏళ్ల సుమిత్ ఇప్పటి వరకు ఎనిమిది సార్లు గ్రాండ్‌స్లామ్ టోర్నీ మెయిన్ ‘డ్రా’లో పోటీపడ్డాడు. కానీ రెండో రౌండ్‌ను దాటి ముందుకెళ్లలేకపోయాడు.
ఫైనల్లో నిక్కీ పునాచా జోడీ
ఇదే టోర్నీ పురుషుల డబుల్స్ విభాగంలో నిక్కీ పునాచా (భారత్)–ప్రుచాయ ఇసారో (థాయ్‌లాండ్) జోడీ ఫైనల్‌కు చేరింది. సెమీఫైనల్లో నిక్కీ–ఇసారో ద్వయం 6–4, 6–2తో జిసుంగ్ నామ్–యుసుంగ్ పార్క్ (దక్షిణ కొరియా) జంటపై గెలిచింది. ఫైనల్లో గెలిచిన జోడీకి ఆస్ట్రేలియన్ ఓపెన్ వైల్డ్ కార్డు బెర్త్ లభిస్తుంది.


