ఆసియా ఆర్చరీ చాంపియన్‌షిప్‌లో తొలిసారి వ్యక్తిగత స్వర్ణాలు సొంతం
ఢాకా: సుదీర్ఘ నిరీక్షణకు తెరదించుతూ భారత స్టార్స్ బొమ్మదేవర ధీరజ్, అంకిత ఆసియా ఆర్చరీ చాంపియన్స్‌గా అవతరించారు. శుక్రవారం ముగిసిన ఈ ప్రతిష్టాత్మక ఈవెంట్‌లో ఆంధ్రప్రదేశ్‌కు చెందిన ధీరజ్ పురుషుల రికర్వ్ వ్యక్తిగత విభాగంలో... బెంగాల్‌కు చెందిన అంకిత మహిళల రికర్వ్ వ్యక్తిగత విభాగంలో స్వర్ణ పతకాలను సొంతం చేసుకున్నారు. 46 ఏళ్ల ఆసియా ఆర్చరీ చాంపియన్‌షిప్ చరిత్రలో రికర్వ్ వ్యక్తిగత విభాగంలో భారత ఆర్చర్లకు స్వర్ణ పతకాలు రావడం ఇదే తొలిసారి కావడం విశేషం.
పురుషుల ఫైనల్లో ధీరజ్ 6–2తో భారత్‌కే చెందిన రాహుల్‌పై గెలిచాడు. మహిళల ఫైనల్లో అంకిత 7–3తో పారిస్ ఒలింపిక్స్ రజత పతక విజేత నామ్ సుహైన్ (దక్షిణ కొరియా)పై నెగ్గింది. భారత్‌కే చెందిన సంగీతకు కాంస్యం దక్కింది. మరోవైపు పురుషుల రికర్వ్ టీమ్ విభాగంలో 2007 తర్వాత భారత జట్టు విజేతగా నిలిచింది.
యశ్‌దీప్, అతాను దాస్, రాహుల్‌లతో కూడిన భారత బృందం ఫైనల్లో భారత్ 5–4తో సియో మింగి, కిమ్ యెచాన్, జాంగ్ జిహోలతో కూడిన దక్షిణ కొరియా జట్టును ఓడించింది. ఈ టోర్నీలో భారత్ 6 స్వర్ణాలు, 3 రజతాలు, 1 కాంస్యంతో కలిపి 10 పతకాలతో ‘టాప్’ ర్యాంక్‌లో నిలిచింది.


