breaking news
peace process
-
అవధుల్లేని ఆనందం
డెయిర్ అల్ బాలాహ్(గాజా స్ట్రిప్)/జెరూసలేం: నెలల తరబడి చీకట్లో మగ్గిపోయిన ఇజ్రాయెలీ బందీలు ఎట్టకేలకు హమాస్ బందీ సంకెళ్లను తెంపుకుని స్వేచ్ఛా వాయువులు పీల్చారు. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ప్రతిపాదించిన హమాస్, ఇజ్రాయెల్ 20 సూత్రాల శాంతి ప్రణాళిక శుక్రవారం అమల్లోకిరాగా బందీల విడుదల సోమవారం మొదలైంది. రెండేళ్లకుపైగా తమ వద్ద బందీలుగా ఉంచుకున్న 20 మంది ఇజ్రాయెలీలను హమాస్ పాలస్తీనాలోని వేర్వేరు చోట్ల ఏకకాలంలో విడిచిపెట్టింది. దీంతో ఇజ్రాయెలీ బందీల కుటుంబాల్లో ఆనందానికి అవధుల్లేకుండా పోయింది. బందీలు విడుదలయ్యారన్న వార్త తెలీగానే ఇజ్రాయెల్ రాజధాని టెల్అవీవ్ ప్రధాన కూడళ్ల వద్ద వేలాది మంది జనం పోగయ్యి సంబరాలు చేసుకున్నారు. కుటుంబసభ్యులు, స్నేహితులు, ఆప్తులు బందీల కోసం ఎదురుచూశారు. చిక్కిశల్యమైన తమ వారిని చూసిన ఆనందంలో బందీల కుటుంబ సభ్యులు కేరింతలు కొట్టారు. వాళ్లను హత్తుకుని ఆనందభాష్పాలను రాల్చారు. ‘‘ మా నాన్న ఓమ్రీ మిరాన్ ఏకంగా 738 రోజుల తర్వాత ఇంటికొచ్చారు. ఆయన రాక కోసం ఎన్నో నిద్రలేని రాత్రులు గడిపాం. వేదన అంతా ఇప్పుడు మటుమాయమైంది’’ అని ఓమ్రీ సంతానం ఆనందం వ్యక్తంచేసింది. ఓమ్రీని వీడియోకాల్‌లో తొలిసారిగా చూసిన ఆయన భార్య లేషే మిరాన్ లావీకు ఆనందంతో మాటలు రాలేదు. నిర్బంధంలో ఉన్నప్పుడు ప్రాణాలు కోల్పోయిన పలువురు బందీల పార్థివదేహాలను సైతం హమాస్ రెడ్‌క్రాస్ ప్రతినిధులకు అప్పగించింది. మరికొన్ని మృతదేహాలు ఎక్కడ ఉన్నాయో తమకు సైతం స్పష్టంగా తెలీదని హమాస్ ప్రతినిధులు చేసిన ప్రకటనపై బందీలు, ఆచూకీగల్లంతైన బాధితుల సంఘం తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేసింది. 20 సూత్రాల శాంతి ప్రణాళికకు హమాస్ కచ్చితంగా కట్టుబడి ఉండాలని డిమాండ్చేసింది. ఇజ్రాయెల్ సైతం ఒప్పందంలో భాగంగా ఆక్రమిత వెస్ట్‌బ్యాంక్‌లోని ఓపెర్ జైలు నుంచి దాదాపు 2,000 మంది పాలస్తీనియన్ ఖైదీలను విడిచిపెట్టింది. వీళ్లలో గతంలో జీవితఖైదు పడిన 250 మంది ఖైదీలు న్నారు. యుద్ధం మొదలయ్యాక గాజాలో అదుపు లోకి తీసుకున్న వందలాది మందిని ఇజ్రాయెల్ విడుదలచేసింది. దీంతో వీళ్లంతా గాజా, వెస్ట్ బ్యాంక్‌లకు బయల్దేరారు. బస్సులో చేరుకున్న తమ వారిని చూసిన ఆనందంలో రమల్లా సిటీలోని పాలస్తీనియన్లు ఉబ్బితబ్బిబ్బయ్యారు.పీడకల పోగొట్టాం.. శాంతిస్థాపన బాధ్యత మీదే: ట్రంప్బందీల విడుదలతో కీలకపాత్రపోషించిన ట్రంప్ సోమవారం పశ్చిమాసియా పర్యటనలో భాగంగా తొలుత ఇజ్రాయెల్‌కు చేరుకున్నారు. ఇజ్రాయెల్ పార్లమెంట్ నెస్సెట్‌లో ప్రసంగించారు. 2008 తర్వాత అమెరికా అధ్యక్షుడు నెస్సెట్‌లో ప్రసంగించడం ఇదే తొలిసారి. 1949 ఏడాది నుంచి చూస్తే గతంలో కేవలం ముగ్గురు అమెరికా అధ్యక్షులు మాత్రమే కేనేసెట్కు వచ్చారు. స్పీకర్ ఆమిర్ ఒహామా ఘన స్వాగతం తర్వాత పార్లమెంటేరియన్లనుద్దేశించి ట్రంప్ ప్రసంగించారు. ‘‘ నెలలతరబడి పట్టి పీడించిన బాధాతప్త యుద్ధ పీడ కలను మేం పోగొట్టాం. తుపాకులు ఇప్పుడు మౌనం దాల్చాయి. ఇక మీరు రణక్షేత్రంలో సాధించడానికి ఏమీ లేదు. ఇక ఈ ప్రాంతంలో శాంతి స్థాపన సువర్ణావకాశాన్ని మీరు అందిపుచ్చుకోండి. శాంతిని శాశ్వత చేయండి. పశ్చిమాసియాలో కొత్త శాంతి ఉషోదయం మొదలైంది. మధ్యవర్తిత్వం వహించిన నా అల్లుడు జేడ్ కుష్నర్, అమెరికా విదేశాంగ మంత్రి రూబియో, అరబ్ దేశాలకు కృతజ్ఞతలు. ఇజ్రాయెల్‌కు మాత్రమేకాదు పశ్చిమాసియాలో సువర్ణా« ద్యాయం మొదలుకానుంది. గాజాలో నిస్సైనికీ కరణ జరగాలి. హమాస్ ఆయుధాలను త్యజించాలి. దానికి ఇంకా అంగీకారం కుదరలేదు’’ అని ట్రంప్ వ్యాఖ్యానించారు. ట్రంప్ ప్రసంగాన్ని ఒకరు అడ్డుకోబోగా భద్రతా సిబ్బంది ఆ వ్యక్తిని పక్కకు లాక్కెళ్లారు.