అరుణాచల్ ప్రదేశ్.. భారతదేశ ఈశాన్య రాష్ట్రాలలో ఒకటి. అయితే చైనా మాత్రం అరుణాచల్ ప్రదేశ్‌పై ఎప్పటికప్పుడు అక్కసు వెళ్లగక్కుతూనే ఉంది. మనతో స్నేహం అంటూనే భారతదేశంలో సూర్యుడు ఉదయించే తొలి ప్రాంతం అరుణాచల్‌ను తరచు తమది అంటోంది. తాజాగా వారి అరాచకం మరోసారి బయటపడింది.
యూకేలో ఉంటున్నభారత సంతతికి చెందిన అరుణాచల్ ప్రదేశ్‌కు చెందిన మహిళను చైనా ఇమ్మిగ్రేషన్ అధికారులు తీవ్ర ఇబ్బందులు పెట్టారు. ఆమె పాస్‌పోర్ట్‌పై అరుణాచల్‌ప్రదేశ్-భారతదేశం అని ఉండటంతో చైనా అధికారుల కోపం కట్టలు తెంచుకుంది. అరుణాచల్ ప్రదేశ్ అనేది చైనాలో బాగమని ఆమెతో వాదించారు. ఆ పాస్‌పోర్ట్ చెల్లదు అంటూ తీవ్ర అసహనానికి గురిచేశారామెను.
పెమా వాంఘజామ్ థోంగ్‌డాక్ అనే లండన్ నుంచి జపాన్‌కు వెళ్తున్న సమయంలో ఇది చోటు చేసుకుంది. మధ్యంతర విరామంలో భాగంగా చైనాలోని షాంఘై ఎయిర్‌పోర్ట్‌లో మూడు గంటలు పాటు వేచి ఉన్న ఆమెకు.. చైనా ఇమ్మిగ్రేషన్ అధికారులు ఇబ్బందులకు గురి చేశారు. పాస్‌పోర్ట్ కౌంటర్‌లో అరుణాచల్ ప్రదేశ్-భారత్ అని ఉందేంటని ప్రశ్నించారు. భారతదేశంలో అరుణాచల్ ప్రదేశ్ భాగమని ఆమె వాదించగా, కాదంటూ వారు వాగ్వాదానికి దిగారు. అరుణాచల్ ప్రదేశ్ చైనాలో భాగమంటూ వితండ వాదం చేశారు. మూడు రోజుల క్రితం అంటే నవంబర్ 21వ తేదీన చోటు చేసుకున్న ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఈ విషయాన్ని ఆమె.. జాతీయ వార్త సంస్థ ఇండియా టుడేకి స్పష్టం చేసింది. తనను చైనా అధికారుల ఎంతటి వేధింపులకు గురి చేశారో వెల్లబుచ్చింది.
గత ఏడాది తాను చైనా మీదుగా ప్రయాణించినా ఎటువంటి ఇబ్బంది రాలేదని, అలాగే లండన్‌లో ఉన్న చైనా ఎంబాసీ కూడా ఎప్పుడూ తనను ఇబ్బంది పెట్టలేదని తెలిపింది. తాజాగా ఎదురైన అనుభవంతో తాను షాక్‌కు గురైనట్లు ఆమె వాపోయింది.
ఈ కారణంగా తాను కేవలం కొంత పరిధి వరకే పరిమితమయ్యానని, టికెట్లను రీబుక్ చేసుకోలేకపోయానని, భోజనం కూడా కొనలేకపోయానని, ఆఖరకు టెర్మినల్స్ మధ్య కదలడానికి కూడా వీల్లేకుండా పోయిందని తెలిపింది.
చైనా ఈస్టర్న్‌లో ప్రత్యేకంగా కొత్త టికెట్ కొనాలని అధికారులు తనపై ఒత్తిడి తెచ్చారని, అలా చేసిన తర్వాతే తన పాస్‌పోర్ట్ తిరిగి ఇస్తామన్నారని పేర్కొంది. దీనివల్ల పలు ఆటంకాలు ఏర్పడి ఆర్థిక నష్టం చవిచూడాల్సి వచ్చిందన్నారు.
చివరకు లండన్‌లో ఉన్న తన ఫ్రెండ్ సాయంతో షాంఘైలో ఉన్న బారత ఎంబాసీని కలిశానని, ఆ తర్వాత అర్థరాత్రి సమయంలో తాను చైనాను వీడి వెళ్లే అవకాశం దక్కిందన్నారు. ఇదొక భయానక ఘటనగా ఆమె అభివర్ణించారు.
ఇదీ చదవండి:
మీరు మాకు చెప్పాల్సింది: ప్రధాని మోదీతో దక్షిణాఫ్రికా అధ్యక్షుడు


