అగ్రరాజ్యం అమెరికాను డైన్మార్క్ హెచ్చరించింది. గ్రీన్‌ల్యాండ్‌ను ఆక్రమించినట్లయితే దాడులు చేస్తామని వార్నింగ్ ఇచ్చింది. మా ఆదేశాలు లేకుండానే సైనికులు కాల్పులు జరుపుతారని డెన్మార్క్ రక్షణ మంత్రిత్వ శాఖ తెలిపింది. తమ సైనికులు ముందుగా కాల్పులు జరిపిన తర్వాతే ప్రశ్నలు అడుగుతారని డానిష్ రక్షణ మంత్రిత్వ శాఖ పేర్కొంది. 1952 నాటి ఆర్మీ ఎంగేజ్‌మెంట్ రూల్స్ ప్రకారం ఇదే జరుగుతుందని వెల్లడించింది. ఈ రూల్ ప్రకారం సైనికులు ఉన్నతాధికారుల ఆదేశాల కోసం వేచి ఉండకుండా దురాక్రమణదారులపై దాడి చేస్తారని తెలిపింది.
నాటో భూభాగమైన గ్రీన్‌ల్యాండ్‌ను స్వాధీనం చేసుకునేందుకు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తన ప్రయత్నాలు ప్రారంభించడంతోనే డెన్మార్క్ ఈ ప్రకటన చేసింది. ఈ ఆర్కిటిక్ ద్వీపాన్ని స్వాధీనం చేసుకునేందుకు అమెరికా పరిశీలిస్తున్న ఎంపికల్లో సైనిక శక్తి ఒకటిగా పేర్కొంది. కాగా.. ఇటీవల వెనిజువెలా అధ్యక్షుడు మదురోను అమెరికా నిర్భంధించాక పలు దేశాలు అమెరికాపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి.
దీనిపై వైట్ హౌస్ ప్రెస్ సెక్రటరీ కరోలిన్ లెవిట్ మాట్లాడుతూ.. "గ్రీన్‌ల్యాండ్‌ను స్వాధీనం చేసుకోవడం అమెరికాకు జాతీయ భద్రతా ప్రాధాన్యత. ఆర్కిటిక్ ప్రాంతంలో మన ప్రత్యర్థులను అరికట్టడానికి అవసరమని అధ్యక్షుడు ట్రంప్ స్పష్టం చేశారు. ఈ కీలకమైన విదేశాంగ విధాన లక్ష్యాన్ని సాధించడానికి సరైన ఎంపికలను పరిశీలిస్తున్నాం. యుఎస్ మిలిటరీని ఉపయోగించడం ఎల్లప్పుడూ ఒక ఎంపిక." అని అన్నారు.
వచ్చే వారం డెన్మార్క్, గ్రీన్‌ల్యాండ్ అధికారులతో సమావేశం కావాలని అమెరికా విదేశాంగ కార్యదర్శి మార్కో రూబియో అన్నారు. ఓ నివేదిక ప్రకారం ట్రంప్ సైనిక బలప్రయోగం కాకుండా ఆ ద్వీపాన్ని స్వాధీనం చేసుకోవాలనుకుంటున్నారని ఆయన స్పష్టం చేశారు. ఇంతలోనే అమెరికా అధికారులతో సమావేశాన్ని డెన్మార్క్ స్వాగతించింది. దీనిని ఒక ముఖ్యమైన చర్చగా పేర్కొంది.


