వాషింగ్టన్: ఉక్రెయిన్ నాయకత్వంపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీవ్ర విమర్శలు చేశారు. ఉక్రెయిన్-రష్యా మధ్య యుద్ధం ముగించడానికి అమెరికా చేస్తున్న ప్రయత్నాలకు కీవ్ అసలు కృతజ్ఞత చూపించలేదని ట్రంప్ దుయ్యబట్టారు. జెనీవా వేదికగా అమెరికా ప్రతిపాదిత శాంతి ఒప్పందంపై చర్చలు జరుగుతున్న సమయంలో ట్రంప్ ఇలా వ్యాఖ్యలు చేయడం గమనార్హం.
రష్యా దురాక్రమణకు పుల్‌స్టాప్ పెట్టేందుకు ఉద్దేశించిన అమెరికా ప్రతిపాదిత శాంతి ఒప్పందంపై ఉక్రెయిన్, పశ్చిమ దేశాల ప్రతినిధులు స్విట్జర్లాండ్‌లోని జెనీవాలో ఆదివారం చర్చలు జరిపారు. యూకే, ఫ్రాన్స్, జర్మనీ జాతీయ భద్రతా సలహాదారులతో మొదటి దఫా చర్చలు ముగిశాయని ఉక్రెయిన్ బృందానికి నాయకత్వం వహిస్తున్న అధ్యక్ష భవనం చీఫ్ ఆఫ్ స్టాఫ్ ఆండ్రీ యర్మాక్ ఎక్స్‌లో వెల్లడించారు. ఈ నేపథ్యంలో ట్రంప్ సోషల్ మీడియా ట్రుత్ వేదికగా స్పందిస్తూ.. గతంలోనే అమెరికా, ఉక్రెయిన్‌కు బలమైన నాయకత్వం ఉండి ఉంటే ఈ యుద్ధం జరిగేది కాదు. ఇప్పుడు యుద్ధం ముగింపు కోసం అమెరికా చేస్తున్న ప్రయత్నాలకు ఉక్రెయిన్ చూపిస్తున్న కృతజ్ఞత శూన్యం. ఉక్రెయిన్ కోసం మేము ఇంత చేస్తున్నా జెలెన్‌స్కీ మాత్రం మా మద్దతు ఇవ్వడం లేదు. అలాగే, రష్యాపై మేము ఆంక్షలు విధించి దారికి తెస్తుంటే యూరప్ మాత్రం మాస్కో నుంచి చమురు కొనుగోలు చేస్తోంది అంటూ తీవ్ర విమర్శలు చేశారు.
జెలెన్‌స్కీ స్పందన..
మరోవైపు.. ట్రంప్ విమర్శల నేపథ్యంలో జెలెన్ స్కీ స్పందించారు. సోషల్ మీడియా వేదికగా అధ్యక్షుడు ట్రంప్‌పై ప్రశంసల వర్షం కురిపించారు. ఉక్రెయిన్ విషయంలో అమెరికా చేస్తున్న కృషికి మేము కృతజ్ఞులం. మాకు అమెరికా నాయకత్వం ఎంతో ముఖ్యమైనది. వీలైనంత వరకు మేము నిర్మాణాత్మకంగా పనిచేస్తూనే ఉన్నాం అని చెప్పుకొచ్చారు.
ఉక్రెయిన్‌పై ఒత్తిడి..
ఇదిలా ఉండగా.. యుద్ధం ముగింపునకు సంబంధించి అమెరికా ప్రతిపాదిత 28 పాయింట్ల ఒప్పందంలో దురాక్రమణకు పాల్పడిన రష్యాకే అనుకూలంగా ఉండటంపై యూరప్ దేశాలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నాయి. ప్రతిపాదనలను సమీక్షించేలా అమెరికాపై ఒత్తిడి తేవాలని ఉక్రెయిన్‌ను అవి కోరుతున్నాయి. ఈ చర్చల్లో అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రుబియో, ట్రంప్ ప్రత్యేక దూత స్టీవ్ విట్కాఫ్ కూడా పాలుపంచుకున్నారు. ఉక్రెయిన్‌లో శాంతి నెలకొనే దిశగా అమెరికా బృందంతో నిర్మాణాత్మకంగా చర్చలు జరిపేందుకు సిద్ధంగా ఉన్నామని యర్మాక్ తెలిపారు. అంతకుముందు.. ఈ ఒప్పందంతో దేశ సార్వభౌమత్వమా? అమెరికా మద్దతును నిలుపుకోవడమా? తేలిపోనుందని ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీ వ్యాఖ్యానించడం తెలిసిందే.


