దోపిడీ నాదే.. దర్యాప్తూ నాదే!.. బాబు అక్రమాలకు ‘పచ్చ’ తర్పణం! | Chandrababu Efforts To Close Corruption Cases Against Him | Sakshi
Sakshi News home page

దోపిడీ నాదే.. దర్యాప్తూ నాదే!.. బాబు అక్రమాలకు ‘పచ్చ’ తర్పణం!

Nov 26 2025 2:58 AM | Updated on Nov 26 2025 4:20 AM

Chandrababu Efforts To Close Corruption Cases Against Him

అధికారంలో ఉండగానే అవినీతి ఇల్లు చక్కబెడుతున్న టీడీపీ పెద్దలు 

కూటమి సర్కారు అధికారంలోకి రాగానే కుట్రకు శ్రీకారం

ఫిర్యాదుదారులు, సాక్షులను బెదిరించి అబద్ధపు వాంగ్మూలాలు, పిటిషన్లు

చంద్రబాబు అవినీతిపై గతంలోనే ఫిర్యాదు చేసిన బెవరేజస్‌ కార్పొరేషన్‌ ఎండీ  

ప్రస్తుతం దర్యాప్తు అవసరం లేదని ఆయనే మళ్లీ కోర్టులో పిటిషన్‌ దాఖలు..

అదే బాటలో అప్పటి సీఆర్‌డీయే కమిషనర్‌ చెరుకూరి శ్రీధర్‌ 

గతంలో ఇచ్చిన సీఆర్‌పీసీ 164 వాంగ్మూలానికి భిన్నంగా అబద్ధపు వాంగ్మూలం..

అదే పచ్చ పాటపాడిన అప్పటి ఫైబర్‌నెట్‌ ఎండీ మధుసూదన్‌రెడ్డి 

చంద్రబాబుపై అవినీతి కేసులు అర్ధాంతరంగా మూసివేతకు పక్కా పన్నాగం..

ఆస్థాన న్యాయవాది సిద్ధార్థ లూథ్రా నేతృత్వంలో కుతంత్రం 

ఇప్పటికే దర్యాప్తు నిలిపివేసిన పోలీసులు 

చార్జ్‌షీట్లను అటకెక్కించిన సీఐడీ 

గతంలో చంద్రబాబు అవినీతిని నిగ్గు తేల్చిన సీఐడీ..

అబ్బే.. ఆధారాలు లేవని తాజాగా నివేదిక!.. క్లైమాక్స్‌కు చేరిన కుతంత్రం 

తనపై అవినీతి కేసుల మూసివేతకు చంద్రబాబు బరితెగింపు ఇదీ!  

సాక్షి, అమరావతి: చంద్రబాబు బరితెగించి సాగించిన అవినీతి దందాను చాప చుట్టేసేందుకు టీడీపీ కూటమి ప్రభుత్వం కుట్ర కార్యాచరణను వేగవంతం చేసింది. అధికారంలో ఉండగానే ఆ అవినీతి కేసులను క్లోజ్‌ చేసేయాలన్న కుతంత్రమే ఏకైక అజెండాగా చెలరేగిపోతోంది. తనపై నమోదైన అవినీతి కేసులకు సంబంధించి దర్యాప్తు అధికారులతో చంద్రబాబు కొద్ది  నెలల క్రితం సమీక్షా సమావేశం నిర్వహించడం గమనార్హం. అంటే ఆ కేసులను ఎలా క్లోజ్‌ చేయాలో ఆయనే దిశానిర్దేశం చేసినట్లు అప్పుడే స్పష్టమైంది.

