వేగంగా వృద్ధి చెందుతున్న బ్యాంకింగ్ వ్యవస్థ దన్ను
మ్యూల్ హంటర్ ఏఐతో సత్ఫలితాలు వస్తున్నాయ్
ఆర్‌బీఐ గవర్నర్ సంజయ్ మల్హోత్రా
న్యూఢిల్లీ: అంతర్జాతీయంగా టాప్ 100 బ్యాంకుల జాబితాలో త్వరలో మరిన్ని భారతీయ బ్యాంకులు చోటు దక్కించుకోగలవని రిజర్వ్ బ్యాంక్ గవర్నర్ సంజయ్ మల్హోత్రా ఆశాభావం వ్యక్తం చేశారు. ఆర్థిక సేవలు విస్తరిస్తుండటం, బ్యాంకింగ్ వ్యవస్థ వేగంగా వృద్ధి చెందుతుండటం ఇందుకు దోహదపడతాయని పేర్కొన్నారు. ‘ప్రభుత్వ, ప్రైవేట్ రంగంలో చాలా బ్యాంకులు వేగంగా ఎదుగుతున్నాయి.
వాటిలో నుంచి కొన్ని బ్యాంకులు కొద్ది కాలంలోనే ప్రపంచంలో టాప్ వంద బ్యాంకుల్లో చోటు దక్కించుకోగలవని భావిస్తున్నాను‘ అని ఓ కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా ఆయన చెప్పారు. ప్రస్తుతం ప్రభుత్వ రంగ దిగ్గజం ఎస్‌బీఐ (43వ ర్యాంకు), ప్రైవేట్ రంగ హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ (73వ ర్యాంకు) మాత్రమే టాప్ 100 బ్యాంకుల్లో ఉన్నాయి.
దేశానికి మరిన్ని భారీ స్థాయి బ్యాంకులు అవసరమంటూ కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఇటీవలే చెప్పిన నేపథ్యంలో మల్హోత్రా వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. మరోవైపు, డిజిటల్ మోసాలను కట్టడి చేసేందుకు ఉద్దేశించిన మ్యూల్ హంటర్ సాధనం చాలా మంచి ఫలితాలను ఇస్తోందని మల్హోత్రా చెప్పారు. ఇది ప్రతి నెలా 20,000కు పైగా మ్యూల్ అకౌంట్లను గుర్తిస్తోందని వివరించారు.
మోసపూరితంగా కాజేసిన నిధులను మళ్లించేందుకు ఉపయోగించే ఖాతాలను మ్యూల్ అకౌంట్లుగా వ్యవహరిస్తారు. వీటిని గుర్తించేందుకు రిజర్వ్ బ్యాంక్ ఇన్నోవేషన్ హబ్ (ఆర్‌బీఐహెచ్) మ్యూల్‌హంటర్‌డాట్‌ఏఐ పేరిట ఏఐ ఆధారిత సాధనాన్ని రూపొందించింది. డిజిటల్ మోసాలను అరికట్టడానికి హోంశాఖలో భాగమైన ఇండియన్ సైబర్ క్రైమ్ కోఆర్డినేషన్ సెంటర్ (ఐ4సీ)తో కలిసి పని చేయడంతో పాటు ఇతరత్రా పలు చర్యలు కూడా తీసుకుంటున్నట్లు మల్హోత్రా వివరించారు.
మనం చేయాల్సింది చేయాలి.. అంతే..
కర్మ సిద్ధాంతాన్ని అనుసరించి, ఫలితం గురించి ఆలోచించకుండా, మనం చేయాల్సినది చేయాలని, ఫలాలు వాటంతటవే లభిస్తాయని విద్యార్థులకు మల్హోత్రా చెప్పారు. ఈ సందర్భంగా అమెరికన్ టెక్ దిగ్గజం, దివంగత స్టీవ్ జాబ్స్ చేసిన వ్యాఖ్యలను ప్రస్తావించారు. రిజర్వ్ బ్యాంక్ గవర్నర్‌గా ఎదగాలంటే ’కొన్ని చిట్కాలు’ చెప్పాలంటూ ఓ విద్యార్థి అడిగిన ప్రశ్నకు మల్హోత్రా ఈ మేరకు సమాధానమిచ్చారు. తాను విద్యాభ్యాసం చేసిన కాన్పూర్ ఐఐటీకి వెళ్లినప్పుడు కూడా ఇలాంటి ప్రశ్నే వచి్చందని, కర్మ సిద్ధాంతం గురించే చెప్పినట్లు ఆయన వివరించారు.
అనిశ్చితే రూపాయి క్షీణతకు కారణం..
ఇటీవలి కాలంలో డాలర్‌తో పోలిస్తే రూపాయి మారకం విలువ క్షీణించడానికి అమెరికా టారిఫ్‌ల వడ్డనతో నెలకొన్న వాణిజ్య అనిశి్చతులే కారణమని మల్హోత్రా చెప్పారు. రూపాయి మారకాన్ని మార్కెట్ వర్గాలే నిర్దేశిస్తాయి తప్ప దాన్ని నిర్దిష్ట స్థాయిలో నిలపాలని ఆర్‌బీఐ టార్గెట్ ఏదీ పెట్టుకోదని ఆయన తెలిపారు. డాలర్లకు డిమాండ్ పెరిగితే రూపాయి తగ్గుతుందని, అలాగే రూపాయికి డిమాండ్ పెరిగితే డాలర్లకు డిమాండ్ తగ్గుతుందని పేర్కొన్నారు. అమెరికాతో మెరుగైన వాణిజ్య ఒప్పందం కుదురుతుందని, కరెంట్ అకౌంట్‌పై నెలకొన్న ఒత్తిడి తొలగిపోతుందని విశ్వసిస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు.


