
సిడ్నీ: టీమిండియా దిగ్గజ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ (R Ashwin) తొలిసారి ఆస్ట్రేలియా బిగ్‌బాష్ లీగ్ (BBL)లో ఆడటం దాదాపుగా ఖాయమైంది. అతడిని జట్టులోకి తీసుకునేందుకు నాలుగు జట్లు ఆసక్తి చూపించాయి. అయితే ‘సిడ్నీ థండర్’ టీమ్ అశ్విన్‌ను సొంతం చేసుకున్నట్లు సమాచారం. ఈ విషయంపై ఫ్రాంచైజీ త్వరలోనే అధికారిక ప్రకటన చేయనుంది.
కాగా అంతర్జాతీయ క్రికెట్‌లో భారత్‌కు ప్రాతినిధ్యం వహించిన ఆటగాళ్లెవరూ ఇప్పటి వరకు బిగ్‌బాష్ లీగ్‌లో ఆడలేదు. అశ్విన్ బరిలోకి దిగితే అతనే మొదటి క్రికెటర్ అవుతాడు. గత ఏడాది చివర్లో టెస్టులకు గుడ్‌బై చెప్పిన అతడు.. ఇటీవలే ఐపీఎల్‌నుంచి కూడా తప్పుకొన్న విషయం తెలిసిందే.
బీసీసీఐతో ‘తెగదెంపులు’
ఈ నేపథ్యంలో బీసీసీఐ నిబంధనల ప్రకారం.. బోర్డుతో అన్ని రకాల సంబంధాలు తెంచుకున్న అశ్విన్ ఇకపై ప్రపంచవ్యాప్తంగా ఏ లీగ్‌లోనైనా పాల్గొనవచ్చు. ఈ క్రమంలో అతను ముందు ఐఎల్‌టి20 టోర్నీ ఆడి ఆపై బీబీఎల్‌కు వెళ్లే అవకాశాలున్నాయి.
బీబీఎల్‌లో 2015–16 సీజన్‌లో ఒకే ఒక సారి చాంపియన్‌షిప్ గెలుచుకున్న సిడ్నీ థండర్... గత ఏడాది రన్నరప్‌గా నిలిచింది. 2025–26 కోసం ప్రకటించిన థండర్ జట్టులో డేవిడ్ వార్నర్, సామ్ కొన్‌స్టాస్, బాన్‌క్రాఫ్ట్, సామ్ బిల్లింగ్స్ తదితరులతో పాటు తన్వీర్ సంఘా, టామ్ ఆండ్రూస్ రూపంలో ఇద్దరు స్పిన్నర్లు ఉన్నారు.