ఉన్నత శిఖరాలకు మన బంధం | Narendra Modi and Putin Attend India Russia Business Forum | Sakshi
Sakshi News home page

ఉన్నత శిఖరాలకు మన బంధం

Dec 6 2025 1:31 AM | Updated on Dec 6 2025 1:36 AM

Narendra Modi and Putin Attend India Russia Business Forum

రెండుదేశాల సంబంధాలతోపాటు ద్వైపాక్షిక అంశాలపై చర్చ

వేర్వేరు కీలక రంగాల్లో పరస్పర సహకారానికి 11 ఒప్పందాలు

ఉక్రెయిన్‌పై యుద్ధానికి తెరపడాలని ప్రధాని మోదీ ఆకాంక్ష

ఉక్రెయిన్‌–రష్యా మధ్య శాశ్వత శాంతికి సహకరిస్తామని వెల్లడి

భారత్‌ తటస్థం కాదు.. శాంతి పక్షమేనని స్పష్టీకరణ

రష్యా పౌరుల కోసం ఉచిత వీసా పథకాలు ప్రకటించిన మోదీ

భారత్‌కు నిరంతరాయంగా ఇంధనం సరఫరా చేస్తామన్న పుతిన్‌

ఎన్ని ఒత్తిళ్లు ఉన్నా వెనక్కి తగ్గబోమని ఉద్ఘాటన

ఇండియా–రష్యా బిజినెస్‌ ఫోరమ్‌ భేటీకీ హాజరైన మోదీ, పుతిన్‌

భారీగా పెట్టుబడులు పెట్టాలని వ్యాపారవేత్తలకు మోదీ పిలుపు

ఇరుదేశాల మధ్య అవరోధాల్లేకుండా వాణిజ్యం జరగాలన్న పుతిన్‌

న్యూఢిల్లీ:  భారత్, రష్యా ద్వైపాక్షిక సంబంధాలను ఉన్నత శిఖరాలకు చేర్చాలని ఇరుదేశాల అధినేతలు నిర్ణయించారు. ఎనిమిది దశాబ్దాల స్నేహ సంబంధాలకు నూతన శక్తి, వేగాన్ని జోడించాలని తీర్మానించారు. అమెరికా టారిఫ్‌లు, ఆంక్షల నేపథ్యంలో పరస్పర సహకారాన్ని మరింత బలోపేతం చేసుకోవాలని నిర్ణయానికొచ్చారు. ఇందులో భాగంగా ఆర్థిక–వాణిజ్య రంగాల్లో పరస్పర సహకారానికి ఐదేళ్ల ప్రణాళికను ప్రకటించారు.

ఉక్రెయిన్‌లో ఘర్షణకు సాధ్యమైనంత త్వరగా తెరపడాలని తాము కోరుకుంటున్నట్లు భారత ప్రధాని నరేంద్ర మోదీ రష్యా అధినేత పుతిన్‌కు స్పష్టంచేశారు. శాంతియుత మార్గాల్లో సమస్య పరిష్కారం కావాలని ఆకాంక్షించారు. ఉక్రెయిన్‌–రష్యా విషయంలో భారత్‌ తటస్థంగా లేదని.. శాంతిపక్షం వైపే ఉందని స్పష్టంచేశారు. ఆ రెండు దేశాల మధ్య శాశ్వత శాంతికి తమ వంతు సహకారం కచ్చితంగా అందిస్తామన్నారు. మోదీ, పుతిన్‌ శుక్రవారం ఢిల్లీలో 23వ భారత్‌–రష్యా సదస్సులో పాల్గొన్నారు. ఇరుదేశాల సంబంధాల్లో పురోగతితోపాటు ముఖ్యమైన అంశాలపై చర్చించారు.

ఈ సందర్భంగా ఆరోగ్యం, రవాణా, వలసలు, ఆహార భద్రత, షిప్పింగ్, ప్రజల మధ్య అనుసంధానం తదితర అంశాల్లో పరస్పర సహకారానికి సంబంధించి ఇరుపక్షాలు కీలక ఒప్పందాలపై సంతకాలు చేశాయి. రక్షణ రంగంలో ఆయుధాలు, మిలటరీ హార్డ్‌వేర్‌ తయారీలో సహకారానికి ఒప్పందం కుదిరింది.  రెండు దేశాల మధ్య వార్షిక వాణిజ్యాన్ని 2030 నాటికి 100 బిలియన్‌ డాలర్లకు చేర్చడమే లక్ష్యంగా ‘ఆర్థిక సహకార కార్యక్రమం’పై భారత్, రష్యా అంగీకారానికి వచ్చాయి. సదస్సు అనంతరం మోదీ, పుతిన్‌ ఉమ్మడిగా మీడియాతో మాట్లాడారు.

ధ్రువ నక్షత్రంలా మన స్నేహం 
ప్రపంచం గత ఎనిమిది దశాబ్దాలుగా ఎన్నో ఒడిదొడుకులకు, సమస్యలకు సాక్షిగా నిలుస్తోందని ప్రధాని మోదీ చెప్పారు. మానవాళికి సవాళ్లు, సంక్షోభాలు ఎదురవుతూనే ఉన్నాయని తెలిపారు. ప్రపంచ భౌగోళిక రాజకీయాల్లో ఎలాంటి ప్రతికూల పరిణామాలు సంభవించినా భారత్‌–రష్యా స్నేహం మాత్రం ధ్రువ నక్షత్రంలా స్థిరంగా నిలిచే ఉంటోందని స్పష్టంచేశారు. పరస్పర గౌరవం, లోతైన విశ్వాసం ఆధారంగా ఈ బంధం నిర్మితమైందని, కాల పరీక్షకు నిలిచిందని అన్నారు. ఈ పునాదిని ఇంకా పటిష్టంగా మార్చుకొనే దిశగా పరస్పర సహకారమే లక్ష్యంగా అన్ని అంశాలపై చర్చించామని చెప్పారు. ఆర్థిక సహకారాన్ని కొత్త శిఖరాలకు చేర్చడం ఉమ్మడి ప్రాధాన్యత కలిగిన అంశమని వివరించారు. 2030 నాటికి ద్వైపాక్షిక వాణిజ్యాన్ని 100 బిలియన్‌ డాలర్లకు చేర్చడం ఖాయమని ధీమా వ్యక్తంచేశారు. ద్వైపాక్షిక వాణిజ్యం, పెట్టుబడులను వైవిధ్యంగా, సమతుల్యంగా, సుస్థిరంగా మార్చబోతున్నట్లు వివరించారు. రష్యా పౌరుల కోసం 30 రోజుల ఉచిత ఈ–టూరిసుŠట్‌ వీసా, 30 రోజుల ఉచిత గ్రూప్‌ టూరిస్ట్‌ వీసాను మోదీ ప్రకటించారు. త్వరలోనే ఇవి అమల్లోకి వస్తాయన్నారు.

ఉగ్రవాదంపై రాజీలేని పోరాటం చేయాలి
భారత్‌–రష్యా భాగస్వామ్యానికి ఇంధన భద్రత, పౌర అణు ఇంధన రంగాల్లో సహకారం చాలా కీలకమని ప్రధాని గుర్తుచేశారు. ఇరుదేశాల నడుము ‘గెలుపు–గెలుపు సహకారాన్ని’ ఇలాగే కొనసాగిస్తామన్నారు. ప్రపంచమంతటా సప్లై చైన్స్‌ భద్రంగా, వైవిధ్యంగా ఉండాలంటే భారత్, రష్యా మధ్య అరుదైన ఖనిజాల విషయంలో సహకారం చాలా ముఖ్యమ న్నారు. ఉగ్రవాదంపై పోరాటంపై రెండు దేశాలు భుజం భుజం కలిపి పనిచేస్తున్నాయని గుర్తుచేశారు. భారత్‌లోని పహల్గాం ఉగ్రదాడి, రష్యాలోని క్రోకస్‌ సిటీ హాల్‌పై ఉగ్రదాడి మూలాలు ఒక్కలేనని చెప్పారు. ఉగ్రవాదం అనేది మానవీయ విలువలపై ప్రత్యక్ష దాడిగా మోదీ అభివరి్ణంచారు. ఉగ్రవాద రక్కసిని ఖతం చేయడానికి ప్రపంచ దేశాలన్నీ కలిసి పని చేయాలని పిలుపునిచ్చారు. రహస్య అజెండాలు, ద్వంద్వ ప్రమాణాలు పక్కనపెట్టి ఉగ్రవాదంపై రాజీలేని పోరాటం చేయాలని ప్రపంచ దేశాలకు స్పష్టంచేశారు.