ట్రంప్‌కు ఇజ్రాయెల్ అత్యున్నత పౌర పురస్కారంగాజా ఒప్పందం కుదిర్చి బందీల విడుదలకు కృషి చేసినందుకు ట్రంప్‌కు ఇజ్రాయెల్ అరుదైన గౌరవంతో సత్కరించనుంది. తమ దేశ అత్యున్నత పౌర పురస్కారమైన ‘ప్రెసిడెన్షియల్ మెడల్ ఆఫ్ ఆనర్’ను ట్రంప్‌కు ప్రదానం చేయనున్నట్లు ఇజ్రాయెల్ అధ్యక్షుడు ఇస్సాక్ హెర్జోగ్ సోమవారం ప్రకటించారు. త్వరలో ప్రత్యేక కార్యక్రమంలో ట్రంప్‌ను ఈ పురస్కారంతో సత్కరిస్తామని ఇస్సాక్ చెప్పారు. -
గాజాలో శాంతి పవనాలు!
జెరూసలేం/న్యూఢిల్లీ: వైమానిక దాడులు, బాంబు పేలుళ్లు, విధ్వంసాలు, ఆకలి చావులతో రెండేళ్లుగా అల్లాడిపోతున్న కల్లోలిత గాజా స్ట్రిప్‌లో శాంతి సాధనకు ఎట్టకేలకు అడుగులుపడ్డాయి. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రతిపాదించిన 20 సూత్రాల శాంతి ప్రణాళికలో మొదటి దశను వైరిపక్షాలైన ఇజ్రాయెల్, హమాస్ అంగీకరించాయి. ఈ మేరకు ఒప్పందంపై ఇరుపక్షాలు సంతకం చేయబోతున్నాయి. రెండేళ్లుగా కొనసాగుతున్న యుద్ధం పూర్తిగా ముగింపునకు వచ్చే సూచనలు కనిపిస్తున్నాయి. మొదటి దశ ఒప్పందం ప్రకారం.. గాజాలో దాడులు వెంటనే ఆపేయాలి. తమ చెరలో ఉన్న ఇజ్రాయెల్ బందీలను అతిత్వరలో హమాస్ మిలిటెంట్లు విడుదల చేయనున్నారు. అందుకు బదులుగా తమ నిర్బంధంలో ఉన్న పాలస్తీనా ఖైదీలకు ఇజ్రాయెల్ ప్రభుత్వం విముక్తి కలి్పంచనుంది. అలాగే గాజా నుంచి ఇజ్రాయెల్ సైన్యం వెనక్కి వెళ్లిపోనుంది. హమాస్ అ«దీనంలో 20 మంది బందీలు సజీవంగా ఉన్నట్లు అంచనా. భగవంతుడి దయతో వారందరినీ స్వదేశానికి తీసుకొస్తామని ఇజ్రాయెల్ ప్రధానమంత్రి బెంజమిన్ నెతన్యాహు సోషల్ మీడియాలో పోస్టుచేశారు. హమాస్ సైతం స్పందించింది. ఒప్పందం ప్రకారం ఇజ్రాయెల్ సేనలు వెనక్కి వెళ్లిపోవాలని, గాజాలోకి మానవతా సాయాన్ని ఇజ్రాయెల్ ప్రభుత్వం అనుమతించాలని పేర్కొంది. ఇజ్రాయెల్ బందీలను విడుదల చేస్తామని వెల్లడించింది. అందుకు బదులుగా ఇజ్రాయెల్ జైళ్లలో మగ్గుతున్న పాలస్తీనా ఖైదీలను తమకు అప్పగించాలని తేల్చిచెప్పింది. మరోవైపు రెండు కీలకమైన అంశాలపై స్పష్టత రాలేదు. ట్రంప్ ప్లాన్ ప్రకారం హమాస్ మిలిటెంట్లు ఆయుధాలు వదిలేసి లొంగిపోవాలి. గాజా పరిపాలన బాధ్యతలను నిపుణులతో కూడిన స్వతంత్ర పాలస్తీనా అథారిటీకి అప్పగించాలి. ఈ రెండింటిపై హమాస్ గానీ, ఇజ్రాయెల్ గానీ ఎలాంటి ప్రకటన చేయకపోవడం గమనార్హం. గాజాలో ఆనందోత్సాహాలు ట్రంప్ శాంతి ప్రణాళికలో మొదటి దశను ఇజ్రాయెల్, హమాస్ అంగీకరించడంతో గాజాలో పండుగ వాతావరణం నెలకొంది. స్థానికులు ఆనందం వ్యక్తంచేశారు. యుద్ధం ఇక ఆగిపోతుందని, రక్తపాతానికి తెరపడుతుందని, తమకు మంచి రోజులు వస్తాయని ఆశిస్తున్నట్లు చెప్పారు. ఈ క్షణం కోసమే ఎదురు చూస్తున్నామని అన్నారు. జనం పరస్పరం అభినందనలు చెప్పుకుంటున్న దృశ్యాలు కనిపించాయి. గాజాలో పనిచేస్తున్న జర్నలిస్టులు సైతం సంబరాల్లో మునిగిపోయారు. కొందరు పాలస్తీనా సంప్రదాయ నృత్యాలు చేశారు. మారణహోమం, అన్యాయం, అణచివేత కారణంగా మానసికంగా, శారీరకంగా అలసిపోయామని, ఇకనైనా ఊపిరి పీల్చుకుంటానని ఓ ఆసుపత్రిలో పనిచేస్తున్న నర్సు