సాక్షి,హైదరాబాద్: భారత ప్రధాన ఎన్నికల కమిషనర్ (సీఈసీ) జ్ఞానేశ్‌కుమార్ అధికారిక పర్యటనలో భాగంగా హైదరాబాద్‌కు చేరుకున్నారు. షెడ్యూల్ ప్రకారం ఆయన మధ్యాహ్నం 12.00 గంటలకు హైదరాబాద్ విమానాశ్రయానికి చేరుకుంటారు.
హైదరాబాద్‌కు వచ్చిన అనంతరం సాయంత్రం ఆంధ్రప్రదేశ్‌లోని శ్రీశైలానికి ప్రయాణం చేయనున్నారు. ఆయన సాయంత్రం 6.30 గంటలకు శ్రీశైలంలోని బ్రహ్మరాంభ గెస్ట్ హౌస్‌కు చేరుకుంటారు. మరుసటి రోజు తెల్లవారుజామున ఆయన శ్రీశైలం మల్లికార్జున స్వామి ఆలయంలో మహా ఆరతి కార్యక్రమంలో పాల్గొని దర్శనం చేసుకుంటారు. శ్రీశైలంలో సీఈసీ పర్యటన పూర్తిగా భక్తి, ఆధ్యాత్మిక కార్యక్రమాలకే పరిమితం కాగా, ఈ సమయంలో ఆంధ్రప్రదేశ్‌లో ఎలాంటి అధికారిక సమావేశాలు లేదా పరిపాలనా కార్యక్రమాలు ఉండవని అధికారులు తెలిపారు.
హైదరాబాద్ షెడ్యూల్‌లో భాగంగా జ్ఞానేశ్‌కుమార్ నగరంలోని చారిత్రక, సాంస్కృతిక ప్రాధాన్యం గల ప్రాంతాలను సందర్శించనున్నారు. ఇందులో గోల్కొండ కోట, హుస్సేన్‌సాగర్, చార్మినార్, సాలార్‌జంగ్ మ్యూజియం ఉన్నాయి. అదేవిధంగా ఎన్నికల నిర్వహణలో కీలకమైన తెలంగాణ రాష్ట్ర బూత్ లెవల్ అధికారులతో (బీఎల్‌వోలు) రవీంద్రభారతి ఆడిటోరియంలో సమావేశం నిర్వహించనున్నారు. ఈ సమావేశంలో ఎన్నికల ప్రక్రియను మరింత పటిష్టంగా అమలు చేయడంపై దిశానిర్దేశం చేయనున్నారు.
ప్రధాన ఎన్నికల కమిషనర్ పర్యటనకు సంబంధించిన అన్ని ఏర్పాట్లు భారత ఎన్నికల సంఘం ఆధ్వర్యంలో రాష్ట్ర, జిల్లా యంత్రాంగం సమన్వయంతో చేపడుతున్నట్లు అధికారులు తెలిపారు.


