పాల్గొన్న ఉక్రెయిన్, యూరప్, అమెరికా ప్రతినిధులు
జెనీవా: రష్యా దురాక్రమణకు పుల్‌స్టాప్ పెట్టేందుకు ఉద్దేశించిన అమెరికా ప్రతిపాదిత శాంతి ఒప్పందంపై ఉక్రెయిన్, పశ్చిమ దేశాల ప్రతినిధులు స్విట్జర్లాండ్‌లోని జెనీవాలో ఆదివారం చర్చలు జరిపారు. యూకే, ఫ్రాన్స్, జర్మనీ జాతీయ భద్రతా సలహాదారులతో మొదటి దఫా చర్చలు ముగిశాయని ఉక్రెయిన్ బృందానికి నాయకత్వం వహిస్తున్న అధ్యక్షభవనం చీఫ్ ఆఫ్ స్టాఫ్ ఆండ్రీ యర్మాక్ ఎక్స్‌లో వెల్లడించారు.
ప్రతిపాదిత 28 పాయింట్ల ఒప్పందం పొరుగుదేశంపై దురాక్రమణకు పాల్పడిన రష్యాకే అనుకూలంగా ఉండటంపై యూరప్ దేశాలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నాయి. ప్రతిపాదనలను సమీక్షించేలా అమెరికాపై ఒత్తిడి తేవాలని ఉక్రెయిన్‌ను అవి కోరుతున్నాయి. ఈ చర్చల్లో అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రుబియో, ట్రంప్ ప్రత్యేక దూత స్టీవ్ విట్కాఫ్ కూడా పాలుపంచుకున్నారు.
ఉక్రెయిన్‌లో శాంతి నెలకొనే దిశగా అమెరికా బృందంతో నిర్మాణాత్మకంగా చర్చలు జరిపేందుకు సిద్ధంగా ఉన్నామని యర్మాక్ తెలిపారు. ఈ ఒప్పందంతో దేశ సార్వభౌమత్వమా? అమెరికా మద్దతును నిలుపుకోవడమా? తేలిపోనుందని ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీ వ్యాఖ్యానించడం తెల్సిందే. ఇప్పటికే కనీసం డజను సార్లు తిరస్కరించిన రష్యా డిమాండ్లనే ఈ ఒప్పందంతో ఆమోదించాల్సి రావడం జెలెన్‌స్కీకి మింగుడు పడటం లేదు.
ఉక్రెయిన్ పారిశ్రామిక రంగానికి ఎంతో కీలకమైన డోన్బాస్‌ను రష్యాకు వదిలేయడం, సైన్యాన్ని పరిమితం చేసుకోవడం వంటివి ప్రతిపాదనల్లో ఉన్నాయి. ఇవి తుది ప్రతిపాదనలు కావని, ఎలాగైనా యుద్ధాన్ని ఆపడమే తమ లక్ష్యమని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ అంటున్నారు. అయితే, గురువారం కల్లా ఒక స్పష్టతకు రావాలని ఆయన శనివారం ఉక్రెయిన్‌కు గడువు విధించారు. కాగా, నల్ల సముద్రంపై ఉక్రెయిన్ స్వేచ్ఛగా ధాన్యం రవాణా చేసేందుకు ఉద్దేశించిన గత ఒప్పందాన్ని అమల్లోకి తెచ్చేలా రష్యా అధ్యక్షుడు పుతిన్‌తో సోమవారం మాట్లాడుతానని తుర్కియే అధ్యక్షుడు ఎర్డోగన్ చెప్పారు.