చెప్పారు. మరోవైపు శాంతి ప్రణాళిక అమల్లోకి వచ్చినట్లు భావించిన నిరాశ్రయులు తమ స్వస్థలాలకు చేరుకోవడానికి ప్రయత్నించగా ఇజ్రాయెల్ సైనికులు ఎక్కడికక్కడ అడ్డుకున్నారు. జెరూసలేంలో సంబరాలు ఇజ్రాయెల్‌లోని జెరూసలేం నగరంలోనూ జనం హర్షాతిరేకాలు వ్యక్తంచేశారు. బందీల రాకకోసం ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్నామని చెప్పారు. ముఖ్యంగా బందీల కుటుంబ సభ్యులు, బంధువులు సంబరాల్లో మునిగిపోయారు. పరస్పరం ఆలింగనాలు చేసుకున్నారు. తాము ఇన్నాళ్లూ చేసిన ప్రార్థనలు ఫలించాయని భావోద్వేగానికి గురయ్యారు. దేవుడు అద్భుతాలు సృష్టిస్తాడని విన్నామని, ఇప్పుడు ప్రత్యక్షంగా చూస్తున్నామని యూదు మత గురువు అవీ కోజ్మన్ వ్యాఖ్యానించారు. అన్ని పక్షాలనూ గౌరవిస్తాం: ట్రంప్ ‘‘గాజాలో బలమైన, మన్నికైన, శాశ్వతమైన శాంతి సాధనలో భాగంగా బందీలందరినీ హమాస్ అతిత్వరలో విడుదల చేస్తుంది. ఇజ్రాయెల్ తమ సైనికులను ఉపసంహరించుకుంటుంది. ఈ విషయంలో అన్ని పక్షాలనూ సమానంగానే గౌరవిస్తాం’’ అని డొనాల్డ్ ట్రంప్ సోషల్ మీడియాలో పోస్టుచేశారు. గురువారం అర్ధరాత్రి గానీ, శుక్రవారం ఉదయం నుంచి గానీ ఇజ్రాయెల్ సైన్యం ఉపసంహరణ ప్రారంభవుతుందని ఆశిస్తున్నట్లు హమాస్ సీనియర్ నేత ఒసామా హమ్దాన్ చెప్పారు. జనసాంద్రత అధికంగా ఉన్న గాజా సిటీ, ఖాన్ యూనిస్, రఫా, ఉత్తర గాజా నుంచి ఇజ్రాయెల్ సైనికులంతా వెళ్లిపోవాలని కోరారు. ఇజ్రాయెల్ జైళ్లలో 250 మంది పాలస్తీనా ఖైదీలు చాలాఏళ్లుగా మగ్గుతున్నారని, గాజాపై యుద్ధం మొదలైన తర్వాత ఈ రెండేళ్లలో మరో 1,700 మంది పాలస్తీనా పౌరులను ఇజ్రాయెల్ సైన్యం నిర్బంధించిందని గుర్తుచేశారు. వీరందరినీ విడుదల చేయాల్సిందేనని తేల్చిచెప్పారు.ఇప్పుడేం జరగొచ్చు? గాజాలో హమాస్‌ను పూర్తిగా నిరీ్వర్యం చేయాలని ఇజ్రాయెల్ పట్టుదలతో ఉంది. వారంతా ఆయుధాలు అప్పగించి, లొంగిపోవాల్సిందేనని చెబుతోంది. ఇదే అంశాన్ని ట్రంప్ ప్లాన్‌లోనూ చేర్చారు. లొంగిపోతే క్షమాభిక్ష ప్రసాదిస్తామని సూచించారు. కానీ, ఆయుధాలు వదిలేయడానికి హమాస్ మిలిటెంట్లు సుముఖంగా లేనట్లు తెలుస్తోంది. గాజా తమ పట్టునుంచి జారిపోకుండా చూసుకోవాలన్నదే వారి ప్రయత్నంగా కనిపిస్తోంది. ఇజ్రాయెల్ సైన్యం గాజా నుంచి పూర్తిగా ఖాళీ చేయాలని, మరోసారి దాడులు చేయొద్దని వారు షరతు విధిస్తున్నారు. సైన్యమంతా వెనక్కి వెళ్లిపోయిన తర్వాతే చివరి బందీని విడుదల చేస్తామని తేల్చిచెబుతున్నారు. గాజాలోని బఫర్ జోన్లలో తమ సైన్యాన్ని కొనసాగించక తప్పదని ఇజ్రాయెల్ వాదిస్తుండడం గమనార్హం. మరోవైపు గాజాలో ప్రత్యామ్నాయ ప్రభుత్వ ఏర్పాటుపై స్పష్టత కొరవడింది. వెస్ట్‌బ్యాంక్ మద్దతున్న పాలస్తీనా అథారిటీకి గాజా అధికార బాధ్యతలు అప్పగించడం గానీ, స్వతంత్ర పాలస్తీనా దేశాన్ని గుర్తించడాన్ని గానీ తాము ఎట్టిపరిస్థితుల్లోనూ అంగీకరించబోమని ఇజ్రాయెల్ చెబుతోంది. మిలిటెంట్లు లొంగిపోయి, స్వతంత్ర పాలస్తీనా అథారిటీ చేతిలోకి పాలనా పగ్గాలు వస్తే తప్ప గాజా పునరి్నర్మాణం సాధ్యం కాదు. 20 లక్షల మంది పాలస్తీనా ప్రజల భవిష్యత్తు ఇంకా తేలడం లేదు. గాజాలో శాశ్వతంగా శాంతి ఎప్పుడు నెలకొంటుందన్న సంగతి ఎవరూ చెప్పలేకపోతున్నారు. అప్పుడేం జరిగింది...2023 అక్టోబర్ 7న హమాస్ మిలిటెంట్లు ఇజ్రాయెల్‌పై హఠాత్తుగా దాడి చేశారు. ఈ దాడిలో దాదాపు 1,200 మంది మరణించారు. మిలిటెంట్లు 251 మందిని బందీలుగా మార్చేసి గాజాకు బలవంతంగా తరలించి, సొరంగాల్లో బంధించారు. వీరిలో ఇజ్రాయెల్ పౌరులతోపాటు విదేశీయులు కూడా ఉన్నారు. హమాస్ దుశ్చర్యపై ఇజ్రాయెల్ సైన్యం వెంటనే ప్రతిస్పందించింది. మిలిటెంట్లను అంతం చేయడమే లక్ష్యంగా భీకర యుద్ధం ఆరంభించింది. గాజాలో రెండేళ్లపాటు సాగిన యుద్ధంలో 67,000 మందికిపైగా మృతిచెందారు. 