చెన్నై: ఆసియా మాస్టర్స్ అథ్లెటిక్స్ చాంపియన్‌షిప్స్-2025 (Asia Masters Athletics Championships 2025) ఎడిషన్‌లో భారత సీనియర్ అథ్లెట్ డెబోరా రేమండ్ (Deborah raymond) సత్తా చాటారు. డెబ్బై ఏళ్లకు పైబడిన జావెలిన్ త్రో మహిళా విభాగంలో ఆమె రజత పతకం గెలిచారు. ఈటెను 16.90 మీటర్ల దూరం విసిరిన డెబోరా రెండో స్థానంలో నిలిచారు.
రెండు పతకాలు
థాయ్‌లాండ్‌కు చెందిన సిరిపన్ జన్‌ప్రామ్ (18.96 మీటర్లు) ఈ విభాగంలో స్వర్ణం గెలుచుకోగా.. అదే దేశానికి చెందిన లవాన్ జిరానర్ట్ (16.87 మీటర్లు) కాంస్యం కైవసం చేసుకున్నారు. ఇక 70 ప్లస్ షాట్‌పుట్ విభాగంలోనూ డెబోరా రేమండ్ సత్తా చాటారు. ఈ కేటగిరీలో కాంస్యం (6.52 మీటర్లు) కైవసం చేసుకుని డెబోరా తన ఖాతాలో రెండో పతకాన్ని జమ చేసుకున్నారు.
ఇదిలా ఉంటే.. మణిపూర్‌కు చెందిన ఎస్ థంబాల్ శర్మ ( S Thambal Sharma) ఏకంగా నాలుగు పసిడి, ఒక రజతం గెలిచి.. 23వ ఆసియా మాస్టర్స్ అథ్లెటిక్స్ చాంపియన్‌షిప్‌లో అత్యధిక పతకాలు గెలిచిన మేల్ అథ్లెట్‌గా నిలిచారు. 65 ప్లస్ మెన్స్ విభాగంలో 100 మీటర్ల పరుగు, పోల్ వాల్ట్, హై జంప్, 4*100 మీటర్ల రిలే రేసులో స్వర్ణాలు గెలిచిన థంబాల్ శర్మ.. 200 మీటర్ల రేసులో రజతం దక్కించుకున్నారు.
భారత్ పసిడి పంట
కాగా చెన్నై వేదికగా నవంబరు 4- 9 వరకు జరిగిన 23వ ఆసియా మాస్టర్స్ అథ్లెటిక్ చాంపియన్‌షిప్‌లో భారత్ తరఫున మొత్తంగా 1831 పురుష, 817 మహిళా అథ్లెట్లు పాల్గొన్నారు. ఈ ప్రతిష్టాత్మక క్రీడా పోటీలో భారత్‌కు పురుషుల విభాగంలో 159, మహిళల విభాగంలో 111 స్వర్ణాలు వచ్చాయి.
మనమే టాప్
అదే విధంగా.. పురుష అథ్లెట్లు మొత్తంగా 146 రజతాలు గెలుచుకోగా.. మహిళా అథ్లెట్లు 114 సిల్వర్ మెడల్స్‌తో సత్తా చాటారు. ఇక కాంస్యాల విషయానికొస్తే.. పురుష అథ్లెట్లకు 152, మహిళా అథ్లెట్లకు 132 లభించాయి. మొత్తంగా ఆసియా మాస్టర్స్ అథ్లెటిక్ చాంపియన్‌షిప్‌లో భారత్‌కు 814 పతకాలు లభించాయి.
మరోవైపు.. శ్రీలంక 139 పతకాలు గెలుచుకోగా.. థాయ్‌లాండ్ 77, ఇరాన్ 74, కజకిస్తాన్ 67, జపాన్ 48, మలేషియా 23, మంగోలియా 21, ఫిలిప్పైన్స్ 13, సింగపూర్ అథ్లెటిక్ 10, కువైట్ రెండు, బంగ్లాదేశ్ నాలుగు, చైనీస్ తైపీ ఒకటి, మాల్దీవ్స్ రెండు పతకాలు గెలుచుకున్నాయి. నేపాల్, చైనా, ఇండోనేషియా, సింగపూర్ మాస్టర్స్, హాంగ్ కాంగ్, జోర్డాన్, సౌదీ అరేబియా ఖాతా తెరవనే లేదు.
కాగా 23వ ఆసియా మాస్టర్స్ అథ్లెటిక్స్ చాంపియన్‌షిప్‌లో 35 ప్లస్, 40 ప్లస్, 45 ప్లస్, 50 ప్లస్, 55 ప్లస్, 60 ప్లస్, 65 ప్లస్, 70 ప్లస్, 75 ప్లస్, 80 ప్లస్, 85 ప్లస్, 90 ప్లస్ వయో విభాగాల్లో మహిళా, పురుష అథ్లెట్లకు పోటీలు నిర్వహించారు.


