అమెరికన్ ఇంటర్నెట్ మౌలిక సదుపాయాల సంస్థ క్లౌడ్‌ఫ్లేర్ సేవలకు అంతరాయం కలగడంతో ప్రపంచవ్యాప్తంగా పలు వెబ్‌సైట్‌లు స్తంభించాయి. క్లౌడ్‌ఫ్లేర్ వినియోగదారులు తీవ్ర సమస్యలు ఎదుర్కొన్నారు. భారత దేశానికి చెందిన ట్రేడింగ్ ప్లాట్‌ఫామ్‌లైన జెరోధా, గ్రో వెబ్‌సైట్లు కూడా పనిచేయలేదు. వీటితో పాటు కాన్వా, జూమ్, షాపిఫై, వాలరెంట్, లింక్డ్ఇన్, డౌన్ డిటెక్టర్ వెబ్‌సైట్ల కార్యకలాపాలు నిలిచిపోయాయి.
క్లౌడ్‌ఫ్లేర్ సేవల్లో అంతరాయం కారణంగా తాము సాంకేతిక సమస్యలను ఎదుర్కొంటున్నామని పేర్కొంటూ గ్రో (Groww) సంస్థ ఎక్స్ ద్వారా వెల్లడించింది. “క్లౌడ్‌ఫ్లేర్ సేవల్లో ప్రపంచవ్యాప్తంగా అంతరాయం కారణంగా మేము ప్రస్తుతం సాంకేతిక సమస్యలను ఎదుర్కొంటున్నాము. ఇది ప్రపంచవ్యాప్తంగా బహుళ యాప్‌లు, సేవలను ప్రభావితం చేస్తోంది. మేము పరిస్థితిని నిశితంగా పర్యవేక్షిస్తున్నాము. సేవలు పునరుద్ధరించబడిన వెంటనే మీకు తెలియజేస్తాం. మీ సహనానికి ధన్యవాదాలు,” అని ట్వీట్ చేసింది. తర్వాత పది నిమిషాలకు తమ సేవలను పునరుద్ధరించినట్టు ఎక్స్‌లో మరో పోస్ట్ పెట్టింది.
అసౌకర్యానికి చింతిస్తున్నాం
క్లౌడ్‌ఫ్లేర్‌లో క్రాస్-ప్లాట్‌ఫారమ్ డౌన్‌టైమ్ కారణంగా కైట్ యాప్ సేవలు నిలిచిపోయాయని జెరోధా పేర్కొంది. ట్రేడింగ్ కోసం కైట్ వాట్సాప్ బ్యాకప్‌ను ఉపయోగించుకోవాలని తమ వినియోగదారులకు ఎక్స్ ద్వారా సూచించింది. సమస్య పరిష్కారమైందని, కైట్ యాప్ సేవలు పునరుద్ధరించబడ్డాయని కొంత సేపటి తర్వాత ప్రకటించింది. వినియోగదారులకు కలిగిన అసౌకర్యానికి చింతిస్తున్నట్టు తెలిపింది. జెరోధా కైట్ అనేది ఆన్‌లైన్ ట్రేడింగ్ ప్లాట్‌ఫామ్, యాప్.
క్లౌడ్‌ఫ్లేర్ ఏం చేస్తుంది?
అమెరికా కేంద్రంగా పనిచేస్తున్న క్లౌడ్‌ఫ్లేర్ అతిపెద్ద ఇంటర్నెట్ (Internet) నిర్వహణ కంపెనీల్లో ఒకటి. ఇంటర్నెట్‌కు సంబంధించిన అనేక రకాల సేవలను అందిస్తోంది. వెబ్‌సైట్‌లు, యాప్‌లు, నెట్‌వర్క్‌లను వేగంగా, సురక్షితంగా ఉంచడానికి అవసరమైన సర్వీసులు ఇస్తోంది. ప్రపంచవ్యాప్తంగా 125 దేశాలల్లో కార్యకలాపాలు నిర్వహిస్తున్న క్లౌడ్‌ఫ్లేర్‌కు 3 లక్షల మంది వినియోగదారులు ఉన్నారు. ఒక త్రైమాసికంలో దాదాపు $500 మిలియన్లను ఆర్జిస్తుందని ద గార్డియన్ వెల్లడించింది.
చదవండి: ఇండిగో సంక్షోభానికి కారణాలు ఇవేనా..
కారణాలు అన్వేషిస్తున్నాం
సేవల్లో అంతరాయానికి గల కారణాలను క్లౌడ్‌ఫ్లేర్ (Cloudflare) వెల్లడించలేదు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న తమ వినియోగదారుల వెబ్‌సైట్లు స్తంభించడంతో సమస్యను వెంటనే పరిష్కరించామని ప్రకటించింది. సమస్య తలెత్తడానికి గల కారణాలను తెలుసుకోవడానికి ప్రయత్నిస్తున్నామని వెల్లడించింది. నవంబర్ 18న కూడా క్లౌడ్‌ఫ్లేర్ సేవలకు అంతరాయం కలిగింది. దీంతో చాట్‌జీపీటీ, స్పాటిఫై, ఎక్స్ వెబ్‌సైట్లు స్తంభించాయి.తమ డేటాబేస్‌లో చేసిన మార్పు వల్ల ఇది సంభవించిందని సీఈవో మాథ్యూ ప్రిన్స్ తెలిపారు.


