చిన్నపిల్లల ఫుడ్ బ్రాండ్ అయిన నెస్లేపై గల్ఫ్ దేశాలు అప్రమత్తమయ్యాయి. మార్కెట్‌లో ఉన్న నెస్లే బేబీ ఫుడ్ ఉత్పత్తులలో కొన్నింటిలో ప్రాణాంతక బ్యాక్టీరియా ఉందన్న ఆరోపణలతో వాటిని రీకాల్ చేస్తున్నారు. ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా పెద్ద సంఖ్యలో నెస్లే ఉత్పత్తులను రీకాల్ చేస్తున్నారు. యూరప్ ప్రారంభమై ఆఫ్రికా, ఆసియా, అమెరికాలకు వ్యాపించిన ఈ సంక్షోభంలో యుఎఇతో సహా గల్ఫ్ దేశాలు ఇప్పుడు హై అలర్ట్ ప్రకటించాయి. ఈ చర్యలకు కారణం ముడి పదార్థాలలో ఒకదానిలో ‘బాసిల్లస్ సిరస్’ అనే బ్యాక్టీరియా ఉండటమేనని తెలుస్తోంది.
గల్ఫ్ దేశాల హెచ్చరిక..
యూఏఈతో పాటు, సౌదీ అరేబియా, కువైట్, ఖతార్ దేశాలు కూడా ఈ ఉత్పత్తులపై ప్రజలను హెచ్చరించాయి. సౌదీ ఫుడ్ అండ్ డ్రగ్ అథారిటీ, ఖతార్ ఆరోగ్య మంత్రిత్వ శాఖ నెస్లే బేబీ ఫుడ్ ప్యాకెట్లను ఉపయోగించవద్దని సూచించాయి. కువైట్‌లో రేషన్ కార్డుల ద్వారా అందింంచే వాటిలో ఈ ఉత్పత్తులు చేర్చలేదని అధికారులు స్పష్టం చేశారు.
అసలు బాసిల్లస్ సెరియస్ అంటే ఏమిటి?
ఈ బ్యాక్టీరియా ఉత్పత్తి చేసే 'సిరిలైడ్' అనే విషం పిల్లల శరీరంలోకి ప్రవేశిస్తే తీవ్రమైన వాంతులు, విరేచనాలు, అధిక అలసట, కడుపు నొప్పికి కారణమవుతుంది. ఇప్పటివరకు ఎటువంటి అనారోగ్యాలు రానప్పటికీ.. కంపెనీ, ప్రభుత్వాలు ముందుజాగ్రత్తగా ఉత్పత్తులను ఉపసంహరించుకుంటున్నాయి.
నెస్లే వివరణ..
ఒక ప్రధాన సరఫరాదారు నుంచి అందుకున్న ముడి పదార్థాలలో (అరాకిడోనిక్ యాసిడ్ ఆయిల్) సమస్య కనుగొన్నట్లు నెస్లే తెలిపింది. ఉత్పత్తులను తిరిగి ఇచ్చి డబ్బు వాపసు పొందే సౌకర్యాన్ని కూడా కంపెనీ కల్పించింది. అనుమానం ఉన్నవారు కంపెనీ హెల్ప్‌లైన్ నంబర్‌ను సంప్రదించవచ్చు. ఆ ఉత్పత్తులను దుకాణాలు ఆన్‌లైన్ ప్లాట్‌ఫారమ్‌ల నుండి తొలగిస్తున్నట్లు తెలిపింది. ఇంట్లో ఈ ఉత్పత్తులు ఉన్నవారు వెంటనే వాటిని నాశనం చేయాలని.. లేదంటే పిల్లలకు ఇవ్వకుండా దుకాణాలకు తిరిగి ఇవ్వాలని స్థానిక ఆరోగ్య శాఖ ప్రజలకు సూచించింది.


