జనతంత్రం
‘వినదగు నెవ్వరు చెప్పిన...’ అన్నాడు సుమతీ శతకకారుడు. విన్న తర్వాత అందులోని నిజానిజాలేమిటో నిర్ధారించుకొని ఒక నిర్ణయం తీసుకోవాలంటాడు. సంఘ జీవనంలో మనుషుల మధ్య సంబంధాల గురించి చెప్పిన హితోక్తి ఇది. ప్రజాస్వామ్య వ్యవస్థలో ఏర్పడిన ప్రభుత్వాలు తప్పనిసరిగా పాటించవలసిన నీతిపాఠం. ప్రభుత్వ చర్యలను, నిర్ణయాలను ప్రజల తరఫున ప్రతిపక్షాలు ప్రశ్నిస్తాయి. అది వాటి బాధ్యత. ఆ ప్రశ్నలకు ప్రభుత్వాలు సూటిగా సమాధానాలు చెప్పి తీరాలి. అలా చెప్పకుండా దాటవేయడం మొదలుపెడితే ఆ ప్రభుత్వాలు ఏదో దాచిపెడుతున్నట్టు లెక్క. ప్రస్తుత ఏపీ సర్కార్ దాటవేసే దశను కూడా దాటిపోయింది. ఎదురు దాడినే ఆయుధంగా ప్రయోగిస్తున్నది. అందులోనూ పూనకాల దశకు చేరుకున్నది. జరగరానిదేదో జరుగుతున్నదని దీని అర్థం. చేయగూడని తప్పులేవో ప్రభుత్వం చేస్తున్నదని అర్థం. ప్రజలకు బాధ్యత వహించ వలసిన పవిత్ర కర్తవ్యాన్ని ఏపీ సర్కార్ ఈ రకంగా ఎగతాళి చేస్తున్నది.
ప్రతిపక్ష నేత జగన్‌మోహన్‌రెడ్డి గురువారం నాడు మీడియా సమావేశంలో మాట్లాడారు. వివిధ అంశాల మీద ప్రభుత్వ వైఖరిని ప్రశ్నించారు. అంతే, మిడతల దండు దాడి చేసినట్టు, తోడేళ్ల మంద దండెత్తి వచ్చినట్టుగా ఉన్నది కూటమి రియాక్షన్. కనీసం పదిమంది మంత్రులు జగన్‌పై ఎదురుదాడికి దిగారు. అందులో ఒక వయసు మళ్లిన మంత్రి స్థిమితం కోల్పోయి మాట్లాడారు. యెల్లో మీడియా ఛానల్స్ అన్ని రకాల మర్యాదల్నీ అతిక్రమించాయి. యెల్లో పత్రికలు యథావిధిగా వక్రీకరణకు పూనుకున్నాయి. కానీ, ఆయన లేవనెత్తిన ప్రశ్నలకు సూటిగా సమాధానం చెప్పే సాహసాన్ని ప్రభుత్వం కానీ, దాని తాబేదార్లు కానీ చేయలేదు. అసలు విషయాన్ని దాచేసి కొసరు సంగతులపై షాడో బాక్సింగ్ చేసే సంస్కృతిని యెల్లో కూటమి బాగా వంటపట్టించుకున్నది. విషయ పరిజ్ఞానం లేని పదిమంది తుత్తురుగాళ్లతో మాట్లాడించి, గత్తరలేపే వ్యూహాన్ని ప్రణాళికా బద్ధంగా అమలు చేస్తున్నది.
ఇటీవల తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అసెంబ్లీలో ఒక ప్రకటన చేశారు. తాను ఏపీ ముఖ్యమంత్రితో ఒక క్లోజ్డ్ డోర్ మీటింగ్‌లో మాట్లాడి ‘రాయలసీమ ఎత్తిపోతల పథకం’ పను లను ఆపేయించాననీ, కావాలంటే ఎవరైనా సరే చెక్ చేసుకో వచ్చనీ ఆయన అన్నారు. ఇది రెండు రాష్ట్రాల మధ్య సున్నిత మైన అంశం. జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వం ప్రారంభించిన ఈ ఎత్తిపోతలపై తెలంగాణకు అభ్యంతరాలున్నాయి. కానీ రాయలసీమ అవసరాల రీత్యా ఏపీకిది వరదాయిని. ఇటువంటి అంశంపై తెలంగాణ ముఖ్యమంత్రి ప్రకటన నేపథ్యంలో వైసీపీ సహా మరికొన్ని రాజకీయ పక్షాల ఏపీ ప్రభుత్వ స్పందనను డిమాండ్ చేశాయి. జగన్‌మోహన్‌రెడ్డి కూడా తన మీడియా సమావేశంలో ఈ అంశాన్ని లేవనెత్తారు. ఎవరూ అడక్కుండానే ప్రభుత్వం ఈ అంశంపై ఒక ప్రకటన చేసి ఉండవలసింది.
కానీ, ఇప్పటివరకూ ఈ వ్యవహారం మీద ఏపీ ప్రభుత్వం సూటిగా స్పందించలేదు. రేవంత్‌రెడ్డి, తాను క్లోజ్డ్ డోర్ మీటింగ్‌లో ఈ విషయం మాట్లాడుకున్నారా లేదా అనే సంగతి తప్ప అనేక ఇతర విషయాలు చంద్రబాబు మాట్లాడారు. ఒకవేళ రేవంత్ రెడ్డి చెప్పింది తప్పయితే దాన్ని ఖండించడానికి రాష్ట్ర ప్రభుత్వానికి ఉన్న ఇబ్బంది ఏమిటో అర్థం కాని విషయం. రేవంత్ రెడ్డి చెప్పింది నిజమే అయితే, అటువంటి రహస్య నిర్ణయం తీసుకోవలసి రావడం వెనుక కీలకమైన జాతీయ భద్రతా అంశాలు దాగి ఉన్నాయని చెప్పవచ్చు. కానీ అసలు విషయాన్ని వదిలేసి ఉపవాచకాలను పఠించడం, ఉక్రోషాన్ని ప్రదర్శించడం యెల్లో కూటమి బలహీనతల్ని ఎత్తి చూపింది.
అదే మీడియా సమావేశంలో అమరావతి వ్యవహారంలో ప్రభుత్వం చేస్తున్న తప్పిదాలను కూడా జగన్ ఎత్తిచూపారు. బాధ్యత కలిగిన ప్రభుత్వమైతే వాటికి సమాధానం చెప్పాలి. కానీ, ఆయన మాట్లాడిన మిగిలిన అన్ని విషయాలను వదిలేసి, ఈ ఒక్క అంశాన్నే పట్టుకుని అమరావతి మీద జగన్‌మోహన్‌రెడ్డి విషం కక్కుతున్నారంటూ ఒక చౌకబారు ప్రచారాన్ని దిగజారుడు భాషలో వండి వార్చి వడ్డించడం మొదలుపెట్టారు. ఒక్క జగన్‌మోహన్‌రెడ్డికే కాదు, అమరావతి విషయంలో ప్రభుత్వం వేస్తున్న కుప్పిగంతులపై చాలామంది మేధావులకూ, స్థానిక ప్రజలకూ పలురకాల అనుమానాలున్నాయి. వాటిని నివృత్తి చేయకుండా నిందారోపణలు చేయడం వల్ల పవిత్రులమై పోతామనుకుంటే పప్పులో కాలేసినట్టే!
వరద ముంపునకు అవకాశముండే ప్రాంతంలో నగర నిర్మాణం పట్ల నిపుణులందరికీ అభ్యంతరాలున్నాయి. వెయ్యి కోట్ల ఖర్చుతో రెండు ఎత్తిపోతల పథకాలను పెట్టి, రెండు రిజర్వాయర్లు నిర్మించి అమరావతిని వరద ముప్పు నుంచి కాపాడేందుకు ప్రయత్నిస్తున్న సంగతి నిజమే కదా! ఇంత ఆయాసం దేనికి, వరదముప్పు లేని ప్రాంతంలో నిర్మించు కోవచ్చు కదా! అక్కడ ముందుగానే పాలక పెద్దల అనుయా యులు భూములు కొనుగోలు చేసినందువల్లనే ఎంత ప్రయా సైనా సరే అక్కడనే రాజధాని ఉండాలని ఆరాటపడుతున్నారని అనుమానం రావడంలో తప్పేముంది! వరదముప్పు పొంచి ఉన్నచోటనే నగర నిర్మాణం ఎందుకన్న సూటి ప్రశ్నకు ప్రభుత్వం దగ్గర సరైన సమాధానం ఉన్నదా?
మొదట సేకరించిన 54 వేల ఎకరాల్లోనే అభివృద్ధి పనులు ప్రారంభం కాకుండా ఇంకో 50 వేల ఎకరాలు కావాలని అడగడం దేనికి? అందులో తక్షణమే 20 వేల ఎకరాల సమీ కరణకు రంగం సిద్ధం చేయడంలో పారదర్శకత ఏమైనా వున్నదా? ఎవరూ అడగకుండానే ప్రభుత్వం దీని మీద వివరణ ఇవ్వవలసింది. కానీ, అడిగినవారి మీద ఎదురుదాడికి దిగడం వెనుక ఏదో గూడుపుఠాణీ ఉన్నదనే కదా అర్థం? సీఆర్‌డీఏ వెబ్‌సైట్‌లో పొందుపరిచిన వివరాల ప్రకారం తొలి దశ 54 వేల ఎకరాల్లో పార్కులు, రోడ్లు, చెరువులు వగైరాలు తీసేసిన అనంతరం 29 వేల పైచిలుకు భూములు అందుబాటులో ఉంటాయి. రైతులకు అభివృద్ధి చేసి ఇవ్వాల్సిన ప్లాట్లు, ఇప్పటి వరకు జరిపిన కేటాయింపులు, ప్రభుత్వ భవనాల అవసరాలు తీసివేసినా ఇంకా 18 వేల ఎకరాలకు పైగా సీఆర్‌డీఏ చేతిలో ఉన్నాయి.
మరి రైతులకు ఇవ్వాల్సిన ప్లాట్లను చెరువుల్లో, శ్మశానాల్లో ఎందుకు వేస్తున్నారు? ఈ కారణం వల్లనే రామారావు అనే రైతు గుండె పగిలి చనిపోయిన ఉదంతాన్ని విస్మరించగలమా? అమ్ముకోవడానికి ప్రభుత్వం చేతిలో 18 వేల ఎకరాలు స్థిరంగా ఉండగా ఇంత ఆదరా బాదరాగా ఇంకో 20 వేల ఎకరాల సేకరణలోని ఔచిత్యాన్ని ఎవరైనా అడిగితే వాళ్ల మీద ‘అమరా వతి ద్రోహులు’, ‘అభివృద్ధి నిరోధకులు’ అనే ముద్రలు వేయ డానికి యెల్లో కూటమి సర్వసన్నద్ధంగా ఉన్నది. అమరావతి సెల్ఫ్ ఫైనాన్స్ రాజధాని అవుతుందనీ, ప్రభుత్వం పైసా ఖర్చు చేయనవసరం లేదనీ చెప్పిన ప్రస్తుత ముఖ్యమంత్రి ఏడాది న్నరలోనే అమరావతి ఖాతాలో 50 వేల కోట్ల అప్పును ఎందుకు చేయవలసి వచ్చిందో వివరించాలని అడిగితే కూడా అమరావతి ద్రోహులవుతారా?

ఆంధ్రప్రదేశ్ ప్రజలకు కూటమి సర్కార్ సూటిగా సమాధానం చెప్పవలసిన ప్రశ్నలు చాలానే ఉన్నాయి. కానీ వాటిని అడిగిన వారి మీద శాపనార్థాలు ప్రయోగిస్తూ బండి లాగిస్తున్నారు. పద్దెనిమిది నుంచి అరవయ్యేళ్లలోపు వయసున్న మహిళలందరికీ నెలకు రూ.1,500 ఇస్తామన్న హామీ ఏమైందని ప్రశ్నించరాదు. నిరుద్యోగులకు నెలకు మూడువేల రూపాయల భృతి సంగతి ఏమిటని అడగరాదు. అడిగితే అభివృద్ధికి అడ్డుపడినట్టు. ఏపీ అంటే... ‘ఏ ఫర్ అమరావతి’, ‘పీ ఫర్ పోలవరం’ అని ప్రచారం చేసుకున్న బాబు సర్కార్ పోలవరం ప్రాజెక్టుకు చేసిన ద్రోహాన్ని కూడా ఎవ్వరూ ప్రశ్నించకూడదు.