అనంతరం చంద్రబాబు తన ఆస్థాన న్యాయవాది సిద్ధార్థ లూథ్రాకు ఆ కేసుల మూసివేత బాధ్యతను ప్రత్యేకంగా అప్పగించారు. మాజీ డీజీపీ ద్వారకా తిరుమలరావు, ప్రస్తుత డీజీపీ హరీశ్‌ కుమార్‌ గుప్తా, సీఐడీ చీఫ్‌ రవి శంకర్‌ అయ్యన్నార్‌ ద్వారా రాజ్యాంగ వ్యవస్థలను దుర్వినియోగం చేశారు. గతంలో చంద్రబాబు అవినీతిపై సీఐడీకి ఫిర్యాదు చేసిన అప్పటి బెవరేజస్‌ కార్పొరేషన్‌ ఎండీ వాసుదేవరెడ్డి, ఫైబర్‌ నెట్‌ కార్పొరేషన్‌ ఎండీ మధుసూదన్‌ రెడ్డి, అప్పటి సీఆర్‌డీయే కమిషనర్‌ శ్రీధర్‌... ఇలా అందరూ ప్రభుత్వ వేధింపులకు తలొగ్గారు.

గతంలో తాము చేసిన ఫిర్యాదులు, ఇచ్చిన వాంగ్మూలాలకు విరుద్ధంగా అబ్బే..! దర్యాప్తు అవసరం లేదని న్యాయస్థానంలో పిటిషన్లు దాఖలు చేశారు. గతంలో ఇచ్చిన వాంగ్మూలానికి పూర్తి భిన్నంగా అబద్ధపు వాంగ్మూలాలు ఇచ్చారు. అలా సామ దాన బేధ దండోపాయాలను ప్రయో­గించి మరీ చంద్రబాబుపై అవినీతి కేసులు అర్ధాంతరంగా మూసివేతకు టీడీపీ కూటమి ప్రభుత్వం ఏడాదిన్నరగా సాగిస్తున్న కుతంత్రాన్ని క్లైమాక్స్‌కు తెచ్చింది. బరితెగించి అడ్డగోలుగా సాగించిన అవినీతి కేసుల్లో అసలు ఆధారాలే లేవని చంద్ర­బాబు గూటి చిలుక సీఐడీ ఇప్పటికే నివేదించినట్లు సమాచారం. ఇక అధికారిక ప్రకటనే తరువాయి అని పోలీసువర్గాలు వ్యాఖ్యానిస్తున్నాయి.

దర్యాప్తును అటకెక్కించిన కూటమి సర్కారు
చంద్రబాబే ప్రధాన నిందితుడుగా ఉన్న స్కిల్‌ స్కామ్‌ కేసు దర్యాప్తును టీడీపీ కూటమి ప్రభుత్వం అటకెక్కించేసింది. స్కిల్‌ స్కామ్, ఇన్నర్‌ రింగ్‌ రోడ్‌ అలైన్‌మెంట్‌ కుంభకోణం, ఫైబర్‌నెట్, అసైన్డ్‌ భూముల కుంభకోణం కేసుల చార్జిషీట్లను సీఐడీ గతంలోనే న్యాయస్థానానికి సమర్పించింది. అయితే కొన్ని వివరణలు కోరుతూ న్యాయస్థానం వాటిని గత ఏడాది మేలో సీఐడీకి పంపింది.

అప్పటి పబ్లిక్‌ ప్రాసిక్యూటర్లు వాటిని కేస్‌ స్టడీలతో సీఐడీ అధికారులకు అందచేశారు. కానీ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడంతో ఆ కేసులను నీరుగార్చేలా టీడీపీ పెద్దలు సీఐడీపై తీవ్ర ఒత్తిడి తెస్తున్నారు. దీంతో సీఐడీ ఆ చార్జిషీట్లను న్యాయ­స్థానానికి సమర్పించనే లేదు. కేసుల దర్యాప్తును పూర్తి చేసేందుకు ప్రయత్నించలేదు. ప్రభుత్వ పెద్దల కుట్రను అమలు చేస్తూ చార్జ్‌షీట్లను తొక్కిపెట్టింది. 

