బీజింగ్: భారత్, చైనాలు తమకు సన్నిహిత మిత్రదేశాలంటూనే ఆ రెండు దేశాల ద్వైపాక్షిక సంబంధాల్లో జోక్యం చేసుకునే హక్కు తమకు లేదన్న రష్యా అధ్యక్షుడు పుతిన్ వ్యాఖ్యలను చైనా మీడియా ప్రముఖంగా ప్రచురించింది. పుతిన్ భారత్ పర్యటనకు పెద్దగా ప్రాముఖ్యం ఇవ్వని చైనా ఈ విషయాన్ని మాత్రం హైలైట్ చేసుకుంది. రష్యాకు ఇటీవలి కాలంలో బాగా దగ్గరైన చైనా భారత్‌లో పుతిన్ పర్యటనపై అధికారికంగా ఎటువంటి వ్యాఖ్యలు చేయలేదు. ‘భారత్, చైనా రెండు కూడా మాకు సన్నిహిత మిత్రులే. ఆ సంబంధాన్ని మేము ఎంతగానో గౌరవిస్తాం.
ఈ రెండు దేశాల ద్వైపాక్షిక సంబంధాల్లో జోక్యం చేసుకునే హక్కు మాకుందని నేను భావించడం లేదు’అని పుతిన్ ఓ ఇంటర్వ్యూలో చెప్పారు. భారత్, చైనా నేతలు తమ మధ్య ఉన్న అత్యంత సున్నితమైనవి సహా అన్ని విభేదాలకు పరిష్కారం కనుగొనేందుకు కట్టుబడి ఉన్నారు. వీటిపై రెండు దేశాల మధ్య ఒప్పందాలు కుదిరేలా ఇద్దరు నేతలు ప్రయతి్నస్తారని నమ్మకం ఉంది. అదే సమయంలో, ఆ సమస్యలు రెండు దేశాలకు సంబంధించినవి అయినందున రష్యాకు కలుగజేసుకునే హక్కు లేదు’అని ఆయన చెప్పిన విషయాన్ని చైనా మీడియా ప్రస్తావించింది. రష్యాతో సన్నిహిత వ్యూహాత్మక భాగస్వామ్య దేశంగా ఉన్న చైనా.. భారత్, రష్యాలు దగ్గరవడంపై మాత్రం అసహనంతో ఉన్నట్లు విశ్లేషకులు చెబుతున్నారు.
చైనాతో సన్నిహిత సంబంధాలను అభివృద్ధి చేసుకుంటూనే, భారత్‌తోనూ ఎప్పటిలాగానే మైత్రిని కొనసాగించారు పుతిన్. 2020లో లద్దాఖ్‌లో ఉద్రిక్తతల సమయంలోనూ ఇదే విధమైన బ్యాలెన్స్‌ను పుతిన్ కొనసాగించారని విశ్లేషకులు గుర్తు చేస్తున్నారు. దీంతోపాటు, రష్యా చమురును భారత్ కొనుగోలు చేయడంపై ట్రంప్ ప్రభుత్వం తెస్తున్న ఒత్తిడులపై పుతిన్ చేసిన వ్యాఖ్యలను కూడా చైనా మీడియా ప్రస్తావించింది. తమ నుంచి అణు ఇంధనాన్ని కొనుగోలు చేస్తున్న అమెరికాకు, భారత్ చమురు కొనడంపై ఎందుకు అభ్యంతరమని పుతిన్ ప్రశ్నించారని కూడా తెలిపింది. ప్రస్తావించాల్సిన అంశమేమంటే..భారత్‌లో పర్యటనకు కొద్దిరోజుల ముందే చైనా, రష్యాలు ఆసియా పసిఫిక్‌తోపాటు పొరుగుదేశాల్లో భద్రతా పరమైన ప్రయోజనాలే లక్ష్యంగా వ్యూహాత్మక చర్చలు జరపడం..!


