భారతీయ ఎగుమతులపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రభుత్వం విధించిన 50 శాతం సుంకాలు భారత ఆర్థిక వ్యవస్థపై ఎక్కువ ప్రభావాన్ని చూపడంలేదని, దీన్ని ఎగుమతి రంగం ఒక అవకాశంగా మార్చుకోవాలని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఆర్‌బీఐ) గవర్నర్ సంజయ్ మల్హోత్రా అన్నారు. ఆర్‌బీఐ మానిటరీ పాలసీ కమిటీ (ఎంపీసీ) సమావేశాల అనంతరం విలేకరులతో మాట్లాడిన మల్హోత్రా, భారతదేశం ప్రధానంగా దేశీయ డిమాండ్‌పై ఆధారపడిన ఆర్థిక వ్యవస్థ కాబట్టి యూఎస్ సుంకాల ప్రభావం గణనీయంగా ఉండదని స్పష్టం చేశారు. అయినప్పటికీ, లేబర్ ఇంటెన్సివ్ రంగాలపై ప్రభావం కనిపిస్తున్నట్లు ఆయన అంగీకరించారు.
సుంకాల పెరుగుదల, ఎగుమతుల తగ్గుదల
ఆగస్టు 1 నుంచి అమెరికా 25 శాతం సుంకాలు విధించగా, ఆగస్టు 27 నుంచి రష్యా నుంచి ఇంధన దిగుమతుల కారణంగా అదనంగా 25 శాతం సుంకాలు అమలు చేసింది. ఏప్రిల్ 2న ప్రారంభమైన 10 శాతం సుంకాలు ఆగస్టు చివరి నాటికి 50 శాతానికి చేరాయి. ఈ పరిణామాల వల్ల భారత్ తన అతిపెద్ద విదేశీ మార్కెట్ అయిన అమెరికాకు చేసే ఎగుమతులు గణనీయంగా తగ్గాయి.
గ్లోబల్ ట్రేడ్ రీసెర్చ్ ఇనిషియేటివ్ (జీటీఆర్‌ఐ) నివేదిక ప్రకారం, మే నుంచి అక్టోబర్ 2025 వరకు భారత ఎగుమతులు 28.5 శాతం తగ్గి, 8.83 బిలియన్ డాలర్ల నుంచి 6.31 బిలియన్ డాలర్లకు చేరాయి. ఈ సుంకాల వల్ల రత్నాలు, ఆభరణాలు, టెక్స్‌టైల్స్, గార్మెంట్స్, కెమికల్స్, సీఫుడ్ వంటి లేబర్ ఇంటెన్సివ్ రంగాలు 31.2 శాతం తగ్గుదలను నమోదు చేశాయి. జీటీఆర్‌ఐ ప్రకారం, స్మార్ట్‌ఫోన్ ఎగుమతులు 36 శాతం, కెమికల్స్ 38 శాతం తగ్గాయి.
ఆర్‌బీఐ వృద్ధి అంచనా పెంపు
ఎంపీసీ సమావేశాల్లో ఆర్‌బీఐ రెపో రేటును 25 బేసిస్ పాయింట్లు తగ్గించి 5.25 శాతానికి తీసుకొచ్చింది. మల్హోత్రా జీడీపీ వృద్ధి అంచనాను 7.3 శాతానికి పెంచారు. ఇన్‌ఫ్లేషన్ 2 శాతానికి పడిపోయినప్పటికీ ఎగుమతుల తగ్గుదల రెండో అర్ధ సంవత్సరంలో వృద్ధిని ప్రభావితం చేస్తుందని తెలిపారు. ఎగుమతి సంఘాలు, జీటీఆర్‌ఐ వంటి సంస్థలు ప్రభుత్వాన్ని ఎక్స్‌పోర్ట్ ప్రమోషన్ మిషన్‌ను త్వరగా అమలు చేయాలని సూచించాయి. అమెరికాతో చర్చలు వేగవంతం చేయాలని కోరుతున్నాయి.
ఇదీ చదవండి: ఇంటి అద్దె పెంచాలంటే ముందే చెప్పాలి..


