అమెరికా దాడిలో 100 మంది మృతి | 100 people killed in US attack, says Venezuela Interior Minister | Sakshi
Sakshi News home page

అమెరికా దాడిలో 100 మంది మృతి

Jan 9 2026 4:55 AM | Updated on Jan 9 2026 9:09 AM

100 people killed in US attack, says Venezuela Interior Minister

మదురోను కాపాడబోయి అంగరక్షకులూ చనిపోయారు 

వెల్లడించిన వెనెజువెలా అంతర్గత మంత్రిత్వ శాఖ

కరాకస్‌: గత శనివారం శత్రు దుర్భేద్యమైన సైనిక స్థావరంపై విచక్షణారహితంగా బాంబులేసి అధ్యక్షభవనంలో చొరబడి అధ్యక్షుడు నికొలస్‌ మదురో దంపతులను ఎత్తుకెళ్లిన అమెరికా బలగాలు జరిపిన దాడిలో ఏకంగా 100 మంది ప్రాణాలు కోల్పోయారని వెనెజువెలా అంతర్గత మంత్రిత్వ శాఖ బుధవారం ప్రకటించింది. కొత్త అధ్యక్షురాలు డెల్సీ రోడ్రిగ్జ్‌ సారథ్యంలోని వెనెజువెలా ప్రభుత్వం ఈ మరణాల సంఖ్యను అధికారికంగా వెల్లడించడం ఇదే తొలిసారి. 

తమ అధ్యక్షుడిని అమెరికా సైన్యం చేతికి చిక్కకుండా రక్షించుకునే క్రమంలో మదురో అంగరక్షకుల్లో చాలా మంది వీరమరణం పొందారని వెనెజువెలా అధికారులు ప్రకటించారు. ‘‘ అమెరికా మెరుపుదాడి వేళ మా సైన్యం, అమెరికా సైనికుల మధ్య జరిగిన కాల్పులు, ఘర్షణాత్మక వాతావరణంలో మదురో కాలికి గాయమైంది. మదురో భార్య సిలియా ఫ్లోరెస్‌ తలకు బలమైన గాయమైంది’’ అని అంతర్గత మంత్రి డియాస్‌డాడో క్యాబెల్లో చెప్పారు.

 వెనెజువెలా ఆర్మీ ఇప్పటికే 23 మంది మృతుల పేర్లను తమ వెబ్‌సైట్‌లో ప్రచురించడం తెల్సిందే. వెనెజువెలా సైనిక, పౌర అవసరాలు తీర్చేందుకు ఆ దేశానికి పంపించిన తమ సైనికులు 32 మంది చనిపోయారని క్యూబా ఇప్పటికే ప్రకటించింది. మరణించిన తమ సైనికుల అంత్యక్రియలను వెనెజువెలా సైన్యం బుధవారం కరాకస్‌ నగరంలో అధికారిక లాంఛనాలతో నిర్వహించింది.

 నేషనల్‌ గార్డ్‌ సభ్యులు, మృతుల కుటుంబసభ్యులు, బంధువులు, వందలాది మంది స్థానికులు దారిపొడవునా మృతులకు ఘననివాళులర్పించారు. మృతులను స్మరిస్తూ అధ్యక్షురాలు డెల్సీ ఏడు రోజులపాటు సంతాప దినాలుగా ప్రకటించారు. ‘‘ వెనెజువెలా ఏనాటికీ శత్రుదేశం ఎదుట తలవంచదు. ఘన చరిత్ర, వారసత్వాన్ని పుణికి పుచ్చుకున్న ఈ దేశమూ ఆ పనిచేయదు’’ అని మంత్రి క్యాబెల్లో వ్యాఖ్యానించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement