బేగంపేట హైదరాబాద్ పబ్లిక్ స్కూల్‌లో గత ఆరు రోజులుగా నిర్వహిస్తున్న 45వ సీనియర్ జాతీయ ఆర్చరీ ఛాంపియన్‌షిప్- 2025 పోటీలు గురువారం ఘనంగా ముగిశాయి. ఈ కార్యక్రమానికి ఆర్చరీ అసోసియేషన్ ఆఫ్ ఇండియా జాతీయ అధ్యక్షులు, జార్ఖండ్ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి అర్జున్ ముండా ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా మట్లాడుతూ.. 2028 ఒలంపిక్స్‌తో పాటు.. భవిష్యత్తులో జరిగే అన్ని ప్రపంచ స్థాయి పోటీల్లో ఆర్చరీ విభాగంలో పతకాలు సాధించడమే లక్ష్యంగా పనిచేస్తామని తెలిపారు.
అదే విధంగా.. వరల్డ్ ఆర్చరీ ఛాంపియన్‌షిప్‌నకు ఆతిథ్యం ఇవ్వడానికి ఆర్చరీ ఫెడరేషన్ సంసిద్ధతను వ్యక్తం చేస్తుందని అర్జున్ ముండా అన్నారు. భారతదేశ పురాతన క్రీడ అయిన విలువిద్యకు గౌరవస్థానం దక్కేందుకు ప్రణాళిక బద్ధమైన కృషి ఇవ్వాల్సిన అవసరం ఉందని ఆయన ఈ సందర్భంగా పేర్కొన్నారు.
ఇక ఈ కార్యక్రమానికి గౌరవ అతిథిగా హాజరైన రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక ముఖ్య కార్యదర్శి జయేష్ రంజన్ మాట్లాడుతూ.. ‘‘జాతీయ అంతర్జాతీయ స్థాయి పోటీల నిర్వహణ ద్వారా నూతన ప్రతిభ కు ప్రోత్సాహం లభిస్తుంది. జాతీయ అంతర్జాతీయ స్థాయి పోటీలు నిర్వహించడానికి ముందుకు వచ్చే క్రీడా సంఘాలకు తెలంగాణ ప్రభుత్వం తోడ్పాటు ఇస్తుంది’’ అని తెలిపారు.

అదే విధంగా.. తెలంగాణ ఆర్చరీ అసోసియేషన్ అధ్యక్షులు టి రాజు మాట్లాడుతూ.. ‘‘48 సంవత్సరాల తర్వాత సీనియర్ జాతీయ ఛాంపియన్‌షిప్ నిర్వహించుకోవడం.. దేశంలోని అన్ని రాష్ట్రాలు కేంద్ర పాలిత ప్రాంతాలు కలిపి మొత్తం 44 జట్లు.. దాదాపు 25 మంది అర్జున అవార్డు గ్రహీతలు 971 మంది జాతీయస్థాయి ఆర్చరీ క్రీడాకారులు ఇందులో పాల్గొనడం..
ఎటువంటి లోపం లేకుండా ఈ జాతీయ స్థాయి పోటీలను నిర్వహించడం సంతోషం కలిగిస్తోంది’’ అని అన్నారు. ఈ పోటీల నిర్వహణకు అన్ని విధాలుగా సహకరించిన ఎన్టీపీసీ బేగంపేట హైదరాబాద్ పబ్లిక్ స్కూల్ యజమాన్యం, ఢిల్లీ పబ్లిక్ స్కూల్ యజమాన్యం స్పోర్ట్స్ అథారిటీకి ఆయన కృతజ్ఞతలు తెలియజేశారు.
ఈ కార్యక్రమంలో తెలంగాణ ఆర్చరీ సంఘం ప్రధాన కార్యదర్శి అరవింద్, ఆర్చరీ డెవలప్‌మెంట్ కమిటీ సభ్యులు పుట్టా శంకరయ్య, హైదరాబాద్ ఆర్చరీ అసోసియేషన్ అశ్విన్ రావు, బేగంపేట హైదరాబాద్ పబ్లిక్ స్కూల్ డెవలప్‌మెంట్ కమిటీ చైర్మన్ గుస్తీ నోరియా, సభ్యులు మర్రి ఆదిత్య రెడ్డి ఆర్చరీ ఫెడరేషన్ సభ్యులు వివిధ రాష్ట్ర కమిటీ అధ్యక్ష కార్యదర్శులు పలువురు పాల్గొన్నారు.


