ఆర్‌బీఐ గవర్నర్ సంజయ్ మల్హోత్రా
సీఎం రేవంత్‌రెడ్డితో మర్యాదపూర్వకంగా భేటీ
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో అనుసరిస్తున్న ఆర్థిక విధానాలను రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గవర్నర్ సంజయ్ మల్హోత్రా ప్రశంసించారు. ఆర్థిక క్రమశిక్షణతో పాటు అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను సమతుల్యంగా అమలు చేస్తున్న తీరు ఆదర్శనీయంగా ఉందని ఆయన అభిప్రాయపడ్డారు. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బీఐ) బోర్డ్ మీటింగ్‌కు హాజరయ్యేందుకు గురువారం హైదరాబాద్‌కు వచి్చన ఆయన జూబ్లీహిల్స్ నివాసంలో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ఆర్థిక విధానాలు, సంస్కరణలపై విస్తృతంగా చర్చించారు. బ్యాంకింగ్ వ్యవస్థ మరింత పారదర్శకంగా ఉండాలన్న అంశంపై చర్చ జరిగింది.
ఈ సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల తీసుకువచ్చిన కీలక సంస్కరణలను వివరించారు. ముఖ్యంగా విద్యుత్ రంగంలో చేపడుతున్న సంస్కరణలు, మూడో డిస్కం ఏర్పాటు ప్రతిపాదన, విద్యుత్ సరఫరా వ్యవస్థను మరింత సమర్థవంతంగా మార్చే చర్యలను ముఖ్యమంత్రి వెల్లడించారు. అలాగే సోలార్ విద్యుత్ వినియోగాన్ని పెంచే దిశగా ప్రభుత్వం చేపడుతున్న చర్యలు, పునరుత్పాదక శక్తి రంగంలో పెట్టుబడులను ఆకర్షించే విధానాలను కూడా తెలియజేశారు. కాగా, బడ్స్ యాక్ట్‌ను నోటిఫై చేయాలని ఆర్‌బీఐ గవర్నర్ మల్హోత్రా ముఖ్యమంత్రిని కోరారు.
రాష్ట్రం మరిన్ని సంస్కరణలు, వినూత్న ప్రణాళికలతో ముందుకు సాగాలని ఆయన ఆకాంక్షించారు. యూనిఫైడ్ లెండింగ్ ఇంటర్‌ఫేస్ (యూఎల్‌ఐ) అంశంలో ఆర్‌బీఐ తీసుకుంటున్న చొరవను సీఎం దృష్టికి తీసుకువచ్చారు. ప్రభుత్వ, ప్రైవేటు డిపాజిట్లకు సంబంధించిన క్లెయిమ్ క్యాంపెయినింగ్ కార్యక్రమాలపై కూడా వివరించారు. ఈ సమావేశంలో రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు, ముఖ్యమంత్రి ప్రిన్సిపల్ సెక్రెటరీ శేషాద్రి, ఫైనాన్స్ సెక్రెటరీ సందీప్ కుమార్ సుల్తానియా, ఆర్‌బీఐ హైదరాబాద్ రీజినల్ డైరెక్టర్ చిన్మోయ్ కుమార్, జనరల్ మేనేజర్లు మేజర్ యశ్పాల్ చరణ్, ఎస్. పాణిగ్రాహి తదితరులు పాల్గొన్నారు.


