భద్రతా మండలిలో సంస్కరణలు అత్యవసరం | UNSC reforms now a necessity Says PM Narendra Modi at IBSA summit | Sakshi
Sakshi News home page

భద్రతా మండలిలో సంస్కరణలు అత్యవసరం

Nov 24 2025 4:49 AM | Updated on Nov 24 2025 4:49 AM

UNSC reforms now a necessity Says PM Narendra Modi at IBSA summit

ఐబీఎస్‌ఏ సదస్సులో ప్రధాని మోదీ స్పష్టీకరణ  

జోహన్నెస్‌బర్గ్‌: ఐక్యరాజ్యసమితి భద్రతా మండలిలో సంస్కరణలు చేపట్టడం ఇకపై ఎంతమా త్రం ఐచ్ఛికం కాదని.. అత్యవసరమని ప్రధాని నరేంద్ర మోదీ తేల్చిచెప్పారు. అంతర్జాతీయ సంస్థల్లో మార్పులు తీసుకురావాల్సిందేనని అన్నారు. దక్షిణాఫ్రికాలోని జోహన్నెస్‌బర్గ్‌లో ఆదివారం ఇండియా–బ్రెజిల్‌–దక్షిణాఫ్రికా అధినేతల సదస్సులో ఆయన మాట్లాడారు. 

నేడు ప్రపంచ దేశాల మధ్య విభజనలు, అడ్డుగోడలు కనిపిస్తున్న తరుణంలో తమ కూటమి ఐక్యత, సహకారం, మానవతా సందేశాన్ని ఇస్తోందని తెలిపారు. మూడు దేశాల మధ్య సహకారాన్ని మరింత బలోపేతం చేసుకోవడానికి ఐబీఎస్‌ఏ జాతీయ భద్రతా సలహాదారుల సదస్సు నిర్వహించాలని మోదీ ప్రతిపాదించారు. ఉగ్రవా దంపై పోరాటంలో సహకారం పెంచుకోవాలని కోరారు. ఉగ్రవాదం వంటి కీలకమైన అంశాలపై ద్వంద్వ ప్రమాణాలకు తావులేదని తేల్చిచెప్పారు. 

ఐబీఎస్‌ఏ సదస్సులో మోదీతోపాటు దక్షిణాఫ్రికా అధినేత సిరిల్‌ రమఫోసా, బ్రెజిల్‌ అధ్యక్షుడు లూయిజ్‌ ఇనాసియో లూలా డా సిల్వా పాల్గొన్నా రు. మానవ కేంద్రిత అభివృద్ధిలో టెక్నాలజీ పాత్ర అత్యంత కీలకమని మోదీ ఉద్ఘాటించారు. యూపీఐ, కోవిన్‌ లాంటి ఆరోగ్య వేదికలు, సైబర్‌ సెక్యూరిటీ నిబంధనలు, మహిళల సారథ్యంలోని టెక్నాలజీ కార్యక్రమాలను పంచుకోవడానికి ‘ఐబీఎస్‌ఏ డిజిటల్‌ ఇన్నోవేషన్‌ అలయెన్స్‌’ ఏర్పాటు చేసుకుందామని మోదీ ప్రతిపాదించారు. 

40 దేశాల్లో విద్య, ఆరోగ్యం, మహిళా సాధికారత, సోలార్‌ విద్యుత్‌ వంటి కార్యక్రమాల కోసం ఐబీఎస్‌ఏ నిధులు అందజేస్తున్నందుకు ఆయన ప్రశంసల వర్షం కురిపించారు. వాతావరణ మార్పులను తట్టుకొని పంటల దిగుబడి సాధించే విధానాల కోసం ప్రత్యేక నిధిని ఏర్పాటు చేసుకుందామని చెప్పారు. తృణధా న్యాలు, ప్రకృతి వ్యవసాయం, విపత్తుల నిర్వహణ, గ్రీన్‌ ఎనర్జీ, సంప్రదాయ ఔషధాలు, ఆరోగ్య భద్రత వంటి విషయాల్లో మూడు దేశాల మధ్య పరస్పర సహకారానికి మరిన్ని అవకాశాలు ఉన్నాయని ప్రధానమంత్రి స్పష్టంచేశారు.

