మీడియాతో మాట్లాడుతున్న ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి. చిత్రంలో డిప్యూటీ సీఎం భట్టి, మంత్రులు దామోదర రాజనర్సింహ, ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, సీతక్క
పంచాయతీ ఫలితాలే వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లోనూ పునరావృతం
మేం 2/3 మెజారిటీ సాధిస్తాం. ప్రతిపక్షానికి 1/3 వంతు సీట్లు మాత్రమే వస్తాయి- ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి
12,702 పంచాయతీల్లో 7,527 చోట్ల కాంగ్రెస్ బలపరిచిన అభ్యర్థులే గెలిచారు
రెబల్స్ గెలిచిన 808 కలిపి మొత్తం 8,335 పంచాయతీలు పార్టీ కైవసం
కలిసి పోటీ చేసినా బీఆర్‌ఎస్ 3,511, బీజేపీ 710 స్థానాల్లోనే విజయం
94 అసెంబ్లీ స్థానాల్లో పంచాయతీ ఎన్నికలు జరిగితే.. 87 స్థానాల్లో కాంగ్రెస్‌కు మెజారిటీ
కేసీఆర్ ఎప్పుడు అసెంబ్లీ పెట్టమంటే అప్పుడు కృష్ణా, గోదావరిపై చర్చకు సిద్ధమన్న సీఎం
‘అనర్హతలపై’ స్పీకర్ నిర్ణయంతో తమకు సంబంధం లేదని వ్యాఖ్య
సాక్షి, హైదరాబాద్: పంచాయతీ ఎన్నికల్లో వెలువడిన ఫలితాలే 2029 అసెంబ్లీ ఎన్నికల్లోనూ పునరావృతం అవుతాయని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. 12,702 పంచాయతీలకు ఎన్నికలు జరగ్గా.. 7,527 చోట్ల కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థులు, 808 చోట్ల రెబల్ అభ్యర్థులు గెలుపొందారని చెప్పారు. మొత్తం 8,335 (66 శాతం) పంచాయతీలను తమ పార్టీ కైవసం చేసుకుంటే.. బీఆర్‌ఎస్, బీజేపీ కలిసి పోటీ చేసినా 33 శాతం పంచాయతీల్లోనే విజయం సాధించాయని అన్నారు.
ఒక శాతం పంచాయతీల్లో వామపక్షాలు, స్వతంత్ర అభ్యర్థులు గెలిచారని తెలిపారు. గురువారం జూబ్లీహిల్స్‌లోని తన నివాసంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు ఎన్.ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, దామోదర రాజనర్సింహ, సీతక్క, వివేక్ వెంకటస్వామి, సీఎం సలహాదారు వేం నరేందర్‌రెడ్డి, ఎమ్మెల్యేలు డాక్టర్ భూపతిరెడ్డి, కుంభం అనిల్‌కుమార్, జయవీర్, నాయిని రాజేందర్‌రెడ్డితో కలిసి ఆయన మీడియాతో మాట్లాడారు.
ఇది మా రెండేళ్ల పాలనపై తీర్పు
‘పంచాయతీ ఎన్నికలు 94 అసెంబ్లీ స్థానాల పరిధిలో జరిగితే.. అందులో 87 అసెంబ్లీ స్థానాల్లో కాంగ్రెస్ స్పష్టమైన ఆధిక్యం సాధించింది. కానీ బీఆర్‌ఎస్ 6 నియోజకవర్గాల్లో, బీజేపీ ఒక స్థానంలో మాత్రమే ఆధిక్యం కనబరిచాయి. 2023 ఎన్నికలతో పోలిస్తే మా బలం గణనీయంగా పెరిగింది. ప్రజా ప్రభుత్వం ఏర్పడి రెండేళ్లవుతున్న సందర్భంలో జరిగిన ఈ ఎన్నికల్లో ప్రజలు మా ప్రభుత్వంపై సంపూర్ణ విశ్వాసం ఉంచి ఘన విజయం కట్టబెట్టారు.
కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల కష్టంతోనే ఈ విజయం సాధ్యమైంది. ఎలాంటి సంఘటనలు తలెత్తకుండా, వివాదాలు, అధికార దురి్వనియోగం లేకుండా.. ప్రభుత్వ ఉద్యోగులు, రాష్ట్ర ఎన్నికల కమిషన్ సిబ్బంది నిష్పక్షపాతంగా, ప్రశాంతంగా ఎన్నికలు నిర్వహించారు. ఈ ఎన్నికల ఫలితాలు మా రెండు సంవత్సరాల పాలనపై ప్రజలు ఇచ్చిన తీర్పు. అసెంబ్లీ ఎన్నికల తర్వాత పార్లమెంట్ ఎన్నికలు, కంటోన్మెంట్, జూబ్లీహిల్స్ ఎన్నికలు, తాజాగా పంచాయతీ ఎన్నికల్లోనూ ప్రజలు కాంగ్రెస్‌కు సంపూర్ణ మద్దతు ప్రకటించారు.
మేము అమలు చేస్తున్న సన్న బియ్యం, ఉచిత కరెంటు, సన్న వడ్లకు బోనస్, రూ.500కే సిలిండర్, ఇందిరమ్మ ఇళ్లు, మహిళా సంఘాలకు వడ్డీ లేని రుణాలు, ఎస్సీ వర్గీకరణ అమలు, కులగణన ఇతర పథకాలు, కార్యక్రమాల వల్ల ప్రజలు మమ్మల్ని ఆదరించారు. గెలిస్తే కళ్లు నెత్తికెక్కినట్లుగా మేం ఏనాడూ వ్యవహరించ లేదు. ఆరు గ్యారంటీలతో పాటు ఏడో గ్యారెంటీగా ప్రజలకు స్వేచ్ఛను అందించాం. ఎవరినీ నిర్బంధించ లేదు., ప్రతిపక్షాలపై ఎలాంటి కక్ష సాధింపు చర్యలకు పాల్పడలేదు. స్వేచ్ఛాయుతమైన వాతావరణంలో ఎన్నికలు జరిపించాం. ఈ ఫలితాలు మా బాధ్యతను మరింత పెంచాయి’ అని సీఎం అన్నారు.
ప్రతిపక్షానికి అసూయ, అహంకారం పోవడం లేదు..
‘ఎన్నికల్లో వరుస ఓటములు ఎదురవుతున్నా ప్రతిపక్షానికి అహంకారం, అసూయ పోవడం లేదు. బుద్ధి రావడం లేదు. ఒకాయన కడుపులో మూసీ కాలుష్యం కంటే ఎక్కువ విషం కనిపిస్తోంది. ఫలితాలు వారికి వ్యతిరేకంగా ఉన్నాసరే.. వచ్చిన ఫలితాలతోనే జబ్బలు చరుచుకుంటున్నారు. వారు అనుకున్నట్లే.. 2029 అసెంబ్లీ ఎన్నికల్లోనూ వారికి ఇవే ఫలితాలు వస్తాయి. మేం 2/3 మెజారిటీ సాధిస్తాం. వారికి 1/3 వంతు సీట్లు మాత్రమే వస్తాయి. మీ కోపంతో, అసూయతో ప్రజలకు మంచి జరగకుండా అడ్డుకోవద్దు. మేం తెలంగాణను దేశంలోనే నంబర్ వన్‌గా తీర్చిదిద్దుతున్నాం. రూ.3.87 లక్షల తలసరి ఆదాయంతో అగ్రస్థానంలో ఉన్నాం..’ అని ముఖ్యమంత్రి చెప్పారు.
కేసీఆర్ లేఖ రాస్తే..
‘ప్రతిపక్ష నాయకునిగా కేసీఆర్ లేఖ రాస్తే.. అసెంబ్లీని సమావేశపరిచి గోదావరి, కృష్ణా జలాల్లో ఎవరు రాష్ట్రానికి అన్యాయం చేశారో చర్చించడానికి సిద్ధంగా ఉన్నాం. ఉమ్మడి రాష్ట్రంలో కంటే కేసీఆర్ హయాంలోనే తెలంగాణకు ఎక్కువగా అన్యాయం జరిగింది. తెలంగాణకు 299 టీఎంసీలు, ఆంధ్రాకు 511 టీఎంసీలు ఇచ్చేలా చేసుకున్న ఒప్పందం పత్రాలను బయటపెడ్తాం. ఆయన క్రియాశీల రాజకీయాల్లో లేరు. ఆయన నియోజకవర్గంలో అధిక పంచాయతీలను కాంగ్రెస్ గెలుచుకుంది. ఆయన చర్చకు వస్తానంటే ఎక్కడైనా రావడానికి సిద్ధం..’ అని రేవంత్ అన్నారు.
అసెంబ్లీలో చర్చించాకే ‘పరిషత్’ ఎన్నికలపై నిర్ణయం
‘జెడ్పీటీసీ, ఎంపీటీసీ, మున్సిపల్ ఎన్నికల్లో 42% బీసీ రిజర్వేషన్లు ఎలా అమలు చేయాలన్న అంశంపై అసెంబ్లీలో చర్చిస్తాం. ఆ తర్వాత ఎన్నికలు ఎప్పుడు నిర్వహించాలన్నది నిర్ణయిస్తాం. ఎమ్మెల్యేల పార్టీ ఫిరాయింపు ఆరోపణలకు సంబంధించి స్పీకర్ తీసుకున్న నిర్ణయంతో మాకు సంబంధం లేదు. బీఆర్‌ఎస్‌కు స్పీకర్ నిర్ణయం నచ్చకపోతే న్యాయస్థానాలను ఆశ్రయించవచ్చు.
మేము మీ పిల్లలమే అని ఎమ్మెల్యేలు అంటుంటే..కాదు పో.. అని ఎవరైనా అంటారా? ఆ ఎమ్మెల్యేల వేతనాల నుంచి రూ.5 వేలు టీఆర్‌ఎస్‌ఎల్‌పీకి తీసుకుంటున్నారు. అసెంబ్లీ సమావేశాల చివరి రోజున స్పీకర్ బీఆర్‌ఎస్ సభ్యుల సంఖ్య 37 అంటుంటే వారు ఏనాడూ అభ్యంతరం చెప్పలేదు. 37 మంది ఎమ్మెల్యేలకు మాట్లాడడానికి తగిన సమయం ఇవ్వడం లేదని హరీశ్‌రావు అన్నారు..’ అని సీఎం చెప్పారు.


