
ట్రంప్ ప్రణాళికలో మొదటి దశకు ఇజ్రాయెల్, హమాస్ అంగీకారం
జెరూసలేం/న్యూఢిల్లీ: వైమానిక దాడులు, బాంబు పేలుళ్లు, విధ్వంసాలు, ఆకలి చావులతో రెండేళ్లుగా అల్లాడిపోతున్న కల్లోలిత గాజా స్ట్రిప్‌లో శాంతి సాధనకు ఎట్టకేలకు అడుగులుపడ్డాయి. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రతిపాదించిన 20 సూత్రాల శాంతి ప్రణాళికలో మొదటి దశను వైరిపక్షాలైన ఇజ్రాయెల్, హమాస్ అంగీకరించాయి. ఈ మేరకు ఒప్పందంపై ఇరుపక్షాలు సంతకం చేయబోతున్నాయి.
రెండేళ్లుగా కొనసాగుతున్న యుద్ధం పూర్తిగా ముగింపునకు వచ్చే సూచనలు కనిపిస్తున్నాయి. మొదటి దశ ఒప్పందం ప్రకారం.. గాజాలో దాడులు వెంటనే ఆపేయాలి. తమ చెరలో ఉన్న ఇజ్రాయెల్ బందీలను అతిత్వరలో హమాస్ మిలిటెంట్లు విడుదల చేయనున్నారు. అందుకు బదులుగా తమ నిర్బంధంలో ఉన్న పాలస్తీనా ఖైదీలకు ఇజ్రాయెల్ ప్రభుత్వం విముక్తి కలి్పంచనుంది. అలాగే గాజా నుంచి ఇజ్రాయెల్ సైన్యం వెనక్కి వెళ్లిపోనుంది.
హమాస్ అ«దీనంలో 20 మంది బందీలు సజీవంగా ఉన్నట్లు అంచనా. భగవంతుడి దయతో వారందరినీ స్వదేశానికి తీసుకొస్తామని ఇజ్రాయెల్ ప్రధానమంత్రి బెంజమిన్ నెతన్యాహు సోషల్ మీడియాలో పోస్టుచేశారు. హమాస్ సైతం స్పందించింది. ఒప్పందం ప్రకారం ఇజ్రాయెల్ సేనలు వెనక్కి వెళ్లిపోవాలని, గాజాలోకి మానవతా సాయాన్ని ఇజ్రాయెల్ ప్రభుత్వం అనుమతించాలని పేర్కొంది.
ఇజ్రాయెల్ బందీలను విడుదల చేస్తామని వెల్లడించింది. అందుకు బదులుగా ఇజ్రాయెల్ జైళ్లలో మగ్గుతున్న పాలస్తీనా ఖైదీలను తమకు అప్పగించాలని తేల్చిచెప్పింది. మరోవైపు రెండు కీలకమైన అంశాలపై స్పష్టత రాలేదు. ట్రంప్ ప్లాన్ ప్రకారం హమాస్ మిలిటెంట్లు ఆయుధాలు వదిలేసి లొంగిపోవాలి. గాజా పరిపాలన బాధ్యతలను నిపుణులతో కూడిన స్వతంత్ర పాలస్తీనా అథారిటీకి అప్పగించాలి. ఈ రెండింటిపై హమాస్ గానీ, ఇజ్రాయెల్ గానీ ఎలాంటి ప్రకటన చేయకపోవడం గమనార్హం.
గాజాలో ఆనందోత్సాహాలు
ట్రంప్ శాంతి ప్రణాళికలో మొదటి దశను ఇజ్రాయెల్, హమాస్ అంగీకరించడంతో గాజాలో పండుగ వాతావరణం నెలకొంది. స్థానికులు ఆనందం వ్యక్తంచేశారు. యుద్ధం ఇక ఆగిపోతుందని, రక్తపాతానికి తెరపడుతుందని, తమకు మంచి రోజులు వస్తాయని ఆశిస్తున్నట్లు చెప్పారు. ఈ క్షణం కోసమే ఎదురు చూస్తున్నామని అన్నారు. జనం పరస్పరం అభినందనలు చెప్పుకుంటున్న దృశ్యాలు కనిపించాయి.
గాజాలో పనిచేస్తున్న జర్నలిస్టులు సైతం సంబరాల్లో మునిగిపోయారు. కొందరు పాలస్తీనా సంప్రదాయ నృత్యాలు చేశారు. మారణహోమం, అన్యాయం, అణచివేత కారణంగా మానసికంగా, శారీరకంగా అలసిపోయామని, ఇకనైనా ఊపిరి పీల్చుకుంటానని ఓ ఆసుపత్రిలో పనిచేస్తున్న నర్సు చెప్పారు. మరోవైపు శాంతి ప్రణాళిక అమల్లోకి వచ్చినట్లు భావించిన నిరాశ్రయులు తమ స్వస్థలాలకు చేరుకోవడానికి ప్రయత్నించగా ఇజ్రాయెల్ సైనికులు ఎక్కడికక్కడ అడ్డుకున్నారు.