1.70 లక్షల మంది క్షతగాత్రులుగా మారారు. గాజా చాలావరకు ధ్వంసమైపోయింది. శిథిలాల దిబ్బగా మారింది. అమెరికాలో డొనాల్డ్ ట్రంప్ రెండోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత గాజాలో మారణహోమం ఆపడానికి ప్రయత్నాలు ముమ్మరం చేశారు. ఇటీవలే 20 సూత్రాల శాంతి ప్రణాళికను ప్రతిపాదించారు. ఇజ్రాయెల్‌ను, హమాస్‌ను నయానో భయానో ఒప్పించారు. తన మాట వినకుంటే నరకం చూపిస్తామని హమాస్‌ను హెచ్చరించారు. దాంతో ఉభయ పక్షాలు దారికొచ్చాయి. ట్రంప్ పీస్ ప్లాన్‌ను ఇజ్రాయెల్–హమాస్ మధ్య మూడో కాల్పుల విరమణ ఒప్పందంగా చెప్పుకోవచ్చు. 2023 నవంబర్‌లో ఇరుపక్షాల మధ్య తొలి ఒప్పందం కుదిరింది. అప్పట్లో 100 మందికిపైగా బందీలను హమాస్ విడుదల చేసింది. ఎక్కువ మంది మహిళలు, చిన్నారులే ఉన్నారు. అందుకు ప్రతిగా పాలస్తీనా ఖైదీలను ఇజ్రాయెల్ విడుదల చేసింది. ఈ ఏడాది జనవరి, ఫిబ్రవరిలో రెండో ఒప్పందం కుదిరింది. హమాస్ మిలిటెంట్లు 25 మంది బందీలను వదిలేశారు. అంతేకాకుండా మరణించిన బందీల్లో 8 మంది మృతదేహాలను ఇజ్రాయెల్‌కు అప్పగించారు. అలాగే ఇజ్రాయెల్ ప్రభుత్వం 2,000 మంది పాలస్తీనా ఖైదీలను విడిచిపెట్టింది. ట్రంప్‌కు మోదీ అభినందనలు న్యూఢిల్లీ: శాంతి ప్రణాళికకు ఇజ్రాయెల్, హమాస్ అంగీకారం తెలియజేసినందుకు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌కు భారత ప్రధాని నరేంద్ర మోదీ అభినందనలు తెలియజేశారు. మోదీ గురువారం ట్రంప్‌తో ఫోన్లో మాట్లాడారు. గాజాలో శాంతి సాధనకు కృషి చేసినందుకు తన మిత్రు డిని అభినందించానంటూ మోదీ ‘ఎక్స్’లో పోస్టుచేశారు. ట్రంప్ ప్లాన్ చరిత్రాత్మకమని పేర్కొన్నారు. అలాగే భారత్–అమెరికా మధ్య వాణిజ్య చర్చల్లో పురోగతిని తాము సమీక్షించామని తెలిపారు. రాబోయే రోజుల్లో పరస్పరం సంప్రదించుకోవాలని నిర్ణయానికి వచ్చినట్లు మోదీ స్పష్టంచేశారు. నెతన్యాహుకు మోదీ ఫోన్ ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహుతో కూడా మోదీ ఫోన్లో మాట్లాడారు. ట్రంప్ శాంతి ప్రణాళికలో పురోగతి పట్ల నెతన్యాహుకు అభినందనలు తెలిపారు. గాజా నుంచి బందీల విడుదల, గాజా ప్రజలకు మానవతా సాయం పంపిణీ కోసం అడుగులు ముందుకు పడడాన్ని స్వాగతిస్తున్నట్లు పేర్కొన్నారు. ఉగ్రవాదం ఎక్కడ ఏ రూపంలో ఉన్నాసరే వ్యతిరేకించాల్సిందేనని మోదీ తేల్చిచెప్పారు. -
మణిపూర్‌లో శాంతి స్థాపనకు కేంద్రం కమిటీ
న్యూఢిల్లీ: మణిపూర్‌లో జాతుల మధ్య వైరాన్ని రూపుమాపి శాంతిని స్థాపించేందుకు, వివిధ వర్గాల మధ్య చర్చలు జరిపేందుకు కేంద్రం శాంతి కమిటీని ఏర్పాటు చేసింది. గవర్నర్ సారథ్యంలోని ఈ కమిటీలో ముఖ్యమంత్రి, కొందరు మంత్రులు, వివిధ రాజకీయ పార్టీలకు చెందిన ఎంపీలు, ఎమ్మెల్యేలతోపాటు పౌరసంఘాలకు ప్రాతినిథ్యం ఉంటుందని శనివారం హోం శాఖ తెలిపింది. ఇటీవల మణిపూర్‌లో పర్యటన సమయంలో హోం మంత్రి అమిత్ షా శాంతి కమిటీని ఏర్పాటు చేస్తామని ప్రకటించిన విషయం తెలిసిందే. మణిపూర్‌లో నెల రోజులుగా జరుగుతున్న ఘర్షణల్లో ఇప్పటి వరకు 100 మందికి పైగా ప్రాణాలు కోల్పోగా, మరో 300 మంది గాయపడ్డారు. -
అంతా భారత్ చేతుల్లోనే!