సాక్షులకు బెదిరింపులు.. తప్పుడు వాంగ్మూలాలు
చంద్రబాబుపై అవినీతి కేసులను నీరుగార్చేందుకు టీడీపీ కూటమి ప్రభుత్వం వేధింపులకు బరి తెగించింది. గతంలో వాంగ్మూలాలు ఇచ్చిన ఉన్నతా«­దికారులు, ఇతరులను తీవ్రస్థాయిలో బెదిరించి బెంబేలెత్తించింది. సాక్షులను బెదిరించి దారికి తెచ్చుకోకపోతే చంద్రబాబును ఈ అవినీతి కేసుల నుంచి బయటపడేయడం సాధ్యం కాదని తేలడంతో పోలీసు, సీఐడీ అధికారులు కుట్రపూరితంగా చెలరేగిపోతున్నారు. చంద్రబాబు అవినీతిపై గతంలో ఫిర్యాదు చేసిన అప్పటి బెవరేజస్‌ కార్పొరేషన్‌ ఎండీ వాసుదేవరెడ్డి, ఫైబర్‌ నెట్‌ ఎండీ మధుసూదన్‌రెడ్డి తదితరులను పోలీసులు బెదిరించి వేధించారు.

ఇప్పటికే గత ప్రభుత్వ మద్యం విధానంపై అక్రమ కేసులో అబద్ధపు వాంగ్మూలాలు ఇచ్చిన వాసుదేవరెడ్డి... తాజాగా చంద్రబాబు హయాంలో మద్యం దోపిడీకి సంబంధించిన కేసులో గతంలో తాను ఇచ్చిన ఫిర్యాదుకు విరుద్ధంగా స్పందించినట్టు సమాచారం. తద్వారా ఆ కేసు మూసివేతకు ఆయన సహకరించారని తెలుస్తోంది. అదే రీతిలో మధుసూదన్‌రెడ్డి కూడా పోలీసుల వేధింపులకు తలొగ్గి అబద్ధపు వాంగ్మూలం నమోదు చేసినట్లు సమాచారం.

ఇక అసైన్డ్‌ భూముల కేసులో గతంలో చంద్రబాబు అవినీతిపై న్యాయస్థానంలో 164 సీఆర్‌పీసీ వాంగ్మూలం ఇచ్చిన అప్పటి సీఆర్‌డీఏ కమిషనర్‌ చెరుకూరి శ్రీధర్‌ ఇప్పటికే ప్లేటు ఫిరాయించారు. ప్రభుత్వ పెద్దల ఒత్తిడి, పోలీసు ఉన్నతాధికారుల వేధింపులతో ఆయన గతంలో ఇచ్చిన వాంగ్మూలానికి విరుద్ధమైన వాంగ్మూలాన్ని గుంటూరు కోర్టులో నమోదు చేశారు. ఇన్నర్‌రింగ్‌ రోడ్డు అలైన్‌మెంట్‌ కేసు, ఇసుక కేసు, స్కిల్‌ స్కామ్‌లలో కూడా టీడీపీ పెద్దలు ఇదే రీతిలో ఫిర్యాదుదారులు, సాక్షులను బెదిరించి లొంగదీసుకుంటున్నారు. 

అటూ ఇటూ బాబే... ఇక మూసివేతే! 
ఇలా చంద్రబాబు అవినీతి కేసులను అర్ధాంతరంగా మూసివేసే కుట్రను టీడీపీ కూటమి ప్రభుత్వం క్లైమాక్స్‌కు తెచ్చింది. అందుకు అవసరమైన న్యాయపరమైన ప్రక్రియను కూడా దాదాపుగా పూర్తి చేసినట్లు తెలుస్తోంది. అయితే చంద్రబాబు పాల్పడిన అవినీతి కేసుల్లో ప్రస్తుతం విచిత్రమైన పరిస్థితి నెలకొంది. స్కిల్‌ స్కామ్, అసైన్డ్‌ భూముల దోపిడీ, ఇన్నర్‌ రింగ్‌ రోడ్‌ అలైన్‌మెంట్‌లో అక్రమాలు, ఫైబర్‌ నెట్‌ ప్రాజెక్టులో కుంభకోణం, మద్యం దందా, ఇసుక మాఫియా... ఇలా అన్ని కేసుల్లోనూ ప్రధాన నిందితుడు చంద్రబాబే. ఆ అవినీతి బాగోతం కేసులపై దర్యాప్తు చేసి న్యాయస్థానానికి ఆధారాలు సమర్పించి నిందితులకు శిక్షపడేలా చేయాల్సింది దర్యాప్తు సంస్థ సీఐడీ, పోలీసు శాఖలే.

కానీ ప్రస్తుతం ముఖ్యమంత్రిగా చంద్రబాబే పోలీసు, సీఐడీ విభాగాలకు బాస్‌గా వ్యవహరిస్తున్నారు. ఐపీఎస్‌ అధికారుల పోస్టింగులు, పదోన్నతులు అన్నీ ఆయన చేతిలోనే ఉన్నాయి. ఆ రెండు విభాగాలూ ఆయన చెప్పినట్లు వినాల్సిందే. దీంతో తనపై అవినీతి కేసులను వెంటనే క్లోజ్‌ చేయాలని ఆయన ఆదేశించగానే పోలీసు, సీఐడీ విభాగాలు అమలు చేస్తున్నాయి. గతంలో చంద్రబాబు అవినీతిపై అప్పటి ప్రభుత్వ అధికారులు పోలీసులు, సీఐడీకి ఫిర్యాదు చేశారు. వారిపై ప్రస్తుతం కూటమి ప్రభుత్వం వేధింపులకు పాల్పడుతోంది.

చంద్రబాబు అవినీతిపై ఇచ్చిన ఫిర్యాదుల మేరకు నమోదు చేసిన కేసుల్లో నిష్పాక్షిక, సమగ్ర దర్యాప్తు కోసం పట్టుబట్టకూడదని వేధిస్తోంది. ప్రభుత్వ వేధింపులు తట్టుకోలేక ఆ అధికారులు అందుకు తలొగ్గుతున్నారు. దీనిపై ఎవరైనా తటస్థ వ్యక్తులు, సామాజికవేత్తలు ప్రశ్నిస్తే .. సాంకేతిక కారణాలు చెబుతూ తప్పించుకుంటున్నారు.

చంద్రబాబు అవినీతి కేసుల్లో సీఐడీ దాఖలు చేసిన పిటిషన్ల కాపీల కోసం పాత్రికేయుడు బాలగంగాధర్‌ తిలక్‌ పిటిషన్‌ దాఖలు చేశారు. కానీ ‘మీరు ఫిర్యాదుదారుడు కాదు.. బాధితుడు కూడా కాదు కదా.. !’అని న్యాయస్థానం వ్యాఖ్యానించింది. ఫిర్యాదుదారులైన అప్పటి అధికారులు ప్రస్తుతం కూటమి సర్కారు వేధింపులతో మౌనం దాలుస్తున్నారు. టీడీపీ పెద్దల కుట్రలకు వంతపాడుతున్నారు. దాంతో అటు దొంగ... ఇటు పోలీసు రెండూ బాబే అన్నట్టుగా పరిస్థితి తయారైంది. దీన్నే అవకాశంగా చేసుకుని చంద్రబాబుపై అవినీతి కేసులను గుట్టుచప్పుడు కాకుండా మూసివేసేందుకు పావులు చకచకా కదుపుతున్నట్లు స్పష్టమవుతోంది.

కేసుల మూసివేతకు పక్కా పన్నాగం.. లూథ్రా గుప్పిట్లో పోలీసు శాఖ
చంద్రబాబే సూత్రధారి, లబ్ధిదారుగా సాగిన కుంభకోణాల కేసుల మూసివేత కుతంత్రానికి టీడీపీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే తెరతీసింది. ఈ అవినీతి బాగోతంపై గతంలో సీఐడీ ఆధారాలతో సహా నిగ్గు తేల్చిన విషయం తెలిసిందే.  2014–19 మధ్య టీడీపీ హయాంలో చంద్రబాబు సూత్రధారిగా పాల్పడిన స్కిల్‌ డెవల­ప్‌మెంట్‌ కార్పొరేషన్‌ కుంభకోణం, అమరావ­తిలో అసైన్డ్‌ భూముల దోపిడీ, ఇన్నర్‌ రింగ్‌ రోడ్‌ అలైన్‌మెంట్‌ కుంభకోణం, ఫైబర్‌ నెట్‌ ప్రాజెక్టులో నిధులు కొల్లగొట్టడంతోపాటు మద్యం, ఇసుక కుంభకోణాల్లో భారీ దోపిడీకి పాల్పడినట్లు వెల్లడైంది. వీటిపై సీఐడీ ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్‌) పూర్తి ఆధారాలతో నివేదించింది.

