‘అంతర్జాతీయ న్యాయం నాకు అవసరం లేదు. అధ్యక్షుడిగా నా అధికారానికి పరిమితులు విధించేదీ, దాన్ని నిరోధించేదీ నా నైతికత మాత్రమే’ అని అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ వెనిజులా అధ్యక్షుడు నికోలస్ మదురోను అపహరించాక ప్రకటించారు. ఇప్పటికే ఆయన నైతికత ఎలాంటిదో రుజువైంది గనుక భిన్నరంగాల్లో విశేషంగా కృషి చేస్తున్న అంతర్జాతీయ సంస్థల నుంచి వైదొలగుతున్నామని తాజాగా ఆయన చెప్పటం ఎవరినీ ఆశ్చర్యపరచలేదు. ఈ నిర్ణయం కారణంగా మొత్తం 66 సంస్థల నుంచి అమెరికా తప్పుకుంటుంది. ఇందులో ఐక్యరాజ్యసమితికి చెందినవి 31 కాగా, ఇతర సంస్థలు 35. భావోద్వేగాలకు లోనుకావటం వల్లనో, ప్రలోభాలకు ఆశపడటంవల్లనో అనర్హుల్ని అందలం ఎక్కించిన దేశం కష్టాల్లో పడుతుంది.
కానీ అమెరికా ప్రజలు చేసే తప్పు ప్రపంచాన్ని కకావికలు చేస్తుందని ఏడాది కాలంగా అందరికీ అర్థమవుతోంది. తనకు తోచిందే న్యాయం, తాను చెప్పిందే ధర్మంగా ఇంటా బయటా ఆయన తీసుకుంటున్న నిర్ణయాలు ప్రపంచాన్ని సరే... అమెరికాను కూడా ప్రమాదంలోకి నెట్టేస్తున్నాయి. అంతర్జాతీయ సంస్థల నుంచి బయటకు రావటానికి ఆయన చెబుతున్న కారణాలు చిత్రమైనవి. ఆ సంస్థలు అమెరికా ప్రయోజనాలను నెరవేర్చటం లేదట! నిరుడు అధికారంలోకొచ్చిన వెంటనే 2015 నాటి పారిస్ ఒప్పందం నుంచి వైదొలగారు. ప్రపంచ ఆరోగ్యసంస్థ నుంచి బయటికొచ్చారు. నిబంధనల ప్రకారం ఈనెల 20 నుంచి అది అమలవుతుంది. తాజా నిర్ణయం వల్ల అధికంగా సమస్యలెదుర్కొనే సంస్థలు వాతావరణ పరిశోధనలకు సంబంధించినవి.
వాతావరణం గురించి, అది క్షీణిస్తున్న తీరు గురించి ఎవరైనా మాట్లాడినప్పుడల్లా అమెరికాకు చిర్రెత్తుకొస్తుంటుంది. ఇది ట్రంప్‌తోనే మొదలు కాలేదు. వాతావరణ మార్పుపై ఐక్యరాజ్యసమితి ఆధ్వర్యంలో 1997లో కుదిరిన క్యోటో ప్రోటోకాల్‌కు అమెరికా దూరంగా ఉండిపోయింది. ఎందుకంటే ఆ ప్రోటోకాల్ ప్రకారం ప్రతి దేశమూ ఉద్గారాల తగ్గింపునకు లక్ష్య నిర్దేశం చేసుకోవాలి. దాన్ని సాధించటానికి ప్రయత్నించినట్టు చూపాలి. ప్రపంచాన్ని కాలుష్యభరితం చేయటంలో ముందువరసలో ఉండే అమెరికాకు ఇలాంటి ఆంక్షలు నచ్చుతాయా? కనుకనే దాన్ని పూర్తిగా బేఖాతరు చేస్తూ ఆ ప్రోటోకాల్ వెలుపలే ఉండిపోయింది.
నిజానికి క్యోటో ప్రోటోకాల్‌ను నీరుగార్చటానికీ, తాను చిత్తశుద్ధితో పనిచేస్తున్నట్టు చెప్పుకోవటానికీ 2015లో అందరినీ మభ్యపెట్టి ప్యారిస్ ఒడంబడికకు దోహదపడింది. కానీ ఆ మరుక్షణం నుంచీ అటకెక్కించింది. ఎంతో వెనకబడిన దేశాలనుకున్నవి సైతం తమ శక్తి మేరకు ఆ ఒప్పందం అమలుకు చర్యలు తీసుకోగా, అమెరికా చేసింది దాదాపు శూన్యం. ఉద్గారాలను పరిమితం చేయగల హరిత సాంకేతిక తపై విస్తృతమైన పరిశోధనలు జరుగుతున్నా, వాటి పర్యవసానంగా ప్రభావ వంతమైన ఆవిష్కరణలు సాధ్యమైనా సక్రమంగా ఆచరణలో పెట్టింది లేదు. పోనీ దాన్ని బడుగు దేశాలకు చవగ్గా అందించాలని కోరినా ఉలుకూ పలుకూ లేదు. పాలకుడెవరైనా
అమెరికా తీరు ఇంతే!
కాకపోతే ట్రంప్ వారిని మించిన ఘనుడు. అసలు వాతావరణ మార్పు అనేదే బూటకమని ఆయన వాదన. భూగోళం మరింత వేడెక్కకుండా ఉండాలంటే 2030 నాటికి అన్ని దేశాలూ 2005 నాటి కర్బన ఉద్గారాల పరిమాణంలో 33 నుంచి 35 శాతం మేర తగ్గించాలని ప్యారిస్ శిఖరాగ్ర సదస్సు నిర్ణయించింది. కానీ ట్రంప్ మూర్ఖత్వం కారణంగా ఆ లక్ష్యసాధన ఇక అసాధ్యం. ఆయన హరిత ఇంధన సాంకేతికతల్ని పూర్తిగా పక్కకు పెట్టడమే కాదు... చమురు వాడకాన్ని మరింత పెంచే చర్యలు తీసుకుంటున్నారు.
ట్రంప్ తాజా నిర్ణయం వల్ల ఐక్యరాజ్యసమితి ఆధ్వర్యంలోని ఇతర ముఖ్య సంస్థలు సైతం నిధుల కొరతతో నీరసిస్తాయి. ఘర్షణాత్మక ప్రాంతాల్లో పిల్లల బాగోగుల కోసం పని చేయటం, అటువంటి ప్రాంతాల్లో చోటుచేసుకునే లైంగిక నేరాల్ని అరికట్టడం వంటి అంశాల్లో పనిచేసే ప్రతినిధుల్ని అమెరికా ఉపసంహరించుకుంటుంది. భారత్, ఫ్రాన్స్‌ల చొరవతో ఏర్పాటైన అంతర్జాతీయ సౌర కూటమి(ఐఎస్‌ఏ) కూడా ఈ జాబితాలో ఉంది. ప్రపంచానికి తన వంతుగా లేశమాత్రమైనా మంచిచేసేది లేదని ట్రంప్ చాటుతున్నారు. కనుక ఇకపై ఈ ధూర్తదేశంతో ఎలా వ్యవహరించాలో ప్రపంచ దేశాలు నేర్చు కోక తప్పదు.