ఇజ్రాయెల్‌తో శాంతి ప్రక్రియలో భారత్ కీలక భూమిక వహించాలని పాలస్తీనా అధ్యక్షుడు మహమూద్ అబ్బాస్.. భారత ప్రధాని మోదీని కోరారు. అంతకుముందు, మోదీకి రమల్లాలో ఘన స్వాగతం లభించింది. అనంతరం ఇరుదేశాధినేతలు ద్వైపాక్షిక అంశాలు, పాలస్తీనా–ఇజ్రాయెల్ శాంతి ఒప్పందాలపై చర్చించారు. రమల్లా: ఇజ్రాయెల్‌తో శాంతి ప్రక్రియలో భారత్ కీలక భూమిక వహించాలని పాలస్తీనా అధ్యక్షుడు మహమూద్ అబ్బాస్.. భారత ప్రధాని మోదీని కోరారు. శాంతి నెలకొల్పే అంశంలో వివిధ దేశాలతో చర్చించి ఒప్పించాల్సిన బాధ్యతను మోదీ భుజస్కంధాలపై పెట్టారు. అంతకుముందు, మోదీకి (పాలస్తీనా అధికార పర్యటనకు వచ్చిన తొలి భారత ప్రధాని) రమల్లాలో ఘన స్వాగతం లభించింది. అనంతరం ఇరుదేశాధినేతలు ద్వైపాక్షిక అంశాలు, పాలస్తీనా–ఇజ్రాయెల్ శాంతి ఒప్పందాలపై చర్చించారు. ద్వైపాక్షిక సంబంధాల బలోపేతం దిశగా ఆరు ఒప్పందాలపై ఇరుదేశాల అధికారులు సంతకాలు చేశారు. పాలస్తీనా సామర్థ్య నిర్మాణం కోసం భారత్ దాదాపు 50 మిలియన్ డాలర్ల (దాదాపు రూ.321 కోట్లు) పెట్టుబడి పెట్టనున్నట్లు మోదీ తెలిపారు. తర్వాత ఇద్దరు నేతలు సంయుక్త మీడియా ప్రకటన విడుదల చేశారు. అంతర్జాతీయంగా పెరుగుతున్న భారత్ ప్రభావం కారణంగానే ఈ శాంతిప్రక్రియలో కీలకంగా వ్యవహరించాలని కోరామని అబ్బాస్ వెల్లడించారు. పాలస్తీనాకు అండగా ఉంటాం పాలస్తీనా ప్రభుత్వం, ప్రజల ప్రయోజనాలను కాపాడే విషయంలో భారత్ చిత్తశుద్ధితో వ్యవహరిస్తోందని మోదీ అన్నారు. ‘భారత్, పాలస్తీనాల మధ్య స్నేహం పురాతనమైనది. పాలస్తీనా అభివృద్ధి ప్రయాణంలో భారత్ భాగస్వామ్యం తప్పకుండా ఉంటుంది. చర్చల ప్రక్రియ ద్వారా పాలస్తీనా త్వరలోనే స్వతంత్ర, సార్వభౌమ దేశంగా నిలవనుంది’ అని మోదీ అన్నారు. పాలస్తీనాలో శాంతి, స్థిరత్వం నెలకొల్పే ప్రక్రియలో భారత్ మద్దతుంటుందని.. అయితే ఈ సమస్యలకు శాశ్వత పరిష్కారం చర్చల ద్వారానే సాధ్యమని మోదీ తెలిపారు. దౌత్యం, దూరదృష్టి మాత్రమే హింసకు అడ్డుకట్ట వేయగలవన్నారు. ‘ఇదేమీ అంత సులభమైన విషయం కాదు. కానీ మేం ఈ దిశగా చిత్తశుద్ధితో ప్రయత్నిస్తాం’ అని ప్రధాని పేర్కొన్నారు. యూఏఈతో ఐదు ఒప్పందాలు పాలస్తీనాలో శాంతి నెలకొల్పేందుకు భారత నాయకత్వం మొదట్నుంచీ అండగా నిలుస్తోందని అబ్బాస్ పేర్కొన్నారు. ప్రధాని మోదీతో నిర్మాణాత్మక, ఫలప్రదమైన చర్చలు జరిగాయని ఆయన తెలిపారు. పాలస్తీనాతోపాటు పశ్చిమాసియా ప్రాంతంలో నెలకొంటున్న పరిస్థితులను మోదీకి వివరించామన్నారు. అయితే.. తూర్పు జెరూసలేంను పాలస్తీనా రాజధానిగా అంగీకరించాల్సిందేనని అబ్బాస్ పేర్కొన్నారు. జోర్డాన్ నుంచి యూఏఈ చేరుకున్న ప్రధాని మోదీకి అబుధాబి యువరాజు మహ్మద్ బిన్ జాయెద్ ఘనస్వాగతం పలికారు. అనంతరం వీరిద్దరూ సమావేశమై.. విస్తృతాంశాలపై చర్చించారు. ఈ సందర్భంగా ఇరు పక్షాల మధ్య ఐదు కీలక ఒప్పందాలు జరిగాయి. ఇందులో భారత ఆయిల్ కంపెనీల కన్సార్షియానికి 10% రాయితీ కల్పించే చారిత్రక ఒప్పందం కూడా ఉంది. ఇది 2018 నుంచి 