
భారత మహిళా బాక్సర్లకు రెండు స్వర్ణాలు
రజతం నెగ్గిన నుపుర్
పూజా రాణి ఖాతాలో కాంస్యం
లివర్‌పూల్ (ఇంగ్లండ్): ప్రపంచ బాక్సింగ్ చాంపియన్‌షిప్‌లో భారత మహిళా బాక్సర్లు నాలుగు పతకాలతో మెరిశారు. జైస్మీన్ లంబోరియా (57 కేజీలు), మీనాక్షి హుడా (48 కేజీలు) పసిడి పతకాలతో అదరగొట్టగా... నుపుర్ షెరాన్ (ప్లస్ 80 కేజీలు) రజత పతకం, పూజా రాణి (80 కేజీలు) కాంస్య పతకం సొంతం చేసుకున్నారు. ఆదివారం ముగిసిన ఈ మెగా ఈవెంట్‌లో హరియాణాకు చెందిన మీనాక్షి ఫైనల్లో 4–1తో పారిస్ ఒలింపిక్స్ కాంస్య పతక విజేత కిజైబీ నజిమ్ (కజకిస్తాన్)ను బోల్తా కొట్టించి తన కెరీర్‌లో చిరస్మరణీయ విజయాన్ని అందుకుంది.
గత జూలైలో జరిగిన ప్రపంచకప్ ఫైనల్లో కిజైబీ చేతిలో ఎదురైన పరాజయానికి మీనాక్షి ఈ గెలుపుతో బదులు తీర్చుకుంది. శనివారం అర్ధరాత్రి దాటాక జరిగిన 57 కేజీల ఫైనల్లో హరియాణాకే చెందిన జైస్మీన్ 4–1తో పారిస్ ఒలింపిక్స్ రజత పతక విజేత జూలియా జెరెమెటా (పోలాండ్)ను ఓడించి విశ్వవిజేతగా అవతరించింది. ‘నా అనుభూతిని మాటల్లో వర్ణించలేను.
గత రెండు ప్రపంచ చాంపియన్‌షిప్‌లలో క్వార్టర్ ఫైనల్స్‌లో వెనుదిరిగాను. ఈసారి ఎలాగైనా విజేతగా తిరిగి రావాలనే లక్ష్యంతో నా ఆటతీరులో మార్పులు చేసుకొని అనుకున్న ఫలితాన్ని సాధించాను’ అని జైస్మీన్ వ్యాఖ్యానించింది. ప్లస్ 80 కేజీల ఫైనల్లో నుపుర్ 2–3తో అగాటా కమర్స్‌కా (పోలాండ్) చేతిలో పోరాడి ఓడిపోయింది. 80 కేజీల సెమీఫైనల్లో పూజా రాణి 1–4తో ఎమిలీ (ఇంగ్లండ్) చేతిలో పరాజయం పాలై కాంస్య పతకాన్ని దక్కించుకుంది.
10 ప్రపంచ చాంపియన్‌షిప్ చరిత్రలో స్వర్ణ పతకాలు నెగ్గిన భారత మహిళా బాక్సర్లు. ఈ జాబితాలో మేరీకోమ్, నిఖత్ జరీన్, సరితా దేవి, జెన్నీ, లేఖ, నీతూ, లవ్లీనా, స్వీటీ బూరా, జైస్మీన్, మీనాక్షి ఉన్నారు.