భువనగిరి(యాదాద్రి భువనగిరి జిల్లా): రాష్ట్రంలో చిల్లర రాజకీయాలు నడుస్తున్నాయని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ద్శజమెత్తారు. ఈరోజు(గురువారం, డిసెంబర్ 18వ తేదీ) యాదాద్రి భువనగిరి జిల్లాలో నూతనంగా ఎన్నికలైన సర్పంచుల సన్మాన కార్యక్రమంలో కేటీఆర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ.. ‘ రాష్ట్రంలో చిల్లర రాజకీయాలు నడుస్తున్నాయి. బీఆర్ఎస్ కార్యకర్తలను అరెస్ట్ చేసి స్టేషన్ కు తీసుకెళ్లి వేధించారు. చిన్నకాపర్తిలో బ్యాలెట్ పేపర్లను పడేశారు.
రాష్ట్రంలో 100-150 గ్రామాల్లో బీఆర్ఎస్ గెలిచినా కాంగ్రెస్ గెలిచినట్లు ప్రకటించారు. ఈ వ్యవహారంపై ఖచ్చితంగా కోర్టుకు వెళ్తాం. పార్టీ ఫిరాయింపులు స్పీకర్‌కు కనుబడటం లేదా..పార్టీ మారిన వాళ్లే సిగ్గులేకుండా చెప్పినా స్పీకర్ కు వినపడటం లేదట. పది మంది ఎమ్మెల్యేలు ఆడనా మగనా అని కూడా చెప్పుకోవడం లేదు. ఏ పార్టీనో చెప్పుకోవడం లేదు. 70 ఏళ్లు నిండిన పోచారం శ్రీనివాస్ రెడ్డికి పార్టీ మారాల్సిన అవసరం ఏం వచ్చింది. అసెంబ్లీలో మొఖం చాటేస్తున్నారు. రేవంత్ రెడ్డి మూడు ఫీట్లున్నా ముప్పై ఫీట్ల డైలాగులు కొడతాడు. అడ్డుమారి గుడ్డిదెబ్బలో రేవంత్ సీఎం అయిండు. కేసీఆర్ పై కాంగ్రెస్, బీజేపీ వాళ్లకు కూడా కోపం లేదు. జనవరిలో సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని చేపడదాం. కేసీఆర్ హయాంలో కేంద్రం ఉత్తమ పంచాయతీల అవార్డులు ఇస్తే తెలంగాణకే 30 శాతం వచ్చాయి. రేవంత్ రెండుసార్లు రైతుబంధు ఎగ్గొట్టాడు. ప్రభుత్వాన్ని నడిపేందుకు రేవంత్ కు చేతకావడం లేదు. కరోన సమయంలో ఏ సంక్షేమ పథకం ఆగలేదు. కేసీఆర్ సీఎం అయ్యే నాటికి 72 వేల కోట్ల అప్పు ఉంది.
పదేళ్ల తర్వాత రెండు లక్షల ఎనభై వేల కోట్లు అప్పు అయిందని కాగ్ చెప్తోంది.. కానీ కాంగ్రెస్ మంత్రులు మాత్రం ఆరేడు లక్షల కోట్ల అప్పు అంటూ నోటికొచ్చినట్లు మాట్లాడుతున్నారు. ఏనాడు ఓట్ల కోసం కాంగ్రెస్ నేతల్లా కేసీఆర్ అబద్ధాలు చెప్పలేదు. బీఆర్ఎస్ గెలిచిన చోట్ల సంక్షేమ పథకాలు అమలు చేయమని కాంగ్రెస్ ఎమ్మెల్యేలు అంటున్నారు.. అదేం రేవంత్ అత్త సొమ్ము కాదు.. రేవంత్ డబ్బులు ఇవ్వడం లేదని ప్రపంచ బ్యాంకుకు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఉత్తరం రాస్తున్నారు. ప్రతీ జిల్లాలో లీగల్ సెల్ ఏర్పాటు చేస్తాం. సర్పంచులపై కేసులు వేసినా భయపడాల్సిన పరిస్థితి లేదు’ అని విమర్శించారు.