జెరూసలేంలో సంబరాలు
ఇజ్రాయెల్‌లోని జెరూసలేం నగరంలోనూ జనం హర్షాతిరేకాలు వ్యక్తంచేశారు. బందీల రాకకోసం ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్నామని చెప్పారు. ముఖ్యంగా బందీల కుటుంబ సభ్యులు, బంధువులు సంబరాల్లో మునిగిపోయారు. పరస్పరం ఆలింగనాలు చేసుకున్నారు. తాము ఇన్నాళ్లూ చేసిన ప్రార్థనలు ఫలించాయని భావోద్వేగానికి గురయ్యారు. దేవుడు అద్భుతాలు సృష్టిస్తాడని విన్నామని, ఇప్పుడు ప్రత్యక్షంగా చూస్తున్నామని యూదు మత గురువు అవీ కోజ్‌మన్ వ్యాఖ్యానించారు.
అన్ని పక్షాలనూ గౌరవిస్తాం: ట్రంప్
‘‘గాజాలో బలమైన, మన్నికైన, శాశ్వతమైన శాంతి సాధనలో భాగంగా బందీలందరినీ హమాస్ అతిత్వరలో విడుదల చేస్తుంది. ఇజ్రాయెల్ తమ సైనికులను ఉపసంహరించుకుంటుంది. ఈ విషయంలో అన్ని పక్షాలనూ సమానంగానే గౌరవిస్తాం’’ అని డొనాల్డ్ ట్రంప్ సోషల్ మీడియాలో పోస్టుచేశారు. గురువారం అర్ధరాత్రి గానీ, శుక్రవారం ఉదయం నుంచి గానీ ఇజ్రాయెల్ సైన్యం ఉపసంహరణ ప్రారంభవుతుందని ఆశిస్తున్నట్లు హమాస్ సీనియర్ నేత ఒసామా హమ్‌దాన్ చెప్పారు.
జనసాంద్రత అధికంగా ఉన్న గాజా సిటీ, ఖాన్ యూనిస్, రఫా, ఉత్తర గాజా నుంచి ఇజ్రాయెల్ సైనికులంతా వెళ్లిపోవాలని కోరారు. ఇజ్రాయెల్ జైళ్లలో 250 మంది పాలస్తీనా ఖైదీలు చాలాఏళ్లుగా మగ్గుతున్నారని, గాజాపై యుద్ధం మొదలైన తర్వాత ఈ రెండేళ్లలో మరో 1,700 మంది పాలస్తీనా పౌరులను ఇజ్రాయెల్ సైన్యం నిర్బంధించిందని గుర్తుచేశారు. వీరందరినీ విడుదల చేయాల్సిందేనని తేల్చిచెప్పారు.
ఇప్పుడేం జరగొచ్చు?
గాజాలో హమాస్‌ను పూర్తిగా నిరీ్వర్యం చేయాలని ఇజ్రాయెల్ పట్టుదలతో ఉంది. వారంతా ఆయుధాలు అప్పగించి, లొంగిపోవాల్సిందేనని చెబుతోంది. ఇదే అంశాన్ని ట్రంప్ ప్లాన్‌లోనూ చేర్చారు. లొంగిపోతే క్షమాభిక్ష ప్రసాదిస్తామని సూచించారు. కానీ, ఆయుధాలు వదిలేయడానికి హమాస్ మిలిటెంట్లు సుముఖంగా లేనట్లు తెలుస్తోంది.
గాజా తమ పట్టునుంచి జారిపోకుండా చూసుకోవాలన్నదే వారి ప్రయత్నంగా కనిపిస్తోంది. ఇజ్రాయెల్ సైన్యం గాజా నుంచి పూర్తిగా ఖాళీ చేయాలని, మరోసారి దాడులు చేయొద్దని వారు షరతు విధిస్తున్నారు. సైన్యమంతా వెనక్కి వెళ్లిపోయిన తర్వాతే చివరి బందీని విడుదల చేస్తామని తేల్చిచెబుతున్నారు. గాజాలోని బఫర్ జోన్లలో తమ సైన్యాన్ని కొనసాగించక తప్పదని ఇజ్రాయెల్ వాదిస్తుండడం గమనార్హం. మరోవైపు గాజాలో ప్రత్యామ్నాయ ప్రభుత్వ ఏర్పాటుపై స్పష్టత కొరవడింది.
వెస్ట్‌బ్యాంక్ మద్దతున్న పాలస్తీనా అథారిటీకి గాజా అధికార బాధ్యతలు అప్పగించడం గానీ, స్వతంత్ర పాలస్తీనా దేశాన్ని గుర్తించడాన్ని గానీ తాము ఎట్టిపరిస్థితుల్లోనూ అంగీకరించబోమని ఇజ్రాయెల్ చెబుతోంది. మిలిటెంట్లు లొంగిపోయి, స్వతంత్ర పాలస్తీనా అథారిటీ చేతిలోకి పాలనా పగ్గాలు వస్తే తప్ప గాజా పునరి్నర్మాణం సాధ్యం కాదు. 20 లక్షల మంది పాలస్తీనా ప్రజల భవిష్యత్తు ఇంకా తేలడం లేదు. గాజాలో శాశ్వతంగా శాంతి ఎప్పుడు నెలకొంటుందన్న సంగతి ఎవరూ చెప్పలేకపోతున్నారు.
