న్యూఢిల్లీ: రిజర్వ్ బ్యాంక్ పాలసీ రేట్లను తగ్గించడంతో ఆ ప్రయోజనాలను కస్టమర్లకు బదలాయించే పనిలో పడ్డాయి ప్రభుత్వ రంగ బ్యాంకులు. బ్యాంక్ ఆఫ్ బరోడా (బీవోబీ) రెపో ఆధారిత రుణ రేటును 8.15 శాతం నుంచి 7.90 శాతానికి తగ్గించినట్లు ప్రకటించింది. డిసెంబర్ 6 నుంచి ఈ రేటు అమల్లోకి వస్తుందని తెలిపింది.
అటు బ్యాంక్ ఆఫ్ ఇండియా కూడా తమ రెపో ఆధారిత రుణ రేటు (ఆర్‌బీఎల్‌ఆర్)ను 8.35 శాతం నుంచి 8.10 శాతానికి తగ్గించినట్లు పేర్కొంది. మరో ప్రభుత్వ రంగ దిగ్గజం ఇండియన్ బ్యాంక్ ఇటీవలే ఏడాది కాలవ్యవధికి సంబంధించిన ఎంసీఎల్‌ఆర్‌ని (మార్జినల్ కాస్ట్ ఆఫ్ ఫండ్స్ ఆధారిత రుణ రేటు) 5 బేసిస్ పాయింట్లు కట్ చేసి 8.80 శాతానికి తగ్గించింది.