అందులో స్కిల్‌ స్కామ్‌ కేసులో చంద్రబాబును అరెస్ట్‌ చేయగా.. ఏసీబీ న్యాయస్థానం ఆయనకు రిమాండ్‌ విధించింది. 52 రోజులపాటు రాజమహేంద్రవరం కేంద్ర కారాగారంలో చంద్రబాబు రిమాండ్‌ ఖైదీగా ఉన్నారు. మిగిలిన ఐదు కేసులు కూడా సీఐడీ విచారణలోనే ఉన్నాయి. కాగా ఆ కేసులను అడ్డగోలుగా మూసివేయించేందుకు టీడీపీ కూటమి ప్రభుత్వం ఏడాదిన్నరగా కుతంత్రాన్ని సాగిస్తోంది. అందుకోసం చంద్రబాబు తన ఆస్థాన న్యాయవాది సిద్ధార్థ లూథ్రాను ప్రత్యేకంగా పురమాయించారు. యావత్‌ పోలీసు, న్యాయ శాఖలను ఆయన గుప్పిట్లో పెట్టారు.

ఈ క్రమంలో ఆయన కొన్ని నెలల క్రితం విజయవాడలోని ఓ స్టార్‌ హోటల్‌లో పోలీసు, సీఐడీ ఉన్నతాధికా­రులతో ప్రత్యేకంగా భేటీ కావడం గమనార్హం. అవినీతి కేసుల ఎఫ్‌ఐఆర్‌ల నుంచి చంద్రబాబు పేరును తప్పించడం.. అనంతరం ఆ కేసులను మూసివే­యడం.. అందుకు ఆ కేసుల్లో సాక్షు­లను ఎలా వేధించాలి..? ఎలా తప్పుడు వాంగ్మూలాలు నమో­దు చేయాలి..?  న్యాయపరంగా ఇబ్బందులు రాకుండా ఎలాంటి అడ్డదారులు తొక్కాలి..? అనే విషయాలను ఆయన పోలీసు, సీఐడీ అధికారులకు అంశాలవారీగా వివరించారని తెలుస్తోంది.

న్యాయ విచారణకు సహాయ నిరాకరణ
న్యాయస్థానాల్లో కొనసాగుతున్న చంద్రబాబు అవినీతి కేసుల విచారణకు న్యాయ శాఖ సహాయ నిరాకరణ చేస్తోంది.  స్కిల్‌స్కామ్‌ కేసులో 2023లో బెయిల్‌ మంజూరు చేస్తూ సుప్రీం కోర్టు, హైకోర్టు విధించిన షరతులను చంద్రబాబు నిర్భీతిగా ఉల్లంఘించారు. దర్యాప్తు అధికారులను బెదిరిస్తూ.. రెడ్‌బుక్‌ పేరిట హెచ్చరిస్తూ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. షరతులు ఉల్లంఘించినందున చంద్రబాబు బెయిల్‌ను రద్దు చేయాలని సీఐడీ 2023 డిసెంబర్‌లోనే సుప్రీం కోర్టులో పిటిషన్‌ దాఖలు చేసింది. దానిపై విచారణ కొనసాగుతోంది. రాష్ట్రంలో టీడీపీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత సీఐడీ రూటు మార్చేసింది. సుప్రీం కోర్టులో వేసిన పిటిషన్‌పై విచారణకు సహకరించడం లేదు. సుప్రీం కోర్టులో సీఐడీ వాదనను వినిపించాల్సిన ఏపీ ప్రభుత్వ న్యాయవాది  వాయిదాల మీద వాయిదాలు కోరుతున్నారు. అది సరి కాదని సుప్రీం కోర్టు హితవు పలికినా తీరు మారడంలేదు.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement