బిగ్‌బాష్ లీగ్ 2025లో మెల్‌బోర్న్ రెనెగేడ్స్ ఘనంగా బోణీ కొట్టింది. బ్రిస్బేన్ హీట్‌తో ఇవాళ (డిసెంబర్ 15) జరిగిన మ్యాచ్‌లో 14 పరుగుల తేడాతో గెలుపొందింది. తొలుత బ్యాటింగ్ చేసి.. ఓపెనర్ టిమ్ సీఫర్ట్ విధ్వంసకర శతకంతో (56 బంతుల్లో 102; 9 ఫోర్లు, 6 సిక్సర్లు) విరుచుకుపడటంతో నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 212 పరుగుల భారీ స్కోర్ చేసింది.
రెనెగేడ్స్ ఇన్నింగ్స్‌లో ఓలివర్ పీక్ (29 బంతుల్లో 57; 6 ఫోర్లు, 3 సిక్సర్లు) కూడా చెలరేగిపోయాడు. మిగతా ఆటగాళ్లలో జోష్ బ్రౌన్ 15, మహ్మద్ రిజ్వాన్ 4, జేక్ ఫ్రేజర్ మెక్‌గుర్క్ 14, హస్సన్ ఖాన్ 5 (నాటౌట్), కెప్టెన్ విల్ సదర్‌ల్యాండ్ 3 (నాటౌట్) పరుగులు చేశారు. బ్రిస్బేన్ బౌలర్లలో జాక్ విల్డర్‌ముత్ 3 వికెట్లు తీయగా.. ప్యాట్రిక్ డాక్లీ, జేవియర్ బార్ట్‌లెట్ తలో వికెట్ తీశారు.
అనంతరం భారీ లక్ష్య ఛేదనలో బ్రిస్బేన్ గెలుపు కోసం విఫలయత్నం చేసింది. ఓపెనర్ కొలిన్ మున్రో (32 బంతుల్లో 55; 3 ఫోర్లు, 5 సిక్సర్లు), హగ్ వెబ్‌జెన్ (20 బంతుల్లో 38 నాటౌట్; 4 ఫోర్లు, 2 సిక్సర్లు), తొమ్మిదో నంబర్ ఆటగాడు జిమ్మీ పియర్సన్ (22 బంతుల్లో 50; 4 ఫోర్లు, 3 సిక్సర్లు) మెరుపు ఇన్నింగ్స్‌లతో పోరాడినా ప్రయోజనం లేకుండా పోయింది.
ఈ ముగ్గురు చెలరేగినా బ్రిస్బేన్ లక్ష్యానికి 15 పరుగుల దూరంలో నిలిచిపోయింది. నిర్ణీత ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 198 పరుగులు చేయగలిగింది. మిగతా బ్రిస్బేన్ ఆటగాళ్లలో కెప్టెన్ మెక్‌స్వీని 9, మ్యాట్ రెన్షా 18, మ్యాక్స్ బ్రయాంట్ 14, బార్ట్‌లెట్ 1, లియామ్ హాస్కెట్ 2 (నాటౌట్) పరుగులు చేయగా.. జాక్ విల్డర్‌ముత్, షాహీన్ అఫ్రిది డకౌటయ్యారు. విల్ సదర్‌ల్యాండ్ 3, గురిందర్ సంధు, బెహ్రెన్‌డార్ఫ్ తలో 2 వికెట్లు తీసి బ్రిస్బేన్‌ను దెబ్బకొట్టారు.


