అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కోరుకుంటున్నట్లే.. శాంతి బహుమతి వరించింది. నోబెల్ కాదు.. ఫిఫా శాంతి బహుమతి (FIFA Peace Award)రూపంలో. ఈ ఏడాదే ప్రారంభమైన తొలి ‘ఫిఫా శాంతి బహుమతి’ని శాంతిదూత ట్రంప్‌కు ప్రకటిస్తున్నట్లు ఫిఫా పేర్కొంది. అవార్డు అందుకుంటూ ట్రంప్ కూడా ఖుషీ అయిపోయారు. దీనికి సంబంధించిన వీడియో వైరల్‌గా మారింది. అయితే, ఈ శాంతి బహుమతి ట్రంప్‌నకు ఇవ్వడంతో పొలిటికల్ టర్న్ తీసుకుంది.
ఫిఫా ఫుట్‌బాల్ ప్రపంచకప్-2026 (FIFA World Cup 2026) పోటీలకు సంబంధించి వాషింగ్టన్ డీసీలోని కెన్నడీ సెంటర్‌లో డ్రా కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఫిఫా ప్రపంచకప్ ట్రోఫీని ఆవిష్కరించారు. ఈ కార్యక్రమానికి అధ్యక్షుడు ట్రంప్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ క్రమంలో ఫిఫా అధ్యక్షుడు గియాని ఇన్‌ఫాంటినో మాట్లాడుతూ.. డొనాల్డ్ ట్రంప్‌నకు తొలి ‘ఫిఫా శాంతి బహుమతి’ని ప్రకటిస్తున్నట్లు పేర్కొన్నారు. దీంతో ట్రంప్.. బంగారు పతకాన్ని అందుకున్నారు. ఈ సందర్భంగా అమెరికా అధ్యక్షుడిని గియాని ప్రశంసలతో ముంచెత్తారు. ప్రపంచ దౌత్యంలో ట్రంప్ పాత్ర ఎనలేనిదని పేర్కొన్నారు. ఎన్నో యుద్ధాలను ఆయన ఆపారని తెలిపారు. ఇందుకు గాను ఫిఫా శాంతి బహుమతిని ట్రంప్‌నకు ఇస్తున్నట్టు చెప్పుకొచ్చారు.
కాంగో-రువాండా ఘర్షణలు ఏంటి?
కాంగో-రువాండా ఘర్షణలు డెమోక్రాటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగో (DRC) తూర్పు ప్రాంతంలో దశాబ్దాలుగా జరుగుతున్నాయి. ఇది ఖనిజ సంపద, 1994 రువాండా మారణహోమం, రువాండా మద్దతుగల M23 తిరుగుబాటుదారుల కార్యకలాపాలతో ముడిపడి ఉంది. DRC తూర్పు ప్రాంతంలో కోబాల్ట్, బంగారం వంటి విలువైన ఖనిజాలు ఉండటం, వాటిపై నియంత్రణ కోసం కాంగో-రువాండా మధ్య పోరాటం కొనసాగుతోంది. 1994 రువాండా మారణహోమం తర్వాత హుటు, టుట్సీ జాతుల మధ్య ఉద్రిక్తతలు పెరిగాయి. DRCలోకి శరణార్థులు తరలి వెళ్లడం ఎక్కువైంది. ఈ క్రమంలో రువాండా మద్దతుతో ఉన్న M23 వంటి సాయుధ సమూహాలు, DRC ప్రభుత్వంతో పోరాడటం ప్రారంభమైంది. దీంతో, రెండు వర్గాల మధ్య పొరుగు దేశాల జోక్యం, ఆయుధాల సరఫరా, ప్రాంతీయ ప్రయోజనాలు తెరపైకి వచ్చాయి. అంతర్గత పోరు, దాడుల కారణంగా లక్షలాది మంది ప్రజలు నిరాశ్రయులయ్యారు. వేలాది మంది మరణించారు. లైంగిక హింస వంటివి విపరీతంగా పెరిగాయి. ముఖ్యమైన ఖనిజాలపై నియంత్రణ లేకపోవడంతో దోపిడీ జరిగింది.
ఇటీవలి పరిణామాలు (2022-2025):
శాంతి చర్చలు: కెన్యా, అంగోలా ద్వారా చర్చలు విఫలం కాగా, 2024లో కాల్పుల విరమణ ఒప్పందం కుదిరింది.