2057వరకు 40 ఏళ్లపాటు అమ ల్లో ఉంటుంది. ఈ ఒప్పందంతో గల్ఫ్ దేశాల్లోని భారత కార్మికులకు ఉపాధి అవకాశాలు మెరుగుపడతాయి. మోదీకి అరుదైన గౌరవం పాలస్తీనా పర్యటన సందర్భంగా మోదీకి ఆ దేశం అరుదైన గౌరవాన్ని ప్రకటించింది. పాలస్తీనా విదేశీ అతిథులకు ఇచ్చే అత్యున్నత పురస్కారం ‘గ్రాండ్ కాలర్ ఆఫ్ ద స్టేట్ ఆఫ్ పాలస్తీనా’తో సత్కరించింది. అంతకుముందు జోర్డాన్ రాజధాని అమ్మన్ నుంచి రమల్లా వరకు మోదీ హెలికాప్టర్‌కు ఇజ్రాయెల్ హెలికాప్టర్లు రక్షణగా వచ్చాయి. హెలికాప్టర్ దిగగానే.. పాలస్తీనా ప్రధాని హమ్దల్లా స్వాగతం పలికారు. అనంతరం అధ్యక్ష భవనం (మఖాటా)లో ఏర్పాటుచేసిన స్వాగత కార్యక్రమానికి అబ్బాస్ ఆలింగనంతో ఆహ్వానించారు. రమల్లాలోని యాసర్ అరాఫత్ సమాధిని సందర్శించి నివాళులర్పించారు. పాలస్తీనా తమ విదేశీ అతిథులకిచ్చే అత్యున్నత పురస్కారం ‘గ్రాండ్ కాలర్ ఆఫ్ ద స్టేట్ ఆఫ్ పాలస్తీనా’తో మోదీని సత్కరిస్తున్న పాలస్తీనా ప్రధాని మహమూద్ అబ్బాస్. శనివారం రమల్లాలో జరిగిన కార్యక్రమంలో దీన్ని అందించారు. -
ఇండియా, పాక్ విషయంలో రంగంలోకి ట్రంప్!
న్యూయార్క్: దాయాది పాకిస్థాన్, భారత్ మధ్య సమస్యలు కుదిర్చేందుకు అగ్రరాజ్యం అమెరికా పావులు కదుపుతున్నట్లు తెలుస్తోంది. ఏకంగా అమెరికా వివాదాస్పద అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ ఈ విషయంలో రంగంలోకి దిగే యోచన చేస్తున్నట్లు సమాచారం. భారత్, పాక్ మధ్య శాంతి ఒప్పందాన్ని కుదిర్చేందుకు ట్రంప్ జోక్యం చేసుకోనున్నట్లు అమెరికా తరుపున ఐక్యరాజ్యసమితి శాశ్వత రాయబారి నిక్కీ హాలే చెప్పారు. 'భారత్-పాక్ మధ్య సంబంధాల విషయంలో ట్రంప్ పరిపాలన వర్గానికి ఆందోళన ఉంది. ఈ సమస్యను ఎలా పరిష్కరిస్తే బాగుంటుందని, ఏ విధంగా ముందుకు వెళితే ప్రయోజనం ఉంటుందని భావిస్తోంది. ట్రంప్ పాలన వర్గం కచ్చితంగా సమస్యకు పరిష్కారాన్ని మధ్యవర్తిగా ఉండి సూచిస్తారని నేను అనుకుంటున్నాను' అని కూడా ఆమె పేర్కొన్నారు. ఇందులో అధ్యక్షుడు ట్రంప్ పాల్గొన్న పెద్ద ఆశ్చర్యపోనవసరం కూడా లేదని అన్నారు. ఏదో జరిగిందాక తాము ఆగే పరిస్థితిలో లేమని, ప్రస్తుతం ఇరు దేశాల మధ్య ఉద్రిక్త పరిస్థితులు, సమస్యలు మరింత జఠిలంగా మారుతున్న నేపథ్యంలో వీలయినంత త్వరగా ట్రంప్ ఈ విషయాన్ని ముందుకు తీసుకెళ్లాలని అనుకుంటున్నట్లు తెలిపారు. తమ రెండు దేశాల మధ్య ఉన్న సమస్యల విషయాల్లో పొరుగుదేశాల జోక్యాన్ని ఒప్పుకోబోమని ఇప్పటికే భారత్ కుండబద్ధలు కొట్టిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ట్రంప్ ఏ విధంగా రెండు దేశాల విషయాల్లో ముందడుగు వేయనున్నారనే విషయం ఆసక్తిగా మారింది. -
'ప్రస్తుతానికి భారత్‌తో శాంతి ప్రక్రియ లేదు'