అప్పుడేం జరిగింది...
2023 అక్టోబర్ 7న హమాస్ మిలిటెంట్లు ఇజ్రాయెల్‌పై హఠాత్తుగా దాడి చేశారు. ఈ దాడిలో దాదాపు 1,200 మంది మరణించారు. మిలిటెంట్లు 251 మందిని బందీలుగా మార్చేసి గాజాకు బలవంతంగా తరలించి, సొరంగాల్లో బంధించారు. వీరిలో ఇజ్రాయెల్ పౌరులతోపాటు విదేశీయులు కూడా ఉన్నారు. హమాస్ దుశ్చర్యపై ఇజ్రాయెల్ సైన్యం వెంటనే ప్రతిస్పందించింది. మిలిటెంట్లను అంతం చేయడమే లక్ష్యంగా భీకర యుద్ధం ఆరంభించింది.
గాజాలో రెండేళ్లపాటు సాగిన యుద్ధంలో 67,000 మందికిపైగా మృతిచెందారు. 1.70 లక్షల మంది క్షతగాత్రులుగా మారారు. గాజా చాలావరకు ధ్వంసమైపోయింది. శిథిలాల దిబ్బగా మారింది. అమెరికాలో డొనాల్డ్ ట్రంప్ రెండోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత గాజాలో మారణహోమం ఆపడానికి ప్రయత్నాలు ముమ్మరం చేశారు. ఇటీవలే 20 సూత్రాల శాంతి ప్రణాళికను ప్రతిపాదించారు. ఇజ్రాయెల్‌ను, హమాస్‌ను నయానో భయానో ఒప్పించారు. తన మాట వినకుంటే నరకం చూపిస్తామని హమాస్‌ను హెచ్చరించారు. దాంతో ఉభయ పక్షాలు దారికొచ్చాయి.
ట్రంప్ పీస్ ప్లాన్‌ను ఇజ్రాయెల్–హమాస్ మధ్య మూడో కాల్పుల విరమణ ఒప్పందంగా చెప్పుకోవచ్చు. 2023 నవంబర్‌లో ఇరుపక్షాల మధ్య తొలి ఒప్పందం కుదిరింది. అప్పట్లో 100 మందికిపైగా బందీలను హమాస్ విడుదల చేసింది. ఎక్కువ మంది మహిళలు, చిన్నారులే ఉన్నారు. అందుకు ప్రతిగా పాలస్తీనా ఖైదీలను ఇజ్రాయెల్ విడుదల చేసింది. ఈ ఏడాది జనవరి, ఫిబ్రవరిలో రెండో ఒప్పందం కుదిరింది. హమాస్ మిలిటెంట్లు 25 మంది బందీలను వదిలేశారు. అంతేకాకుండా మరణించిన బందీల్లో 8 మంది మృతదేహాలను ఇజ్రాయెల్‌కు అప్పగించారు. అలాగే ఇజ్రాయెల్ ప్రభుత్వం 2,000 మంది పాలస్తీనా ఖైదీలను విడిచిపెట్టింది.
ట్రంప్‌కు మోదీ అభినందనలు
న్యూఢిల్లీ: శాంతి ప్రణాళికకు ఇజ్రాయెల్, హమాస్ అంగీకారం తెలియజేసినందుకు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌కు భారత ప్రధాని నరేంద్ర మోదీ అభినందనలు తెలియజేశారు. మోదీ గురువారం ట్రంప్‌తో ఫోన్‌లో మాట్లాడారు. గాజాలో శాంతి సాధనకు కృషి చేసినందుకు తన మిత్రు డిని అభినందించానంటూ మోదీ ‘ఎక్స్’లో పోస్టుచేశారు. ట్రంప్ ప్లాన్ చరిత్రాత్మకమని పేర్కొన్నారు. అలాగే భారత్–అమెరికా మధ్య వాణిజ్య చర్చల్లో పురోగతిని తాము సమీక్షించామని తెలిపారు. రాబోయే రోజుల్లో పరస్పరం సంప్రదించుకోవాలని నిర్ణయానికి వచ్చినట్లు మోదీ స్పష్టంచేశారు.
నెతన్యాహుకు మోదీ ఫోన్
ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహుతో కూడా మోదీ ఫోన్‌లో మాట్లాడారు. ట్రంప్ శాంతి ప్రణాళికలో పురోగతి పట్ల నెతన్యాహుకు అభినందనలు తెలిపారు. గాజా నుంచి బందీల విడుదల, గాజా ప్రజలకు మానవతా సాయం పంపిణీ కోసం అడుగులు ముందుకు పడడాన్ని స్వాగతిస్తున్నట్లు పేర్కొన్నారు. ఉగ్రవాదం ఎక్కడ ఏ రూపంలో ఉన్నాసరే వ్యతిరేకించాల్సిందేనని మోదీ తేల్చిచెప్పారు.