US-ఖతార్ ఒప్పందం: జూన్ 2025లో అమెరికా(డొనాల్డ్ ట్రంప్), ఖతార్ మధ్యవర్తిత్వంతో ఒక చారిత్రక శాంతి ఒప్పందంపై సంతకం జరిగింది. ఇందులో సైనిక కార్యకలాపాలను నిలిపివేయడం, శరణార్థులను పునరావాసం కల్పించడం వంటివి ఉన్నాయి.
M23తో ఒప్పందం: నవంబర్ 2025లో M23 తిరుగుబాటుదారులు, DRC ప్రభుత్వం దోహాలో ఒక ఒప్పందంపై సంతకం చేసి, శాంతికి ఒక రోడ్‌మ్యాప్‌ను రూపొందించారు. అమెరికా, ఖతార్ మధ్యవర్తిత్వంతో శాంతి ఒప్పందాలు కుదిరినప్పటికీ మానవ హక్కుల ఉల్లంఘనలు, దాడులు కొనసాగుతూనే ఉన్నాయి. తూర్పు DRCలో పోరాటాలు ఉద్రికత్తలకు దారి తీశాయి. M23.. గోమా వంటి ప్రాంతాలను స్వాధీనం చేసుకుంది.
M23 గ్రూప్..
- 2012లో M23 గ్రూప్ ఏర్పడింది.
- ఇది కాంగోలోని టుట్సీ వర్గానికి చెందిన మాజీ CNDP తిరుగుబాటు దళాల నుండి విడిపోయిన గ్రూప్.
- 2009లో కాంగో ప్రభుత్వం CNDPతో ఒక శాంతి ఒప్పందం (March 23 Agreement) కుదుర్చుకుంది.
- ఆ ఒప్పందంలోని నిబంధనలు అమలు కాలేదని ఆరోపిస్తూ, తిరుగుబాటు దళాలు “March 23 Movement (M23)” పేరుతో కొత్త గ్రూప్‌ను ఏర్పాటు చేశాయి.
2012–2013 తిరుగుబాటు
- M23 తూర్పు కాంగోలో వేగంగా ఎదిగింది
- గోమా నగరాన్ని కూడా స్వాధీనం చేసుకుంది. ఇది పెద్ద రాజకీయ సంక్షోభానికి దారితీసింది.
- అంతర్జాతీయ ఒత్తిడి, ఐక్యరాజ్యసమితి దళాల జోక్యంతో 2013లో M23 ఓడిపోయింది.
- నాయకులు రువాండా, ఉగాండా వంటి దేశాలకు పారిపోయారు.
2021 తర్వాత మళ్లీ పునరుద్ధరణ
- 2021 చివరలో M23 మళ్లీ చురుకుగా మారింది.
- 2022–2025 మధ్య ఈ గ్రూప్ తూర్పు కాంగోలో పెద్ద ఎత్తున దాడులు చేసింది.
- కాంగో ప్రభుత్వం రువాండా ఈ గ్రూప్‌కు మద్దతు ఇస్తోంది అని ఆరోపిస్తోంది.
- రువాండా మాత్రం ఈ ఆరోపణలను తిరస్కరిస్తోంది.
- 2025లో కూడా M23 గోమా, కిట్షంగా, బుకావు వంటి ప్రాంతాల్లో యుద్ధం కొనసాగిస్తోంది.
M23 గ్రూప్ లక్ష్యాలు
- టుట్సీ వర్గాల రక్షణ
- కాంగో ప్రభుత్వంపై రాజకీయ ఒత్తిడి
- 2009 ఒప్పందం అమలు చేయించుకోవడం
- తూర్పు కాంగోలో తమ ప్రభావాన్ని పెంచుకోవడం.