న్యూ ఢిల్లీ: ఇటీవలి కాలంలో పట్టాలెక్కినట్లు కనిపించిన భారత్-పాక్ శాంతి ప్రక్రియను ప్రస్తుతానికి నిలిపేస్తున్నట్లు పాకిస్తాన్ ప్రకటించింది. భారత్‌లోని పాక్ హై కమిషనర్ అబ్దుల్ బాసిత్ గురువారం మాట్లాడుతూ.. భారత్‌తో శాంతి ప్రక్రియను సస్పెండ్ చేస్తున్నట్లు తెలిపారు. ఇరు దేశాల మధ్య అపనమ్మకానికి కారణం కాశ్మీర్ అంశమే అని ఆయన స్పష్టం చేశారు. బెలుచిస్తాన్ ప్రాంతంలో ఇటీవల అరెస్టైన కుల్బుషన్ యాదవ్ అంశాన్ని సైతం బాసిత్ ఈ సందర్భంగా ప్రస్తావించారు. కుల్బుషన్ను మరోమారు భారత గూఢచారిగా ఆయన పేర్కొన్నారు. భారత్‌తో పూర్తి స్థాయిలో సహజమైన, శాంతియుతమైన సంబంధాన్ని పాక్ కోరుకుంటోందని తెలిపిన బాసిత్.. ఇస్లామాబాద్‌లో జరగనున్న సార్క్ సదస్సు ఇరుదేశాల మధ్య సంబంధాలను బలోపేతం చేస్తుందని ఆశిస్తున్నట్లు వెల్లడించారు. పాక్ బృందాన్ని పఠాన్ కోట్ ఎయిర్ బేస్ కు అనుమతించి ప్రతిపక్షాల నుంచి విమర్శలు ఎదుర్కొంటున్న మోదీ ప్రభుత్వానికి 'పాక్ యూటర్న్' మరో ఎదురుదెబ్బ కానుంది. -
‘శాంతి చర్చల’ నాలుగు స్తంభాలాట!
అఫ్ఘాన్ శాంతి చర్చలలో కీలక పాత్రధారులుగా కనిపిస్తున్న అమెరికా, తాలిబన్, కర్జాయ్, పాక్‌లకు ఎవరికి వారికి సొంత అజెండా ఉంది. కాబట్టే శాంతి చర్చలు నాలుగు స్తంభాలాటగా మారాయి. భూమి గుండ్రంగా ఉన్నదని మరోసారి రుజువైంది. అమెరికా జూన్‌లో అట్టహాసంగా ప్రారంభించిన అఫ్ఘానిస్థాన్ శాంతి చర్చల నావ బయలుదేరిన తీరానికే తిరిగి చేరింది. శాంతి చర్చలు కొనసాగుతాయంటూ తాలి బన్ల అగ్రనేత ముల్లా ఒమర్ మంగళవారం చేసిన ప్రకటన అమెరికాతో చర్చలను ఉద్దేశించినదేనని పొరబడటానికి వీల్లేదు. అమెరికాతో చర్చలకోసం ఖతార్ రాజధాని దోహాలో తాలిబన్లు తెరచిన కార్యాలయం జూలై 9నే మూతబడింది. మరి ఒమర్ చర్చలంటున్నది ఎవరితో? ఎవరితోనో ‘అసోసియేటెడ్ ప్రెస్’ వార్తా సంస్థ సోమవారంనాడే వెల్లడించింది. అధ్యక్షుడు హమీద్ కర్జాయ్ ఏరికోరి నియమించిన అత్యున్నత శాంతి మండలి సభ్యులకు, తాలిబన్లకు మధ్య అనధికారికంగా చర్చలు జరుగుతున్నాయని అది తెలిపింది. జూన్ 19న అఫ్ఘాన్ శాంతిభద్రతల పరిరక్షణ విధులను జాతీయ భద్రతా బలగాలకు అప్పగించిన రోజునే కర్జాయ్ అమెరికాపై అలిగారు. కారణం శాంతి చర్చలే! కర్జాయ్ ప్రభుత్వ ప్రమేయం లేకుండా దోహాలో తాలిబన్లతో అమెరికా నేరుగా చర్చలకు పూనుకున్నందునే ఆయన అలిగారు. అలిగి, అరచి, ఆగ్రహించి అమెరికాను కాళ్ల బేరానికి వచ్చేలా చేయడం ఎలాగో కర్జాయ్‌కి కొట్టిన పిండే. కాబట్టే సొంత బలం లేకుం డానే పదేళ్లుగా అఫ్ఘాన్ అధినేతగా కొనసాగుతున్నారు. 2010లోనే కర్జాయ్ నేరుగా తాలి బన్లతో తెరవెనుక చర్చలు ప్రారంభించారు. జూన్‌లో బెడిసికొట్టిన అమెరికా ‘శాంతి చర్చల’లో కర్జాయ్‌కు స్థానం లేనట్ట్టే, ఆనాటి కర్జాయ్ చర్చలు కూడా అమెరికా ప్రమేయం లేకుండా సాగినవి. అమెరికా బెదిరించి, బతి మాలి, బుజ్జగించి అప్పట్లో కర్జాయ్ చేత తాలి బన్లతో చర్చలను విరమింపజేసింది. నేడు కథ మళ్లీ మొదటికి వచ్చింది. అఫ్ఘాన్ శాంతి చర్చల ప్రహసనంలోంచి అమెరికా నిష్ర్కమించి, కర్జాయ్ రంగ ప్రవేశం చేశారు. శాంతి చర్చలు జరుపుతామంటూనే, దాడులను ముమ్మరం చేస్తామని ఒమర్ తన ప్రకటనలో స్పష్టం చేశారు. అమెరికా, అప్ఘాన్ ప్రభుత్వాలే జూన్‌లో ప్రారంభమైన చర్చల ప్రక్రియను దెబ్బ తీశాయని ఆయన ఆరోపణ. పనిలో పనిగా వచ్చే ఏడాది ఏప్రిల్‌లో జరిగే అధ్యక్ష ఎన్నికలను బహిష్కరించాల్సిందిగా ఒమర్ అఫ్ఘాన్లకు పిలుపునిచ్చారు. 2014 చివరికి అమెరికా, నాటో బలగాలు నిష్ర్కమించనుండగా ఎన్నికల నిర్వహణ ‘అర్థరహిత, అనవసర కాలహరణమే’నని ఆయన స్పష్టం చేశారు. కాబట్టి ఆమెరికా అఫ్ఘాన్ ‘ఎండ్ గేమ్’ (ముగింపు క్రీడ) అనుకున్నట్టు జరగదనేది స్పష్టమే. ఏప్రిల్ 5 ఎన్నికల్లోగానే, అంటే ఈ ఏడాది చివరికే తాలి బన్లతో ఒప్పందాన్ని కుదుర్చుకొని, ఎన్నికల ద్వారా ఏర్పడబోయే నూతన ప్రభుత్వాన్ని అధికారంలో కూర్చోబెట్టడం ‘ఎండ్ గేమ్’లో కీలక ఘట్టం. అమెరికా ఆర్థిక, వ్యూహాత్మక ప్రయోజనాలకు హామీని కల్పించి, సైనిక స్థావరాల కొనసాగింపునకు అంగీకరించే నూతన ప్రభుత్వంతో ఒప్పందం కుదుర్చుకోవాలని అమెరికా భావిస్తోంది. అమెరికాతో శాంతి చర్చలకు తాలిబన్ల ప్రధాన షరతు కర్జాయ్ ప్రభుత్వాన్ని చర్చల ప్రక్రియ నుంచి, అధికార పంపకం నుంచి మినహాయించడమే. కానీ తాలిబన్లు అదే కర్జాయ్‌తో నేరుగా తెరచాటు సంబంధాలు నెరపుతూనే ఉన్నారు. ఎప్పుడు ఎవరితో చర్చలు సాగించాలో, విరమించాలో నిర్ణయించేది తాలిబన్లే. మరోవంక అమెరికా విదేశాంగ మంత్రి జాన్ కెర్రీ ఈ నెల ఒకటిన తాలిబన్లతో చర్చలు తిరిగి మొదలు కావడానికి సహకరించాలని పాకిస్థాన్‌ను అభ్యర్థించారు. గత ఏడాది జరిపిన ‘శాంతి చర్చల’ నుంచి అమెరికా, కర్జాయ్‌లు పాక్‌ను మినహాయించాయి. నేడు అదే పాక్ సహా యంతో చర్చలకు అమెరికా తాపత్రయపడుతోంది. దోహా స్థాన బలం కలిసి రాలేదో ఏమో రెండు దేశాలూ కలిసి చర్చల వేదికను మరో దేశానికి మార్చాలని నిర్ణయించాయి! అఫ్ఘాన్ శాంతి చర్చలలో కీలక పాత్రధారులుగా కనిపిస్తున్న అమెరికా, తాలిబన్, కర్జాయ్, పాక్‌లకు ఎవరికి వారికి సొంత అజెండా ఉంది. కాబట్టే శాంతి చర్చలు నాలుగు స్తంభాలాటగా మారాయి. ఒమర్ ప్రకటనలో శాంతి చర్చలు ఎవరితోనో ప్రస్తావించకపోవడమేగాక, కర్జాయ్ ప్రభుత్వంతో చర్చలకు అంగీకరించేదిలేదనే మూసపోత షరతును ఉపసంపహరించారు. అంటే తాలిబన్లు అటు కర్జాయ్ ప్రభుత్వంతోనూ, ఇటు అమెరికాతోనూ కూడా ఒకేసారి విడి విడిగా చర్చలు సాగించడమనే నూతన ఘట్టం ఆవిష్కృతం కానున్నదని భావించాలా? నిజానికి తాలిబన్లు కూడా చర్చల విషయంలో సందిగ్ధంలో ఉన్నారు. సేనల ఉపసంహరణ తదుపరి అతి కొద్ది కాలంలోనే ప్రభుత్వ బలగాలను చిత్తుగా ఓడించగలమనే అంచనాతో చర్చలను ఒక వర్గం పూర్తిగా వ్యతిరేకిస్తోంది. మరో వర్గం మాత్రం అది సుదీర్ఘ అంతర్గత యుద్ధంగా మారుతుందని భయపడుతున్నారు. ఈ సందిగ్ధం నుంచి వెంటనే బయటపడాలన్న ఆదుర్దాగానీ, అగత్యంగానీ తాలిబన్లకు లేదు. అందుకే ఈ ఆటను కొనసాగిస్తున్నారు. ఏది ఏమైనా అఫ్ఘాన్‌లో పాక్‌కు ఎలాంటి పాత్రా లేకుండా చేయాలన్న కర్జాయ్ ఆశలు నెరవేరేలా లేవు. అమెరికా పరిస్థితి సైతం ఇరాక్‌లో లాగే అఫ్ఘాన్ నుంచి కూడా ఎలాంటి దీర్ఘకాలిక వ్యూహాత్మక ఒప్పందమూ లేకుండా, అవమానకరంగా నిష్ర్కమించాల్సిన దుస్థితిగా మారేట్టుంది. - పిళ్లా వెంకటేశ్వరరావు