వివిధ దేశాల అధినేతలతో సమావేశం  
ప్రధాని మోదీ ఆదివారం జోహన్నెస్‌బర్గ్‌లో బిజిబిజీగా గడిపారు. వరుసగా సమావేశాల్లో పాల్గొన్నారు. కెనడా ప్రధాని కార్నీ, జపాన్‌ ప్రధాని తకాయిచీ, ఇటలీ జార్జియో మెలోనీ, జమైకా ప్రధాని హోల్నెస్, నెదర్లాండ్స్‌ ప్రధాని డిక్‌ స్కూఫ్‌తో మోదీ సమావేశమయ్యారు. వ్యాపారం, వాణిజ్యం, పెట్టుబడులు, కీలక రంగాల్లో పరస్పర సహకారంపై వారితో చర్చించారు. ఐఎంఎఫ్‌ ఎండీ క్రిస్టలీనా జార్జివాతోనూ మోదీ భేటీ అయ్యారు. మోదీ ఆదివారం దక్షిణాఫ్రికా పర్యటన పూర్తిచేసుకొని స్వదేశానికి బయలుదేరారు.    

రమఫోసాతో మోదీ భేటీ  
జీ20 సదస్సు సందర్భంగా దక్షిణాఫ్రికా అధ్యక్షుడు సిరిల్‌ రమఫోసాతో ప్రధాని మోదీ ప్రత్యేకంగా సమావేశమయ్యారు. వ్యాపారం, వాణిజ్యం, మైనింగ్, అరుదైన ఖనిజాలు, కృత్రిమ మేధ, ఆహార భద్రత వంటి రంగాల్లో పరస్పర సహకారంపై విస్తృతంగా చర్చించారు. భారత్‌–దక్షిణాఫ్రికా సంబంధాల్లో పురోగతిని సమీక్షించారు. జీ20 కూటమికి విజయవంతంగా సారథ్యం వహిస్తున్నందుకు రమఫొసాకు మోదీ అభినందనలు తెలియజేశారు. 

మరోవైపు ఇండియా–దక్షిణాఫ్రికా మధ్య ప్రతినిధుల స్థాయి చర్చలు జరిగాయి. జీ20 సదస్సు నిర్వహించడానికి మద్దతు ఇచ్చినందుకు మోదీకి రమఫోసా ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలిపారు. తమకు కష్టమైన పని అప్పగించారని చెప్పారు. ఈ పని చేయలేక బహుశా పారిపోయి ఉండేవాళ్లం కావొచ్చు అని రమఫోసా వ్యాఖ్యానించడంతో సమావేశంలో నవ్వులు విరిశాయి. జీ20 సదస్సుకు ఎలా ఆతిథ్యం ఇవ్వాలో భారత్‌ను చూసి నేర్చుకున్నామని ఆయన చెప్పారు.  

ఆరు దేశాల అతిథులు వీరే..  
1. భూటాన్‌ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ లియోన్పో నార్బు త్షెరింగ్, ఆయన భార్య ల్హాదెన్‌ లోటే.

2. కెన్యా సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ మార్తా కూమ్, సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ సుసాన్‌ నజోకి ఎన్‌డుంగు.

3. మలేషియా ఫెడరల్‌ కోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ టాన్‌ శ్రీ దాతుక్‌ నళిని పద్మనాథన్, ఆయన భార్య పసుపతి శివప్రకాశం.

4. మారిషస్‌ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ బీబీ రెహనా ముంగ్లి, ఆయన కుమార్తె రిబెక్కా హన్నా బీబీ గుల్బుల్‌.  

5. నేపాల్‌ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ప్రకాష్‌ మాన్‌ సింగ్‌ రౌత్, సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ సప్నాప్రధాన్‌ మల్లా, ఆయన భార్య అశోక్‌ బహదూర్‌ మల్లా. నేపాల్‌ న్యాయ శాఖ మంత్రి అనిల్‌ కుమార్‌ సిన్హా. భార్య ఉర్సిలా సిన్హా. 

6. శ్రీలంక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ పి.పద్మన్‌ సురసేన, భార్య సెపాలికా సురసేన. న్యాయమూర్తి జస్టిస్‌ ఎస్‌.ఎస్‌. తురైరాజా, భార్య శశికళ తురైరాజా. మరో న్యాయమూర్తి జస్టిస్‌ ఏహెచ్‌ ఎండీ నవాజ్‌ దంపతులు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement