
చదువుకుని ఒక డిగ్రీ తెచ్చుకుంటే.. వెంటనే ఉద్యోగంలో చేరిపోవచ్చని చాలామంది అనుకుంటారు. కానీ డిగ్రీ ఉంటేనే ఉద్యోగాలు త్వరగా లభిస్తాయని చెప్పలేమని లింక్డ్ఇన్ సీఈఓ 'ర్యాన్ రోస్లాన్‌స్కీ' (Ryan Roslansky) పేర్కొన్నారు.
పరుగులు పెడుతున్న పోటీ ప్రపంచంలో కేవలం ఒక కాలేజీ డిగ్రీ సరిపోదు. నైపుణ్యాలను మెరుగుపరచుకోవాలి. ముఖ్యంగా ఏఐ (ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్) గురించి చాలా నేర్చుకోవాల్సి ఉందని.. గత వారం కంపెనీ శాన్ ఫ్రాన్సిస్కో కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో ర్యాన్ రోస్లాన్‌స్కీ ఈ వ్యాఖ్యలు చేశారు.
మార్పు అనేది చాలా ఉత్తేజకరమైన విషయం అని భావిస్తున్నాను. ఎందుకంటే ఉద్యోగ భవిష్యత్తు ఇకపై ఫ్యాన్సీ డిగ్రీలు ఉన్నవారికి లేదా మంచి కాలేజీలో చదువుకున్న వారికి మాత్రమే చెందదు. మారుతున్న కాలానికి అనుగుణంగా అలోచించి కొత్త టెక్నాలజీలను నేర్చుకోవడానికి సిద్ధంగా ఉన్నవారికి ఉద్యోగాలు లభిస్తాయని నా అంచనా అని అన్నారు.
ఏఐ మనుషుల స్థానాన్ని భర్తీ చేస్తుందనే విషయాన్ని నేను నమ్మనని ర్యాన్ రోస్లాన్‌స్కీ అన్నారు. అయితే కమ్యునికేషన్, ఎవరితో అయినా మాట్లాడగలగడం వంటివి నేర్చుకోవాలి. స్కిల్స్ ఎప్పుడూ పెంచుకుంటూ ఉండాలి. మీరు ముందుకు సాగడానికి ప్రయత్నిస్తున్న ఏ పనిలోనైనా విజయం సాధించడానికి అవి చాలా కీలకం అని ఆయన అన్నారు.
ఇదీ చదవండి: ముకేశ్ అంబానీ పర్సులో ఎంత డబ్బు ఉంటుందో తెలుసా?
ఏఐ గురించి తెలుసుకోవడం లేదా నేర్చుకోవడం చాలా అవసరం. ఎందుకంటే రాబోయే రోజుల్లో ఏఐ నైపుణ్యాలు ఉన్న వ్యక్తికే పరిశ్రమల్లో ఉద్యోగాలు లభిస్తాయి. అంటే ఉద్యోగం కోసం ఏఐ ఒక సాధనంగా ఉపయోగపడుతుంది. ఉద్యోగ మార్కెట్ వేగంగా మారుతోంది. నిపుణులు నిరంతరం తమను తాము అప్డేట్ అవ్వాల్సిన అవసరం ఉందని చెబుతూనే ఉన్నారని ర్యాన్ రోస్లాన్‌స్కీ చెప్పారు.