ట్రంప్ ఏమన్నాడంటే.. ప్రపంచవ్యాప్తంగా శాంతి నెలకొల్పడమే నా లక్ష్యం. అవార్డులతో సంబంధం లేకుండా నా పని నేను చేస్తున్నాను. నా దౌత్యంతో యుద్ధాలను ఆపాను.. లక్షలాది మంది ప్రాణాలను కాపాడాను. కాంగో శాంతి ఒప్పందమే అందుకు ఉదాహరణ. కాంగో-రువాండా మధ్య హింసతో 10 మిలియన్ల మంది చనిపోయారు. మరో 10 మిలియన్ల మంది చావు అంచుల్లో ఉన్నారు. ప్రాణనష్టాన్ని నివారించేందుకు చర్యలు చేపట్టాను. ఇండియా-పాకిస్తాన్ యుద్ధాన్ని సైతం నేనే ఆపాను. నా చర్యలతో ఎన్నో దేశాల మధ్య యద్ధాలు ఆగిపోయాయి. ఇంకొన్ని దేశాల్లో యుద్ధం ప్రారంభం కాకముందే ముగిశాయి. ఇది నాకు ఎంతో గర్వకారణం. ఈ అవార్డు పొందడం జీవితంలో దక్కిన అతిపెద్ద గౌరవాల్లో ఇదొకటి’ అని వ్యాఖ్యలు చేశారు.
#FIFAWorldCup 🇺🇸 Trump just won the FIRST-EVER FIFA Peace Prize!
Golden globe for the man bringing REAL peace. Nobel said no… FIFA said HELL YES! America leads, the world heals 🔥🏆
Who’s with President Peace?! Drop a 🇺🇸
#MAGA pic.twitter.com/j1K98OaTra— TRUTH🕊️ (@HonestHalo) December 5, 2025
ఈ ఏడాదే ప్రారంభం..
ప్రపంచ ఫుట్‌బాల్ బాడీ అయిన ఫిఫా ఈ ఏడాది నుంచే శాంతి బహుమతిని ఇవ్వడం ప్రారంభించింది. తొలిసారి శాంతి బహుమతిని ఇవ్వనున్నట్టు నవంబర్ 5న ప్రకటించింది. ఈ క్రమంలో శాంతి బహుమతి.. ఫుట్‌బాల్ ప్రపంచాన్ని ఏకం చేస్తుందని పేర్కొంది. కాగా, ప్రపంచ వ్యాప్తంగా శాంతి స్థాపన కోసం తీవ్రంగా శ్రమించే వారికి, తన చర్యలతో ప్రపంచాన్ని ఏకం చేసే వారికి ఈ బహుమతిని అందజేయనున్నట్లు ఫిఫా ప్రకటించింది. అంతేకాకుండా ఈ బహుమతి ఫిఫా గౌరవాన్ని మాత్రమే పెంచదని, 500 కోట్ల మంది ఫుట్‌బాల్ అభిమానుల తరఫున అందజేసేదిగా గియాని అభివర్ణించారు. ఫిఫాకు ఇదొక గుర్తింపు అని చెప్పారు.
విమర్శల వర్షం..
ట్రంప్‌నకు ఫిఫా బాడీ శాంతి ప్రకటించడంపై విమర్శలు చెలరేగుతున్నాయి. హ్యూమన్ రైట్ వాట్ సంస్థ ఫిఫాపై బహిరంగాంగానే విమర్శలు గుప్పించింది. అవార్డు ఎంపికపై పారదర్శకత పాటించలేదని, నామినీలు, జూరీ సభ్యులు లేరని పేర్కొంది. ఫిఫా కౌన్సిల్‌లోనూ ఇది వార్తగా నిలిచినట్లు తెలిపింది. ఇక, ట్రంప్.. కాంగో-రువాండా మధ్య శాంతి నెలకొల్పినట్టు చెబుతున్నప్పటికీ అక్కడ పరిస్థితుల్లో పెద్దగా మార్పులేమీ లేకపోవడం గమనార్హం. మరోవైపు.. యుద్ధాలను ఆపుతున్నట్టు ట్రంప్ చెప్పినా.. భారత్-పాక్ మధ్య ఆయన ప్రమేయమే లేదని ఇప్పటికే ప్రధాని మోదీ స్పష్టం చేశారు. రష్యా-ఉక్రెయిన్ మధ్య శాంతి నెలకొల్పడం ట్రంప్ ఇప్పటికీ విఫలం అవుతూనే ఉన్నాయి. ఈ పరిణామాల నేపథ్యంలో ఫిఫా శాంతి బహుమతిని ట్రంప్‌కు ఇవ్వడంపై విమర్శలు పెరిగాయి. అసలు ట్రంప్‌కు అంత సీన్ ఉందా? అని పలువురు విశ్లేషకులు, నెటిజన్లు బహిరంగంగానే విమర్శలు చేస్తున్నారు.


