భారత బ్యాంకింగ్ వ్యవస్థ ప్రస్తుతం తీవ్ర ఒత్తిడిని ఎదుర్కొంటోంది. డిసెంబర్ త్రైమాసికంలో లోన్-టు-డిపాజిట్ నిష్పత్తి (ఎల్‌డీఆర్) ఆల్‌టైమ్ గరిష్టమైన 81 శాతానికి చేరుకుంది. ఇది క్రెడిట్ వృద్ధి వేగం.. డిపాజిట్ సమీకరణను నిరంతరం మించిపోతున్నదనడానికి స్పష్టమైన సంకేతంగా పరిశ్రమ వర్గాలు పేర్కొంటున్నాయి.
ఈ స్థాయిలో కొనసాగుతున్న ఎల్‌డీఆర్‌లు బ్యాంకులను డిపాజిట్ రేట్లను పెంచాల్సిన పరిస్థితిని కల్పిస్తాయని లేదా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బీఐ) వడ్డీ రేట్ల తగ్గింపులను పూర్తిగా వినియోగించుకునే సామర్థ్యాన్ని పరిమితం చేసే అవకాశముందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ 100%
దేశంలోని అతిపెద్ద ప్రైవేట్ రంగ బ్యాంక్ అయిన హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్, ఈ సెక్టార్ ఎదుర్కొంటున్న సవాళ్లను స్పష్టంగా ప్రతిబింబిస్తోంది. డిసెంబర్ త్రైమాసికంలో బ్యాంక్ ఎల్‌డీఆర్ 100 శాతానికి చేరుకుంది.
డేటా ప్రకారం, బ్యాంక్ స్థూల అడ్వాన్సులు ఏడాది ప్రాతిపదికన 12 శాతం పెరిగి రూ.28.44 లక్షల కోట్లకు చేరగా, మొత్తం డిపాజిట్లు 11.50 శాతం వృద్ధితో రూ.28.59 లక్షల కోట్లుగా నమోదయ్యాయి. జూన్ త్రైమాసికంలో 16 శాతంగా ఉన్న డిపాజిట్ వృద్ధి ఇప్పుడు గణనీయంగా తగ్గడం గమనార్హం.
ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో వేగవంతమైన రుణ వృద్ధి
ప్రభుత్వ రంగ బ్యాంకులు కూడా డిపాజిట్ వృద్ధిని మించి రుణ వృద్ధిని నమోదు చేశాయి. బ్యాంక్ ఆఫ్ బరోడా అడ్వాన్సులు 14.57 శాతం పెరిగి రూ.13.44 లక్షల కోట్లకు చేరగా, డిపాజిట్లు 10.25 శాతం వృద్ధితో రూ.15.47 లక్షల కోట్లుగా ఉన్నాయి.
పంజాబ్ నేషనల్ బ్యాంక్ రుణాలు 11 శాతం పెరిగి రూ.12.32 లక్షల కోట్లకు చేరగా, డిపాజిట్ వృద్ధి 8.50 శాతానికి పరిమితమైంది. యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో ఈ వ్యత్యాసం మరింత స్పష్టంగా కనిపించింది. అడ్వాన్సులు 7.13 శాతం పెరిగినప్పటికీ, డిపాజిట్లు కేవలం 3.40 శాతం మాత్రమే పెరిగాయి.
ప్రైవేట్ రంగ బ్యాంకుల్లో మిశ్రమ ధోరణి
ప్రైవేట్ రంగ బ్యాంకుల్లో పనితీరు మిశ్రమంగా కనిపించింది. యాక్సిస్ బ్యాంక్, కోటక్ మహీంద్రా బ్యాంక్‌లలో డిపాజిట్ వృద్ధి అడ్వాన్సులను మించి ఉండటం గమనార్హం. యాక్సిస్ బ్యాంక్‌లో అడ్వాన్సులు 14.10 శాతం పెరిగితే, డిపాజిట్లు 15 శాతం వృద్ధి చెందాయి. కోటక్ మహీంద్రా బ్యాంక్‌లో అడ్వాన్సులు 16 శాతం, డిపాజిట్లు 14.60 శాతం పెరిగాయి.
ఇదే సమయంలో, యెస్ బ్యాంక్, ఆర్బీఎల్ బ్యాంక్‌లలో అడ్వాన్సులు–డిపాజిట్ల వృద్ధి దాదాపు సమానంగా కొనసాగింది. అయితే, ఇండస్‌ఇండ్ బ్యాంక్ మాత్రం భిన్నంగా నిలిచింది. డిసెంబర్ త్రైమాసికంలో ఆ బ్యాంక్ అడ్వాన్సులు 13.10 శాతం, డిపాజిట్లు 3.80 శాతం తగ్గాయి.
ముందున్న సవాళ్లు
బ్యాంకింగ్ వ్యవస్థలో పెరుగుతున్న ఎల్‌డీఆర్‌లు లిక్విడిటీ నిర్వహణను కష్టతరం చేస్తున్నాయని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. డిపాజిట్ వృద్ధి వేగం పెరగకపోతే, బ్యాంకులు రుణాలపై దూకుడైన వృద్ధిని కొనసాగించడంలో పరిమితులను ఎదుర్కొనే అవకాశముందని హెచ్చరిస్తున్నారు.


