గతంలో సెలవు రోజుల్లోనూ ప్రజలకు సేవలందించిన యూపీహెచ్‌సీలు
ఇందుకోసం ఆ రోజుల్లో పనిచేసిన స్టాఫ్‌నర్సులకు 35 క్యాజువల్ లీవ్‌లు మంజూరు చేసిన వైఎస్ జగన్ సర్కార్
వాటిని 15కు కుదిస్తూ చంద్రబాబు ప్రభుత్వం ఉత్తర్వులు
దీనివల్ల సెలవు రోజుల్లో యూపీహెచ్‌సీలు మూత.. ప్రజలకు వైద్య సేవలు దూరం
సాక్షి, అమరావతి: మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ ద్వారా పేద ప్రజలకు ఉచిత వైద్యం, విద్యను దూరం చేస్తున్న చంద్రబాబు సర్కార్.. ఇప్పుడు పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల(యూపీహెచ్‌సీలు)ను సైతం నిర్విర్యం చేస్తోంది. రాష్ట్రంలోని నగర, పట్టణ ప్రజలకు ఉచిత వైద్య సేవల కోసం వైఎస్ జగన్ ప్రభుత్వం ఏర్పాటు చేసిన యూపీహెచ్‌సీలు మూతపడేలా చంద్రబాబు సర్కార్ ప్రమాదకర నిర్ణయాలు తీసుకుంటోంది. సెలవుల్లో సైతం అందుబాటులో ఉండి విధులు నిర్వర్తించే స్టాఫ్ నర్సుల కోసం గత ప్రభుత్వం మంజూరు చేసిన క్యాజువల్ లీవ్‌లను.. ప్రస్తుత ప్రభుత్వం సగానికి సగం కుదించేసింది.
తద్వారా యూపీహెచ్‌సీలు మూత పడే పరిస్థితి కల్పించింది. రాష్ట్రవ్యాప్తంగా 560 యూపీహెచ్‌సీలను వైఎస్ జగన్ ప్రభుత్వం నెలకొల్పింది. పండుగలు, ప్రత్యేక సెలవు దినాల్లో సైతం ఆరోగ్య కేంద్రాలు పనిచేసేలా అప్పట్లో చర్యలు తీసుకుంది. సెలవు రోజుల్లో కూడా స్టాఫ్ నర్సులు అందుబాటులో ఉండి.. ప్రజలకు వైద్య సేవలు అందించేలా వారికి 35 రోజుల క్యాజువల్ లీవ్‌లు(సీఎల్స్) మంజూరు చేసింది. దీంతో పండుగలు, ఇతర సెలవు రోజుల్లో మెడికల్ ఆఫీసర్లు, ఇతర సిబ్బంది విధులకు హాజరవ్వకపోయినా.. స్టాఫ్ నర్స్‌లు మాత్రం ఆరోగ్య కేంద్రాల్లో అందుబాటులో ఉంటూ ప్రజలకు వైద్య సేవలందించేవారు.
ఆ నర్సులు అదనంగా మంజూరైన సెలవులను తమకు అవసరమైనప్పుడు వాడుకోవడానికి వీలుండేది. కానీ, ఈ విధానాన్ని రద్దు చేస్తూ గత నెల 24న వైద్య శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. రాష్ట్ర ప్రభుత్వంలోని ఇతర ఉద్యోగుల తరహాలోనే ఆరోగ్య కేంద్రాల నర్సులకు కూడా 15 సీఎల్స్ మాత్రమే ఉంటాయని స్పష్టం చేసింది. దీనివల్ల నర్సులు సెలవు దినాల్లో ప్రజలకు అందుబాటులో ఉండని పరిస్థితి తలెత్తి.. ఆరోగ్య కేంద్రాలకు తాళాలు పడతాయని తెలిసినా చంద్రబాబు సర్కార్‌లో మాత్రం చలనం లేదు.


