రిచ్ డాడ్ పూర్ డాడ్ పుస్తకంతో ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందిన ఆర్థిక నిపుణుడు, ప్రముఖ రచయిత రాబర్ట్ కియోసాకి ప్రపంచ ఆర్థిక వ్యవస్థను కుదిపేసే హెచ్చరిక చేశారు. 2026 నుంచి అతిపెద్ద మాంద్యం ప్రారంభమవుతుందని, ఇప్పటి నుంచే ప్రజలు సిద్ధంగా ఉండాలని ఆయన ఎక్స్ వేదికగా సుదీర్ఘ పోస్ట్‌లో పేర్కొన్నారు.
ఉద్యోగ నష్టాలు.. ముందస్తు సంకేతాలు
ప్రస్తుతం అమెరికాలో చోటుచేసుకుంటున్న ఉద్యోగ నష్టాలను రాబోయే మహా మాంద్యానికి ముందస్తు సంకేతాలుగా కియోసాకి పేర్కొన్నారు. ఏడీపీ నేషనల్ ఎంప్లాయ్‌మెంట్ నివేదికను ఉటంకిస్తూ, నవంబర్‌లో అమెరికాలో దాదాపు 32,000 ఉద్యోగాలు కోల్పోయారని తెలిపారు. ముఖ్యంగా పెద్ద కంపెనీలతో పాటు, చిన్న వ్యాపారాలు 1,20,000 మంది ఉద్యోగులను తొలగించడం మరింత కలవరానికి గురిచేసిందని అన్నారు.
‘2026లో భారీగా ఉద్యోగ తొలగింపులు మొదలవుతాయి. మీ ఉద్యోగం ప్రమాదంలో ఉంటే ఇప్పుడే నా పాఠం #4ని గుర్తుచేసుకోండి. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలినప్పుడు ధనవంతులు ఎలా జీవిస్తారో అలాగే మీరూ జీవించండి’ అని కియోసాకి ఉద్యోగులకు హితవు పలికారు.
డబ్బు సంపాదించే మార్గాలు
మాంద్యం ప్రభావం నుంచి బయటపడటానికి తక్షణమే ఆదాయాన్ని పెంచుకునే మార్గాలను ఆయన సూచించారు. సొంత కారు ఉన్నవారు వెంటనే ఉబర్ (Uber) వంటి సేవల్లో చేరి అదనపు ఆదాయాన్ని సంపాదించాలని సూచించారు. మాంద్యం సమయంలో అమ్మకం నైపుణ్యం అనేది జీవనాధారమవుతుందని, దురదృష్టవశాత్తూ చాలా మంది ఉద్యోగులకు ఈ నైపుణ్యం లేదని ఆందోళన వ్యక్తం చేశారు.
రియల్ ఎస్టేట్ క్రాష్
2026లో ముఖ్యంగా రెసిడెన్షియల్ (నివాస), కమర్షియల్ (వాణిజ్య) రియల్ ఎస్టేట్ మార్కెట్ పూర్తిగా క్రాష్ అవుతుందని కియోసాకి హెచ్చరించారు. ‘బేరసారాలు ఉండవు. లైఫ్‌టైమ్ ఒప్పందాలు మీ కోసం ఎదురుచూస్తాయి. పెట్టుబడిదారులు సిద్ధంగా ఉండండి’ అని మాంద్యం సమయంలోనే అద్భుతమైన పెట్టుబడి అవకాశాలు ఉంటాయని ఆయన సూచించారు.
కళాశాల డిగ్రీ కంటే నైపుణ్యాలు ఉత్తమం
ఉపయోగంలేని డిగ్రీల కోసం మళ్లీ కళాశాలకు వెళ్లి రుణాలు తీసుకోవద్దని, దానికి బదులుగా నర్సింగ్, ప్లంబింగ్, ఎలక్ట్రీషియన్, వృద్ధుల సంరక్షణ వంటి ఆచరణాత్మక నైపుణ్యాలు నేర్చుకోవాలని అన్నారు. ‘ప్రపంచానికి ఎప్పుడూ ఈ నైపుణ్యాలు కావాలి’ అని అన్నారు.
Lesson #4: How to get richer when the economy crashes:
ADP just announced 32,000 jobs were lost in November.
Those job losses are from big businesses.
The frightening news is small businesses laid off 120,000 workers.
The bigger lay offs will begin in 2026 when the world…— Robert Kiyosaki (@theRealKiyosaki) December 4, 2025
బంగారం, వెండి, క్రిప్టో.. ఇవే భవిష్యత్తు
ప్రస్తుతం చెలామణిలో ఉన్న డాలర్‌ను కియోసాకి మళ్లీ నకిలీ డబ్బుగా అభివర్ణించారు. సంక్షోభ సమయంలో డబ్బును కాపాడుకోవడానికి నిజమైన ఆస్తుల్లో పొదుపు చేయాలని ఆయన సూచించారు. బంగారం, వెండి, బిట్‌కాయిన్, ఎథేరియం వంటి ప్రధాన క్రిప్టోకరెన్సీల్లో పెట్టుబడి పెట్టాలన్నారు. ప్రస్తుతం ఔన్సుకు 57 డాలర్లుగా ఉన్న వెండి ధర, జనవరి 2026 నాటికి 96 డాలర్లకు చేరుకుంటుందని అంచనా వేశారు.
ఇదీ చదవండి: విద్య ముసుగులో రూ.546 కోట్ల మోసం


