వాషింగ్టన్: అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ వచ్చే ఏప్రిల్‌లో చైనాలో పర్యటించనున్నారు. టారిఫ్ వార్ తరువాత రెండు దేశాల మధ్య స్నేహపూర్వక సంబంధాలు కొనసాగుతున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్‌తో తాను ఫోన్‌లో సంభాషించానని, వచ్చే ఏడాది చివర్లో అమెరికా పర్యటనకు జిన్‌పింగ్‌ను ఆహ్వనించానని ఎక్స్‌వేదికగా ట్రంప్ పేర్కొన్నారు. చైనాతో అమెరికా సంబంధం బలంగా ఉందని, ఈ పర్యటన ద్వైపాక్షిక సంబంధాలు మెరుగు పడేందుకు సహాయపడుతుందని వెల్లడించారు. నెల రోజుల కిందట ఇద్దరు నాయకులు దక్షిణ కొరియాలో భేటీ అయ్యారు. అనంతరం ఫోన్‌లో సంభాíÙంచారు. ఉక్రెయిన్, ఫెంటానిల్, అమెరికన్ సోయాబీన్స్ కొనుగోళ్లు వంటి అంశాలపై చర్చించామని ట్రంప్ తెలిపారు.
పర్యటనలు ప్రస్తావించని చైనా
అయితే ముందుగా ఫోన్ కాల్ గురించి ప్రకటించిన చైనా మాత్రం పర్యటనల గురించి వెల్లడించలేదు. కేవలం ఇరు దేశాల మధ్య వాణిజ్యం, తైవాన్, ఉక్రెయిన్ గురించి చర్చించారని పేర్కొంది. ‘‘చైనా ప్రధాన భూభాగానికి తైవాన్ తిరిగి రావడం ‘యుద్ధానంతర అంతర్జాతీయ క్రమంలో అంతర్భాగం’అని జిన్‌పింగ్ ట్రంప్‌తో అన్నారు. ట్రంప్ తన పోస్ట్‌లో ప్రస్తావించని బీజింగ్‌కు ఇది కీలకమైన సమస్య. ఫాసిజానికి వ్యతిరేకంగా కలిసి పోరాడిన తర్వాత రెండో ప్రపంచ యుద్ధం విజయాన్ని సంయుక్తంగా కాపాడుకోవాలని జిన్‌పింగ్ ట్రంప్‌తో అన్నారు. తెవాన్ ప్రశ్న చైనాకు ఎంత ముఖ్యమో అమెరికా అర్థం చేసుకుంటుంది.’’అని చైనా విదేశాంగ మంత్రిత్వ శాఖ తెలిపింది.
తైవాన్‌కు సాయంపై అమెరికా అస్పష్టత
వాణిజ్య యుద్ధాన్ని తగ్గించడానికి వరుస చర్చల ప్రయత్నాలు కొనసాగుతున్నప్పటికీ.. రెండు అగ్రరాజ్యాల మధ్య వైరుధ్యాలు కొనసాగుతున్నాయని రెండు వైపుల నుంచి వచి్చన ప్రకటనల్లోని లోపాలు సూచిస్తున్నాయి. తైవాన్‌పై చైనా చర్య తీసుకుంటే, అమెరికాకు కీలకమైన మిత్రదేశమైన జపాన్‌లోని సైన్యం జోక్యం చేసుకోవచ్చని జపాన్ ప్రధాన మంత్రి సనే తకైచి ఇటీవల చేసిన వ్యాఖ్యలతో చైనా–జపాన్ సంబంధాలు దెబ్బతిన్నాయి. తకైచి వ్యాఖ్యలను బీజింగ్ ఖండించింది. ఎవరూ తాకకూడని ఎర్ర గీతను జపాన్ దాటిందని చైనా విదేశాంగ మంత్రి వాంగ్ యి అన్నారు.
స్వయం పాలనలో ఉన్న తైవాన్ సార్వభౌమాధికారంపై అమెరికా ఎలాంటి కామెంట్ చేయలేదు. కానీ తైవాన్‌ను స్వా«దీనం చేసుకోవడానికి బలప్రయోగాన్ని వ్యతిరేకిస్తుంది. ఏదైనా సాయుధ దాడిని నిరోధించడానికి ద్వీపానికి సాయంగా అమెరికా దళాలను పంపే విషయంలో స్పష్టత లేదు. తైవాన్ తన రక్షణ బడ్జెట్‌ను పెంచాలని అమెరికా చెబుతోంది. తైవాన్‌కు 330 మిలియన్ డాలర్ల ఆయుధ అమ్మకాలకు అమెరికా ఈ నెలలో ఆమోదం తెలిపిందని తైవాన్ విదేశాంగ మంత్రిత్వ శాఖ తెలిపింది. వాటిలో యుద్ధ విమానాల విడిభాగాలు కూడా ఉన్నాయి. దీనిపై చైనా నిరసన వ్యక్తం చేసింది.


