సాక్షి, గుంటూరు: కూటమి పాలనలో సంక్షేమం లేదని వైఎస్సార్‌సీపీ నేతలు ఆరోపించారు. ప్రైవేట్ స్కూల్స్‌లో ఫీజులు కట్టలేక తల్లితండ్రులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని చెప్పుకొచ్చారు. అలాగే, సంక్రాంతి అంటేనే అంబటి రాంబాబు.. ఆయననే డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఫాలో అవుతున్నారని తెలిపారు.
గుంటూరు వెస్ట్ నియోజకవర్గంలో జిల్లా అధ్యక్షులు అంబటి రాంబాబు ఆధ్వర్యంలో వైఎస్సార్ సంక్రాంతి ముగ్గుల పోటీలు జరిగాయి. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రులు అంబటి రాంబాబు, ఆర్కే రోజా, వైఎస్సార్‌సీపీ నేతలు అన్నబత్తుని శివ కుమార్, నూరి ఫాతిమా, కారుమూరి వెంకట రెడ్డి, పార్టీ కార్పొరేటర్లు, నాయకులు పాల్గొన్నారు. ఈ క్రమంలో ముగ్గుల పోటీల్లో గెలుపొందిన వారికి బహుమతులు అందించారు. ఈ పోటీల్లో గీతాంజలి లక్ష రూపాయల మొదటి ప్రైజ్ గెలుచుకుంది.
ఈ సందర్బంగా మాజీ మంత్రి అంబటి రాంబాబు మాట్లాడుతూ..‘ఆర్కే రోజా అంటే ఫైర్ బ్రాండ్.. రోజా మొదటిసారి ఎమ్మెల్యే కాగానే ఆమెను సంవత్సరం పాటు సస్పెండ్ చేయించి చంద్రబాబు నాయుడు ఎన్నో ఇబ్బందులు పెట్టాడు. అయినా ఎక్కడా వెనుక తగ్గలేదు. మా ప్రభుత్వం అధికారం రాగానే మొదటి క్యాబినెట్లో మాకు మంత్రి పదవులు లభించలేదు. వైఎస్ జగన్‌కు ఎప్పుడు ఎక్కడ పదవులు ఇవ్వాలో తెలుసు. రోజా, నేను ఒకేసారి కేబినెట్‌లోకి వెళ్లాం. కూటమి ప్రభుత్వం రోజాపై, నాపై అక్రమ కేసులు పెట్టి ఇబ్బందులు పెట్టాలని అనేక ప్రయత్నాలు చేస్తున్నారు. అక్రమ కేసులు బయటపడే వాళ్ళం కాదు అని చెప్పుకొచ్చారు.
సంక్రాంతికి నేను డాన్స్ వేస్తే
సంబరాల రాంబాబునా?
మరి పవన్ డాన్స్ వేస్తే ?@PawanKalyan pic.twitter.com/3VxGOZ9vaB— Ambati Rambabu (@AmbatiRambabu) January 9, 2026
మాజీ మంత్రి రోజా మాట్లాడుతూ..‘సంక్రాంతి సంబరాల్లో పాల్గొనే అవకాశం రావటం చాలా సంతోషంగా ఉంది. సంక్రాంతి అంటే మొదట గుర్తు వచ్చేది ముగ్గుల పోటీలు. రాంబాబు అంటే సంక్రాంతి, సంక్రాంతి అంటే రాంబాబు. గతంలో రాంబాబు సత్తెనపల్లిలో సంక్రాంతి సంబరాలు నిర్వహిస్తే సంబరాల రాంబాబు అని హేళన చేశారు. వాళ్లే ఇవాళ సంక్రాంతి సంబరాలకు వెళ్లి డాన్సులు వేస్తున్నారు. అందరి ఆత్మీయుడు అంబటి రాంబాబు.
వైఎస్ జగన్‌ను ఎవరు విమర్శిస్తే వారికి.. అంబటి రాంబాబు తన మాటల చురకులతో తాట తీస్తారు. కూటమి పాలనలో సంక్షేమం లేదు. ఆరోగ్యశ్రీ లేదు, చేయూత, రైతు భరోసా లేదు. ప్రైవేట్ స్కూల్స్ లో ఫీజులు కట్టలేక తల్లితండ్రులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. వైఎస్సార్‌సీపీ పాలనలో ప్రతీ నెల ఏదో ఒక సంక్షేమ కార్యక్రమం అమలు జరిగేది. రానున్న ఎన్నికల్లో మళ్లీ వైఎస్సార్‌సీపీ తిరిగి అధికారంలోకి వస్తుంది. వైఎస్ జగన్ పాలనలో ప్రజలంతా సుఖసంతోషాలతో ఉన్నారు. వైఎస్ జగన్‌ను ఎందుకు వదులుకున్నామని ప్రజలు బాధపడుతున్నారు.
వైఎస్సార్‌సీపీ అధికార ప్రతినిధి కారుమూరి వెంకటరెడ్డి మాట్లాడుతూ..‘సంక్రాంతి అంటే సాంప్రదాయం. ఆటలు, పాటలు, కోడిపందాలు ఎన్నో ఉంటాయి. ప్రతీ సంక్రాంతికి అంబటి రాంబాబు సంబరాలు నిర్వహిస్తున్నారు. కానీ ఆయన్ను కొంతమంది అవహేళన చేశారు. అంబటి రాంబాబును అవహేళన చేసిన పవన్ కళ్యాణ్ ఇవాళ సంక్రాంతి సంబరాలకి వెళ్ళాడు. రాంబాబుని పవన్ కళ్యాణ్ ఫాలో అవుతున్నారు అని చెప్పుకొచ్చారు.


