భారత–చైనాల మధ్య సంబంధాలు మెరుగుపడే అవకాశం కనబడుతున్నప్పుడల్లా ఏదో ఒక పేచీకి దిగటం చైనాకు అలవాటైపోయింది. ఇటీవల అరుణాచల్‌ప్రదేశ్‌కు చెందిన యువతి ప్రేమా వాంగ్జోమ్ థోంగ్డాక్‌ను షాంఘై విమానాశ్రయంలో 18 గంటల పాటు నిర్బంధించిన వైనం ఇటువంటిదే. భారతీయ కాన్సులేట్ అధికారి జోక్యం చేసుకోబట్టి ఆమె విడుదలయ్యారు. లేకుంటే మరెంతసేపు వేధించేవారో తెలియదు. ఇది యథా లాపంగా జరిగిన ఉదంతం కాదు. అరుణాచల్‌ప్రదేశ్ విషయంలో ఉద్దేశపూర్వకంగా దశాబ్దాలుగా ఇలా చేస్తోంది. ఆమె ఉద్యోగరీత్యా బ్రిటన్‌లో స్థిరపడిన భారతీయ వనిత. సెలవుల్లో గడపటానికి జపాన్ వెళ్తూ విమానం మారటానికి షాంఘైలో దిగాల్సి వచ్చింది. మరో మూడు గంటల్లో జపాన్ విమానం ఎక్కాల్సి ఉండగా చైనా అధికారులు తమ వింత ప్రవర్తనతో ఆమెను ఇబ్బంది పెట్టారు. ఆమె దగ్గర చట్టబద్ధమైన వీసా ఉంది. భారత పాస్‌పోర్ట్ ఉంది. కానీ స్వస్థలం అరుణాచల్ అనేసరికి చైనా అధికారులకు చిర్రెత్తుకొచ్చినట్టుంది. జపాన్ వెళ్లటానికి చైనా ఈస్టర్న్ ఎయిర్‌లైన్ విమానం టిక్కెట్ కొంటేనే పాస్‌పోర్టు వెనక్కిస్తామని షరతు పెట్టారు.
అరుణాచల్ తమ భూభాగంలోనిదని వితండవాదనకు దిగటం చైనాకు ఎప్పటి నుంచో అలవాటు. అది దక్షిణ టిబెట్ అనీ, దాని పేరు జంగ్నాన్ అనీ చెప్పుకోవటం, దాన్ని ‘వివాదాస్పద ప్రాంతం’గా అభివర్ణించటం, తరచుగా అరుణాచల్ పరిధిలోని గ్రామాల పేర్లు మార్చి, మాండరిన్ భాషలో ఏదో ఒక పేరు పెట్టుకుని మురియటం కూడా పాత కథే. ఇలా వివాదానికి దిగిన ప్రతిసారీ మన దేశం కూడా అరుణాచల్ భారత్‌లో అంతర్భాగమని చెప్పక తప్పడం లేదు. అరుణాచల్ ఒక్కటే కాదు... ఇరు దేశాల సరిహద్దుల్లో పలు ప్రాంతాలు తన ఖాతాలో వేసుకోవటం చైనా తరచూ చేసే పని. ఇరుగు పొరుగుతో సఖ్యతతో మెలగటం, ఇచ్చిపుచ్చుకోవటం వంటి సంస్కృతి చైనాకు అలవడలేదు. బలహీనంగా ఉన్న దేశాలను రుణ ఊబిలోకి లాగటం, తనపై ఆధారపడక తప్పని స్థితి కల్పించటం చైనా తీరుకు నిదర్శనం. చివరకు ఆ దేశాలు సంక్షోభాల్లో చిక్కుకుని విలవిల్లాడటం దాని పుణ్యమే. ఇందుకు మన ఇరుగుపొరుగునున్న శ్రీలంక, బంగ్లాదేశ్, నేపాల్ వగైరాలు ఉదాహరణ.
చాన్నాళ్ల తర్వాత ఇటీవలే చైనా తీరుతెన్నులు మారిన జాడలు కనబడ్డాయి. ఏడేళ్ల తర్వాత తొలిసారిగా మొన్న సెప్టెంబర్ మొదటివారంలో షాంఘై సహకార సంస్థ (ఎస్‌సీఓ) శిఖరాగ్ర సదస్సు సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ ఆ దేశాన్ని సందర్శించారు. అంతకుముందు నిరుడు అక్టోబర్‌లో రష్యాలో జరిగిన బ్రిక్స్ దేశాల శిఖరాగ్ర సదస్సు సందర్భంగా చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్‌తో మోదీ సమావేశమయ్యారు. ఇరు దేశాల సంబంధాలనూ మళ్లీ పూర్వస్థితికి తీసుకెళ్లాలన్న ఆకాంక్షను వారిద్దరూ వ్యక్తం చేశారు. రెండు దేశాల మధ్యా విమాన రాకపోకలు ప్రారంభమై నెల్లాళ్లు కూడా కాలేదు. ఇందువల్ల టూరిజం, వ్యాపారం, ప్రజల మధ్య సంబంధాలు మెరుగవుతాయని చైనా కూడా భావిస్తోంది. కానీ అంతా బాగుందనుకుంటున్న తరుణంలో అందుకు భిన్నమైన ప్రవర్తన తో దిగ్భ్రాంతిపరచటం దానికే సాధ్యం.
ఇలా మైత్రి ఒకడుగు ముందుకు... రెండడుగులు వెనక్కి అన్నట్టు ఊగిసలాట ధోరణిలో ఉండిపోవటానికి చైనా తీరే ప్రధాన కారణం. ఆమెను ఒత్తిడి చేయటం, నిర్బంధించటం, వేధించటం వంటివి లేనేలేవని చైనా విదేశాంగ మంత్రిత్వశాఖ ప్రతినిధి మావో నింగ్ బుకాయిస్తున్నారు. మరి భారత పాస్‌పోర్టు ఉన్న యువతిని 18 గంటల పాటు కదలనివ్వక పోవటాన్ని ఏమంటారో ఆమె చెప్పాలి. ఇది జరిగి అయిదారు రోజులు గడుస్తున్నా ఈ ఉదంతంలో తమ అధికారుల తీరు గురించి సరైన సంజాయిషీ ఇవ్వటంలో చైనా విదేశాంగ శాఖ విఫలమైంది. తమ దేశంలో విమానం మారదల్చుకుంటే 24 గంటల లోపు వీసా అవసరమే లేదన్న స్వీయ నిబంధనను సైతం చైనా ఉల్లంఘించింది. దీంతో పాటు అంతర్జాతీయ పౌర విమానయాన నిబంధనల్ని సైతం బేఖాతరు చేసింది. ఇలాంటి ఉదంతాల వల్ల తన విశ్వసనీయత దెబ్బ తినటం మినహా మరే ప్రయోజనమూ లేదని ఇప్పటికైనా చైనా గ్రహించాలి. హుందాగా ప్రవర్తించటం నేర్చుకోవాలి.


