స్వీయ నియంత్రణ సరిపోదు.. అది విఫలమైంది కూడా
అశ్లీల, వికృత పోకడలను అడ్డుకునేందుకు ప్రత్యేక వ్యవస్థ అవసరం
యూట్యూబ్, ఓటీటీ కంటెంట్‌పై సుప్రీం వ్యాఖ్యలు
సాక్షి, న్యూఢిల్లీ: ఆన్‌లైన్ వేదికలు, సామాజిక మాధ్యమాల్లో విచ్చలవిడిగా వస్తున్న అశ్లీల, అసభ్యకర కంటెంట్‌పై సుప్రీంకోర్టు తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. ప్రస్తుతం ఆన్‌లైన్ ప్లా్లట్‌ఫామ్‌లు పాటిస్తున్నామని చెబుతున్న స్వీయ నియంత్రణ విధానం పూర్తిగా విఫలమైందని, అసలు అది ఓ బూటకమని ఘాటు వ్యాఖ్యలు చేసింది.
ఈ అరాచకాన్ని అడ్డుకునేందుకు ప్రభుత్వ ప్రమేయం లేని, మీడియా సంస్థల ప్రభావం లేని ఒక అత్యంత శక్తివంతమైన ‘స్వతంత్ర, తటస్థ స్వయం ప్రతిపత్తి’కలిగిన వ్యవస్థ అత్యవసరమని ప్రధాన న్యాయమూర్తి (సీజేఐ) జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ జాయ్‌మాల్య బాగ్చీల ధర్మాసనం స్పష్టం చేసింది. ‘ఇండియాస్ గాట్ లేటెంట్’అనే షోలో అశ్లీల కంటెంట్, దివ్యాంగులను కించపరిచేలా జోకులు వేశారన్న ఆరోపణలపై నమోదైన ఎఫ్‌ఐఆర్‌లను సవాల్ చేస్తూ పాడ్‌కాస్టర్ రణవీర్ అల్హాబాదియా తదితరులు చేసిన పిటిషన్ల విచారణ సందర్భంగా గురువారం ధర్మాసనం ఈ కీలక వ్యాఖ్యలు చేసింది.
వికృత పోకడలు..
సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా వాదనలు వినిపిస్తూ.. సమస్య కేవలం అశ్లీలతకే పరిమితం కాలేదని, యూజర్ జనరేటెడ్ కంటెంట్ పేరుతో వికృత పోకడలు పెరిగిపోతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. దీనిపై స్పందించిన సీజేఐ.. ‘ఎవరికి వారే సొంత చానల్స్ క్రియేట్ చేసుకుంటున్నారు. ఎవరికీ జవాబుదారీతనం లేకుండా పోతోంది. ఎవరో ఒకరు బాధ్యత వహించాల్సిందే కదా. నేను ఎవరికీ జవాబుదారీ కాదంటే ఎలా కుదురుతుంది? సమాజంలో విషం చిమ్ముతుంటే చూస్తూ ఊరుకోవాలా? ఎవరో ఒకరు బాధ్యత వహించాల్సిందే. అడిగే వారు లేరని ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తామంటే చట్టం ఒప్పుకోదు’అని స్పష్టం చేశారు. వాక్‌స్వాతంత్య్రం అమూల్యమైనదే కానీ, అది వికృత పోకడలకు దారితీయకూడదని సొలిసిటర్ జనరల్ పేర్కొన్నారు. అడల్ట్ కంటెంట్ ఉంటే కనీసం ముందస్తు హెచ్చరికలైనా ఉండాలని సీజేఐ అభిప్రాయపడ్డారు.
స్వయం ప్రకటిత సంస్థలతో పనికాదు
నెట్‌ఫ్లిక్స్ వంటి ఓటీటీ ప్లాట్‌ఫామ్‌ల తరఫున సీనియర్ న్యాయవాది అమిత్ సిబల్ వాదనలు వినిపిస్తూ.. ఇప్పటికే ఐటీ రూల్స్–2021 అమల్లో ఉన్నాయని, జస్టిస్ గీతా మిట్టల్ నేతృత్వంలో స్వీయ నియంత్రణ వ్యవస్థ పనిచేస్తోందని తెలిపారు. దీనిపై సీజేఐ అభ్యంతరం వ్యక్తం చేశారు. ’స్వయం ప్రకటిత సంస్థల వల్ల ప్రయోజనం లేదు. ఒకవేళ మీ స్వీయ నియంత్రణ అంత గొప్పగా ఉంటే, ఉల్లంఘనలు ఎందుకు పదేపదే జరుగుతున్నాయి?’అని ప్రశ్నించారు. వాణిజ్య ప్రయోజనాల కోసం పనిచేసే వారి ప్రభావం లేని, ప్రభుత్వానికి కూడా సంబంధం లేని ఒక తటస్థ వ్యవస్థ ద్వారానే నియంత్రణ సాధ్యమని సీజేఐ స్పష్టం చేశారు.
త్వరలో నూతన మార్గదర్శకాలు: కేంద్రం
ఆన్‌లైన్ కంటెంట్ నియంత్రణకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం కొత్త మార్గదర్శకాలను ప్రతిపా దిస్తోందని అటార్నీ జనరల్ ఆర్.వెంకటరమణి తెలిపారు. స్పందించిన ధర్మాసనం.. ముసా యిదా మార్గదర్శకాలను పబ్లిక్ డొమైన్‌లో ఉంచి, ప్రజలు, నిపుణుల నుంచి అభిప్రాయాలు సేక రించాలని సూచించింది. అనంతరం న్యాయరంగ నిపుణులతో ఒక కమిటీని ఏర్పాటు చేయాలని పేర్కొంది. కేసుపై తదుపరి విచారణను ధర్మాస నం నాలుగు వారాలకు వాయిదా వేసింది.


