జోహెన్నెస్‌బర్గ్: జీ 20 సదస్సు దక్షిణాఫ్రికాలోని జోహెన్నెస్‌బర్గ్ వేదికగా జరిగింది. నవంబర్ 22, 23 తేదీల్లో ఈ సదస్సు నిర్వహించారు. ఐకమత్యం, సమానత్వం, సుస్థిరత తదితర అంశాల థీమ్ ఆధారంగా ఈ సదస్సును నిర్వహిస్తూ వస్తున్నారు. అయితే ఆఫ్రికా ఖండంలో జరిగిన జీ 20 సదస్సు ఇదే మొదటిది. దీని గురించి ఆఫ్రికా ఖండంలోని నేతలకు పెద్దగా అనుభవం లేదు.
ఇదే విషయాన్ని దక్షిణాఫ్రికా అధ్యక్షుడు సిరిల్ రామఫోసా.. భారత ప్రధాని నరేంద్ర మోదీ దృష్టికి తీసుకొచ్చారు. జీ 20 సదస్సును నిర్వహించడం అనేది తమకు అసలు అనుభవం లేదన్నారు. ఇది అత్యంత కష్టంతో కూడుకున్నదిగా నిర్వహించాక తెలిసిందన్నారు. ‘ జీ 20 సదస్సు నిర్వహణ కష్టమని మాకు చెప్పాల్సింది. మీరు చెప్పి ఉంటే దానికి దూరంగా ఉండేవాళ్లం.’ అని నవ్వుతూ అన్నారు రామఫోసా.
ఇక జీ 20 సదస్సు కోసం భారత్ ఇచ్చిన సహకారం మరువలేనిదని ప్రధాని మోదీతో మాటామంతీ సందర్భంగా సిరిల్ రామఫోసా పేర్కొన్నారు. జోహన్నెస్‌బర్గ్‌లో ఆదివారం జీ20 దేశాల అధినేతల సదస్సులో ప్రధాని మోదీ పాల్గొన్నారు. పలు అంశాలపై జరిగిన చర్చా కార్యక్రమాల్లో మోదీ మాట్లాడుతూ.. ‘ టెక్నాలజీ అప్లికేషన్లు ఏ ఒక్క దేశానికో ఉపయోగపడేలా కాకుండా ప్రపంచమంతా వినియోగించుకొనేలా రూపొందించాలి. సామాన్య ప్రజల జీవితాలను మార్చే టెక్నాలజీని ప్రోత్సహించాలి.
ఇండియాలో ‘అందరికోసం సాంకేతికత’అనే విధానం అమలు చేస్తున్నాం. స్పేస్ అప్లికేషన్లు, ఏఐ, డిజిటల్ చెల్లింపుల్లో తమ దేశం ముందంజలో ఉంది.. వచ్చే ఏడాది ఫిబ్రవరిలో ఇండియాలో ఏఐ ఇంపాక్ట్ సదస్సు నిర్వహించబోతున్నామం. జీ20 దేశాలను ఆహ్వానిస్తున్నాం’ అని స్పష్టం చేశారు.


