భారత బ్యాటింగ్ దిగ్గజం విరాట్ కోహ్లి సూపర్ ఫామ్‌లో ఉన్నాడు. ఇటీవల సొంతగడ్డపై సౌతాఫ్రికాతో వన్డే సిరీస్‌లో వరుస శతకాలు బాది.. యాభై ఓవర్ల ఫార్మాట్లో అత్యధిక సెంచరీల వీరుడి (53)గా తన రికార్డును తానే సవరించుకున్నాడు.
ఈ సిరీస్ తర్వాత దేశవాళీ వన్డే టోర్నమెంట్ విజయ్ హజారే ట్రోఫీ 2025-26 బరిలో దిగాడు కోహ్లి. సొంతజట్టు ఢిల్లీ తరఫున వన్‌డౌన్ బ్యాటర్‌గా వచ్చి ఆంధ్రతో మ్యాచ్‌లో శతక్కొట్టాడు. కేవలం 101 బంతుల్లోనే 131 పరుగులతో అలరించాడు.
29 బంతుల్లోనే హాఫ్ సెంచరీ
ఆ తర్వాత గుజరాత్‌తో మ్యాచ్‌లోనూ కోహ్లి అదరగొట్టాడు. కేవలం 29 బంతుల్లోనే హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్న ఈ కుడిచేతి వాటం బ్యాటర్.. మొత్తంగా 61 బంతుల్లో 77 పరుగులు చేసి అవుటయ్యాడు. బీసీసీఐ ఆదేశాల మేరకు ఢిల్లీ తరఫున దేశీ క్రికెట్‌లో రెండు మ్యాచ్‌లు పూర్తి చేసుకున్న కోహ్లి.. మరో మ్యాచ్ ఆడేందుకు కూడా సుముఖంగా ఉన్నట్లు వార్తలు వచ్చాయి.
స్వదేశంలో న్యూజిలాండ్‌తో వన్డే సిరీస్‌కు సన్నాహకంగా జనవరి 6న రైల్వేస్‌తో జరిగే మ్యాచ్‌లో కోహ్లి ఆడే అవకాశం ఉంది. కాగా జనవరి 11 నుంచి భారత్- కివీస్ మధ్య మూడు వన్డేల సిరీస్ ఆరంభం కానున్న విషయం తెలిసిందే. కొటాంబి, ఖంధేరి, ఇండోర్ వేదికగా ఇరుజట్లు మూడు మ్యాచ్‌లు ఆడతాయి.
సచిన్ ఆల్‌టైమ్ వరల్డ్ రికార్డుపై కన్నేసిన కోహ్లి
ఈ సిరీస్ నేపథ్యంలో కోహ్లి.. టీమిండియా దిగ్గజం సచిన్ టెండుల్కర్ పేరిట ఉన్న ఆల్‌టైమ్ ప్రపంచ రికార్డుపై కన్నేశాడు. టీమిండియా తరఫున కోహ్లి ఇప్పటికి 123 టెస్టుల్లో 9230, 308 వన్డేల్లో 14557 పరుగులు, 125 టీ20లలో 4188 పరుగులు సాధించాడు. మొత్తంగా అంతర్జాతీయ క్రికెట్‌లో 632 ఇన్నింగ్స్‌లో.. 27,975 పరుగులు పూర్తి చేసుకున్నాడు.
ఇక ఇప్పటికే అంతర్జాతీయ టీ20, టెస్టు ఫార్మాట్లకు రిటైర్మెంట్ ప్రకటించిన కోహ్లి.. కేవలం వన్డేల్లోనే కొనసాగుతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో కివీస్‌తో తొలి వన్డే సందర్భంగా కోహ్లి గనుక పాతిక పరుగులు చేస్తే.. 28 వేల పరుగుల క్లబ్‌లో చేరతాడు.
సచిన్ టెండుల్కర్ 644 ఇన్నింగ్స్‌లో ఈ మైలురాయిని తాకగా.. శ్రీలంక దిగ్గజం కుమార్ సంగక్కర 666 ఇన్నింగ్స్‌లో ఈ ఫీట్‌ను అందుకున్నాడు. కోహ్లి ఒకవేళ కివీస్‌తో తొలి వన్డేలోనే ఈ మైలురాయిని చేరుకుంటే.. అత్యంత వేగంగా అంతర్జాతీయ క్రికెట్‌లో 28 వేల పరుగులు పూర్తి చేసుకున్న క్రికెటర్‌గా.. సచిన్ పేరిట ఉన్న వరల్డ్ రికార్డు బద్దలుకొడతాడు. తొలి వన్డేలో మిస్ అయినా.. మిగిలిన రెండు వన్డేల్లో రాణించినా సరే.. కోహ్లి ఈ రికార్డును కొల్లగొట్టడం ఖాయం. ప్రస్తుత ఫామ్ దృష్ట్యా కోహ్లి తొలి వన్డేలోనే ఈ ఘనత సాధించే అవకాశం ఉంది.
చదవండి: టీ20 ప్రపంచకప్ టోర్నీకి ఇంగ్లండ్ జట్టు ప్రకటన.. కెప్టెన్ ఎవరంటే?