గోదావరి ప్రవాహాన్ని మళ్లించే విధంగా స్పిల్‌వే, స్పిల్ ఛానల్, అప్రోచ్ ఛానల్, పైలట్ ఛానల్, ఎగువ దిగువ కాఫర్ డ్యామ్‌లు పూర్తి చేయకుండా, ఏవో ప్రయోజనాల కోసం పునాది డయా ఫ్రమ్ వాల్ వేసి, వరద కారణంగా అది దెబ్బతినడానికి కారణమయ్యారని వారిని అధిక్షేపించరాదు. ఈ చారిత్రక తప్పిదం వల్ల ఆ ప్రాజెక్టు ఇంకెంతకాలం కుంటుతుందో కూడా ఎవరూ చెప్పలేని పరిస్థితి ఏర్పడింది. పైగా కేంద్ర ప్రభుత్వమే పూర్తి బాధ్యతలతో నిర్మించాల్సిన ఈ ప్రాజెక్టును కేవలం తమ వారికి కాంట్రాక్టు పనిని అప్పగించడం కోసం ప్రత్యేక హోదాను తాకట్టు పెట్టి మరీ నెత్తినెత్తుకున్నారన్న అభియోగం నిజం కాదని నిరూపించగలరా? చివరికి కేంద్రం ఒత్తిడికి లొంగిపోయి, దాని ఎత్తు తగ్గించి బరాజ్ స్థాయికి కుదించలేదా? ఈ విషయం నిజమా... కాదా?
ఏ ఫర్ అమరావతి. పీ ఫర్ పోలవరం... ఈ రెండింటిలోనూ పారదర్శకత కనిపించడం లేదు. ఈ రెండింటిలోనూ గోల్‌మాల్ జరుగుతున్నదనే ఆరోపణలు నిజమైతే విభజిత రాష్ట్రానికి అంతకంటే పెద్ద ద్రోహం ఇంకేమన్నా ఉంటుందా? ఇవే కాదు, రాష్ట్రంలో కూటమి సర్కార్ అమలు చేస్తున్న విధా నాలు పేదలు, మధ్యతరగతి ప్రజలకు వ్యతిరేకంగా ఉన్నాయని ఇవాళ రాష్ట్రంలో ఎవరిని కదిలించినా చెబుతున్నారు.
ఏ ప్రయోజనాల్ని ఆశించి ప్రైవేట్ పెట్టుబడికి ఊడిగం చేసే పాత్రను పోషిస్తున్నారు? విశాఖ నగరానికి ఇంతకాలం ఆయువుపట్లుగా నిలిచిన విశాఖ ఉక్కు, విశాఖ పోర్టులను దెబ్బతీయడం కోసమే మిట్టల్ స్టీల్స్‌కు సముద్రతీరం వెంబడి మూడు కిలోమీటర్ల పొడవునా ప్రైవేట్ పోర్టును కేటాయించారనీ, క్యాప్టివ్ మైన్స్ ఇప్పించడం కోసం కేంద్రం దగ్గరికి ఎంపీలను పంపించారనీ వచ్చిన ఆరోపణలు నిజమా, కాదా? సూటిగా సమాధానం చెప్పగలరా? ప్రపంచంలోని నాగరిక దేశాలన్నీ విద్య, ఆరోగ్య రంగాలను ప్రజల ప్రాథమిక హక్కుగా గుర్తిస్తుంటే కూటమి ప్రభుత్వం మాత్రం అంగడి సరుకుగా మార్చిందనడానికి ఈ పందొమ్మిది నెలల పాలన రుజువు కాదా? ప్రజల మనసుల్లో ఇటువంటి ప్రశ్నలు ఇంకా చాలా ఉన్నాయి. కానీ ఇందులో దేనికీ కూటమి సర్కార్ సూటిగా సమాధానం చెప్పే అవకాశం లేదు. కనుక ఈ శేష కాలాన్ని శాపనార్థాలతోనే వారు గడిపేస్తారని భావించవచ్చు.
వర్ధెల్లి మురళి
vardhelli1959@gmail.com


