ప్రస్తుతం భారత్-అమెరికా మధ్య ద్వైపాక్షిక సంబంధాలు ఆశించిన స్థాయిలో లేవు. ట్రంప్ పన్నుల మోతతో ఇరు దేశాల మధ్య డిస్టెన్స్ కొద్దిగా పెరిగింది. ఈ నేపథ్యంలో యూఎస్ రాయబారి సెర్గియా గోర్ కీలక ప్రకటన చేశారు. అమెరికాకు భారత్ తర్వాతే ఏదేశమైనా అని అన్నారు. వచ్చే ఏడాది ట్రంప్ భారత్ పర్యటించే అవకాశం ఉందని తెలిపారు.
డొనాల్డ్ ట్రంప్ రెండవసారి అధికారం చేపట్టాక భారత్‌కు అమెరికాతో సంబంధాలు మెరుగుపడుతాయని అంతా ఆశించారు. దానికి కారణం కూడా లేకపోలేదు. భారత ప్రధాని మోదీ, ట్రంప్ మంచి స్నేహితులు కావడంతో ఇరుదేశాల మధ్య సత్సంబంధాలు మెరుగపడతాయనుకున్నారు. తీరా చూస్తే సీన్ రివర్స్ అయ్యింది. ఆపరేషన్ సిందూర్ అనంతరం ట్రంప్ పాక్‌కు అనుకూలంగా వ్యాఖ్యానించడం, తనవల్లే రెండుదేశాల మధ్య యుద్ధం ఆగిందని తరుచుగా వ్యాఖ్యానించారు. ఈ విషయాన్ని భారత్ ఖండించినా ట్రంప్ తన తీరు మార్చుకోలేదు. అంతేకాకుండా రష్యా నుంచి చమురు కొంటే అధిక పన్నులు వేస్తానని బెదిరించారు. ఇలా అమెరికాతో డిస్టెన్స్ పెరుగుతూ వచ్చింది.
కాగా తాజాగా ఆదేశ రాయబారి మాటలు చూస్తుంటే అగ్రరాజ్యం తన రూటు మార్చినట్లు కనిపిస్తోంది. ఆదేశ రాయబారి సెర్గియా గోర్ భారత్‌ను ప్రశంసిస్తూ మాట్లాడారు. ఢిల్లీలోని యూఎస్ రాయబార కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ.. " డొనాల్డ్ ట్రంప్, నరేంద్ర మోదీ ఇద్దరు మంచి స్నేహితులు. వీరిద్దరి స్నేహం నిజమైనది. కనుక వారిమధ్య ఏవైనా విభేదాలు ఉంటే వారి పరిష్కరించుకుంటారు. అమెరికాకు భారత్ అంత కీలకమైన దేశం మరేదిలేదు. ట్రంప్ వచ్చే ఏడాది భారత్ పర్యటించే అవకాశం ఉంది" అని ఆయన అన్నారు.
తాను ట్రంప్‌తో చివరిసారి డిన్నర్ చేసినప్పుడు ట్రంప్ తన చివరి భారత పర్యటన వివరాలను గుర్తు చేసుకున్నారని ప్రధాని మోదీతో మైత్రి అపూర్వమని ఆయన అన్నారని తెలిపారు. భారత్, అమెరికా మధ్య రెండవ దశ ట్రేడ్ డీల్స్ మంగళవారం నుంచి ప్రారంభమవుతాయని తెలిపారు. రాయబారిగా భారత్-అమెరికా మధ్య సరైన ఎజెండా రూపొందించడం రాయబారిగా తన బాధ్యతని సెర్గియా గోర్ పేర్కొన్నారు.