‘మేక్‌ ఇన్‌ ఇండియా’కు చోదక శక్తి 
భారత్, రష్యా ప్రజల మధ్య అనుసంధానం మరింత పెరగాలని నరేంద్ర మోదీ చెప్పారు. ఇందుకోసం ఇంటర్నేషనల్‌ నార్త్‌ సౌత్‌ ట్రాన్స్‌పోర్ట్‌ కారిడార్, నార్తన్‌ సీ రూట్, చెన్నై–వ్లాడివోస్తోక్‌ కారిడార్‌కు శ్రీకారం చుట్టినట్లు తెలియజేశారు. రష్యా సహకారంతో ధ్రువపు ప్రాంతాల్లో భారత నావికులకు శిక్షణ ఇవ్వపోతున్నట్లు ప్రకటించారు. దీనివల్ల భారతీయ యువతకు నూతన ఉపాధి అవకాశాలు అందుబాటులోకి వస్తాయన్నారు. నౌకల నిర్మాణంలో సహకారాన్ని మెరుగుపర్చుకుంటున్నామని, ‘మేక్‌ ఇన్‌ ఇండియా’కు ఇదొక చోదక శక్తి అవుతుందన్నారు. భారత్‌–రష్యా సంబంధాలను బలోపేతం చేయడానికి తిరుగులేని అంకితభావం ప్రదర్శిస్తున్నారంటూ పుతిన్‌పై ప్రధాని మోదీ ప్రశంసల వర్షం కురిపించారు. మానవ వనరులను ఇచ్చి పుచ్చుకోవడానికి రష్యాతో రెండు ఒప్పందాలు చేసుకున్నామని వెల్లడించారు.

భారత ఇంధన అవసరాలు తీరుస్తాం
భారత్, రష్యా మధ్య ప్రస్తుతం ఏటా 64 బిలియన్‌ డాలర్ల వాణిజ్యం జరుగుతోందని, దీన్ని 100 బిలియన్‌ డాలర్లకు పెంచబోతున్నామని రష్యా అధ్యక్షుడు పుతిన్‌ తేల్చి చెప్పారు. తమపై ఎన్ని ఒత్తిళ్లు ఎదురైనా, ఆంక్షలు విధించినా భారత ఇంధన అవసరాలను తీరుస్తామని హామీ ఇచ్చారు. చమురు, గ్యాస్, బొగ్గు సరఫరా విషయంలో తాము విశ్వసనీయమైన సరఫరాదారులమని తేలి్చచెప్పారు. అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థ అయిన భారత్‌కు నిరంతరాయంగా ఇంధనం సరఫరా చేయడానికి సిద్ధంగా ఉన్నామని వివరించారు. భారత ఉత్పత్తుల కోసం రష్యా మార్కెట్లను మరింతగా అందుబాటులోకి తీసుకొస్తామని పుతిన్‌ సంకేతాలిచ్చారు. అలాగే చిన్న, మధ్య తరహా అణు రియాక్టర్లు, ఫ్లోటింగ్‌ అణు విద్యుత్‌ ఉత్పత్తి ప్లాంట్ల నిర్మాణానికి సహకరించుకోవడానికి భారత్, రష్యా ఆసక్తి చూపుతున్నాయని చెప్పారు.

వ్యవసాయం, ఔషధాల వంటి రంగాల్లో అణు టెక్నాలజీని వాడుకోవడానికి భారత్‌కు సహకరిస్తామన్నారు. భద్రత, ఆర్థికం, వాణిజ్యం, సంస్కృతి వంటి రంగాల్లో సహకారానికి అత్యధిక ప్రాధాన్యం ఇస్తున్నామని వ్యాఖ్యానించారు. భారత్, రష్యాలు ఒకేరకమైన ఆలోచనా ధోరణితో బహుళ ధ్రువపు ప్రపంచ దిశగా పని చేస్తున్నాయని పుతిన్‌ పేర్కొన్నారు. మరోవైపు ఉక్రెయిన్‌ విషయంలో శాంతియుత పరిష్కారం కోసం ప్రయత్నిస్తున్నామని వివరించారు. పహల్గాంలో జరిగిన ఉగ్రవాద దాడిని పుతిన్‌ తీవ్రంగా ఖండించారు. ఉగ్రవాద భూతాన్ని భూస్థాపితం చేయాల్సిందేనని పేర్కొన్నారు.

11 ఒప్పందాలపై సంతకాలు 
23వ ఇండియా–రష్యా సదస్సు సందర్భంగా మొత్తం 11 ఒప్పందాలపై ఇరు దేశాలు సంతకాలు చేశాయి. నైపుణ్యం కలిగిన కారి్మకుల వలసలు, ఆహార భద్రత, షిప్పింగ్, ఎరువులు, ఆరోగ్య సంరక్షణ, శాస్త్రీయ పరిశోధనలు, విద్య తదితర రంగాల్లో పరస్పర సహకారానికి ఈ ఒప్పందాలు కుదిరాయి. ప్రతిభావంతులైన భారతీయ కార్మికులను తమ దేశంలో నియమించుకోవడానికి వీలుగా రష్యా ప్రభుత్వం భారత్‌తో ఒప్పందం కుదుర్చుకుంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement