టీమ్, వ్యక్తిగత విభాగాల్లో స్వర్ణ పతకాలు నెగ్గిన భారత ఆర్చర్
ఆసియా చాంపియన్‌షిప్‌లో భారత్ ఖాతాలో ఐదు పతకాలు
ఢాకా: ప్రపంచ రెండో ర్యాంకర్ వెన్నం జ్యోతి సురేఖ మరోసారి అంతర్జాతీయ వేదికపై మెరిసింది. ఆసియా ఆర్చరీ చాంపియన్‌షిప్‌లో ఆంధ్రప్రదేశ్‌కు చెందిన ఈ ఆణిముత్యం రెండు స్వర్ణ పతకాలతో అదరగొట్టింది. ముందుగా దీప్షిక, ప్రీతికలతో కలిసి జ్యోతి సురేఖ మహిళల కాంపౌండ్ టీమ్ ఈవెంట్‌లో భారత్‌కు పసిడి పతకాన్ని అందించింది. ఆ తర్వాత వ్యక్తిగత విభాగంలోనూ బంగారు పతకాన్ని సాధించి ‘డబుల్ ధమాకా’ సృష్టించింది.
ఈ క్రమంలో ఆసియా చాంపియన్‌షిప్ మహిళల వ్యక్తిగత విభాగంలో మూడుసార్లు చాంపియన్‌గా నిలిచిన తొలి ఆర్చర్‌గా జ్యోతి సురేఖ రికార్డు నెలకొల్పింది. ఇంతకుముందు జ్యోతి సురేఖ 2015, 2021లలో జరిగిన ఆసియా చాంపియన్‌షిప్ పోటీల్లోనూ వ్యక్తిగత విభాగంలో బంగారు పతకాలు సాధించింది.
టీమ్ విభాగం ఫైనల్లో జ్యోతి సురేఖ, దీప్షిక, ప్రీతికలతో కూడిన భారత జట్టు 236–234 (59–59, 59–58, 59–59, 59–58)తో పార్క్ యెరిన్, ఓ యుహున్, జుంగ్‌యున్ పార్క్‌లతో కూడిన దక్షిణ కొరియా జట్టును ఓడించింది. వ్యక్తిగత విభాగం ఫైనల్లో జ్యోతి సురేఖ 147–145తో భారత్‌కే చెందిన ప్రీతికపై నెగ్గి పసిడి పతకాన్ని అందుకుంది.
అంతకుముందు సెమీఫైనల్లో జ్యోతి సురేఖ 149–143తో సియు చెన్ (చైనీస్ తైపీ)పై, ప్రీతిక 146–145తో కుల్సుం మోనీ (బంగ్లాదేశ్)పై గెలిచారు. కాంపౌండ్ మిక్స్‌డ్ టీమ్ ఈవెంట్‌లో అభిõÙక్ వర్మ–దీప్షిక ద్వయం భారత్‌కు స్వర్ణ పతకాన్ని అందించింది.
ఫైనల్లో అభిషేక్ వర్మ–దీప్షిక జంట 153–151తో బోనా అక్తర్–హిము బచర్ (బంగ్లాదేశ్) జోడీపై గెలిచింది. అభిషేక్ వర్మ, సాహిల్, ప్రథమేశ్‌లతో కూడిన భారత పురుషుల కాంపౌండ్ జట్టు రజత పతకంతో సరిపెట్టుకుంది. ఫైనల్లో భారత్ 229–230తో మూసా, మీర్జామెతోవ్, ట్యుటున్‌లతో కూడిన కజకిస్తాన్ జట్టు చేతిలో ఓడిపోయింది.
90
అంతర్జాతీయ స్థాయిలో ఇప్పటి వరకు జ్యోతి సురేఖ గెలిచిన మొత్తం పతకాలు. ఇందులో 33 స్వర్ణాలు, 33 రజతాలు, 24 కాంస్య పతకాలు ఉన్నాయి.


