పాకిస్తాన్ మాజీ క్రికెటర్ ఇమాద్ వసీం విడాకులు తీసుకున్నాడు. భార్య సానియా అష్ఫక్‌తో వైవాహిక బంధం నుంచి వైదొలిగాడు. ఈ విషయాన్ని ఇమాద్ వసీం సోషల్ మీడియా వేదికగా వెల్లడించాడు. ఈ నేపథ్యంలో సానియా అష్ఫక్ సంచలన ఆరోపణలతో ముందుకు వచ్చింది.
నా ముగ్గురు పిల్లలకు తల్లి మాత్రమే ఉంది
తన భర్తను వేరొకరు పెళ్లి చేసుకోవాలనుకున్నారని.. అందుకే తమకు విడాకులు అయ్యాయని సానియా ఆవేదన వ్యక్తం చేసింది. ‘‘తీవ్ర దుఃఖంలో మునిగిపోయి నేను ఈ నోట్ రాస్తున్నాను. నా కాపురం కూలిపోయింది. నా పిల్లలు తండ్రి లేనివాళ్లు అయ్యారు. వాళ్ల నాన్న వారిని విడిచిపెట్టాడు. నా ముగ్గురు పిల్లలకు ఇప్పుడు తల్లి మాత్రమే ఉంది.
ఐదు నెలల పసిబిడ్డ.. ఇంత వరకు తండ్రి ఆ పసికందును ఎత్తుకోనేలేదు. ఈ విషయాలన్నీ పంచుకోకూడదు అనే అనుకున్నాను. అయితే, నేను నిశ్శబ్దంగా ఉంటే.. దానిని నా బలహీనత అనుకుంటున్నారు.
ప్రతీ ఇంట్లో మాదిరే భార్యాభర్తలుగా మా మధ్య కొన్ని విభేదాలు ఉన్న మాట వాస్తవం. అయినప్పటికీ బంధాన్ని నిలబెట్టుకోవాలని నేను భావించాను. భార్యగా, తల్లిగా నా వంతు పాత్రను చక్కగా పోషించాను. నా కాపురాన్ని నిలబెట్టుకునేందుకు వంద శాతం ప్రయత్నించాను.
నా భర్తను వేరొకరు పెళ్లి చేసుకోవాలి అనుకున్నారు
కానీ మూడో వ్యక్తి రాకతో నా ఇల్లు ముక్కలైంది. ఆమె నా భర్తను పెళ్లి చేసుకోవాలని భావించింది. అందుకే.. అంతంత మాత్రంగా ఉన్న మా బంధం విచ్ఛిన్నమై విడాకులకు దారితీసింది’’ అని సానియా అష్ఫక్ సోషల్ మీడియా వేదికగా తన బాధను పంచుకుంది.
చట్టపరంగా చర్యలు తీసుకుంటా
ఇందుకు బదులుగా.. ‘‘ప్రతీసారి ఘర్షణ పడేకంటే కూడా విడాకులు తీసుకోవడమే ఉత్తమమని భావించి.. డివోర్స్ కోసం అప్లై చేశాను. ఇక నా పిల్లలు.. నేను ఎప్పటికీ తండ్రినే. వారి బాధ్యత మొత్తం నాదే. ఇలాంటి సమయంలో నా గౌరవం, గోప్యతకు భంగం కలగకుండా సహకరిస్తారని ఆశిస్తున్నా.
కొంతమంది తప్పుడు ప్రచారం చేసే పనిలో ఉన్నారు. దయచేసి వారిని నమ్మకండి. నా పరువు, ప్రతిష్టకు భంగం కలిగించేలా ఎవరైనా వ్యక్తిగత జీవితం గురించి మాట్లాడితే చట్టపరంగా చర్యలు తీసుకుంటాను’’ అని ఇమాద్ వసీం పేర్కొన్నాడు. కాగా 37 ఏళ్ల ఇమాద్ వసీం బౌలింగ్ ఆల్‌రౌండర్.
పాకిస్తాన్ తరఫున 55 వన్డేలు, 75 టీ20 మ్యాచ్‌లు ఆడిన ఇమాద్ వసీం.. వన్డేల్లో 986, టీ20లలో 554 పరుగులు చేశాడు. ఈ లెఫ్టార్మ్ స్పిన్నర్ ఖాతాలో వన్డేల్లో 44, టీ20లలో 73 వికెట్లు ఉన్నాయి. ఇక 2023లో అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికిన ఇమాద్ వసీం.. ప్రస్తుతం ఫ్రాంఛైజీ క్రికెట్‌లో కొనసాగుతున్నాడు.
చదవండి: అలా ప్రేమ పుట్టింది.. ఆస్తి భర్త కంటే వంద రెట్లు ఎక్కువే!.. అయితేనేం..


