హెలికాప్టర్‌లో నేరుగా గ్రౌండ్‌లో ల్యాండ్‌ అయిన వార్నర్‌..! | Sakshi
Sakshi News home page

బిగ్‌బాష్‌ లీగ్‌లో డేవిడ్‌ వార్నర్‌ ఎంట్రీ ఎలా ఉందో చూడండి..!

Published Fri, Jan 12 2024 12:21 PM

BBL 2024: David Warner Arrived At SCG In Helicopter - Sakshi

బిగ్‌బాష్‌ లీగ్‌ మ్యాచ్‌ కోసం ఆస్ట్రేలియా స్టార్‌ క్రికెటర్‌ డేవిడ్‌ వార్నర్‌ ప్రైవేట్‌ హెలికాప్టర్‌లో సిడ్నీ క్రికెట్‌ గ్రౌండ్‌లో ల్యాండ్‌ అయ్యాడు. సొదరుడి వివాహానికి హాజరైన వార్నర్‌.. అక్కడి నుంచి నేరుగా తాను ఆడబోయే మ్యాచ్‌కు వేదిక అయిన సిడ్నీ క్రికెట్‌ గ్రౌండ్‌కు హెలికాప్టర్‌లో చేరుకున్నాడు.  

సాధారణంగా ఏ క్రికెటర్‌కు కూడా ఇలాంటి అవకాశం లభించదు. వార్నర్‌ కోసం​ బిగ్‌బాష్‌ లీగ్‌ యాజమాన్యం ప్రత్యేకంగా ఈ ఏర్పాట్లు చేసింది. టెస్ట్‌, వన్డే క్రికెట్‌కు రిటైర్మెంట్‌ ప్రకటించాక వార్నర్‌ ఆడనున్న తొలి మ్యాచ్‌ కావడంతో అతడి గౌరవార్దం ఈ ప్రత్యేక ఏర్పాటు చేసినట్లు సిడ్నీ థండర్స్‌ చీఫ్‌ ప్రకటించాడు.

గత బీబీఎల్‌ సీజన్‌ సందర్భంగా వార్నర్‌ సిడ్నీ థండర్స్‌తో రెండేళ్ల ఒప్పందం కుదుర్చుకున్నాడు. ఇందులో భాగంగానే అతను ఇవాళ (జనవరి 12) సిడ్నీ సిక్సర్స్‌తో జరుగనున్న మ్యాచ్‌లో ఆడనున్నాడు.

కాగా, వార్నర్‌ కొద్ది రోజుల కిందట ఇదే సిడ్నీ మైదానంలోనే తన చివరి టెస్ట్‌ మ్యాచ్‌ ఆడాడు. చివరి టెస్ట్‌ ప్రారంభానికి ముందు వార్నర్‌ వన్డేల నుంచి కూడా వైదొలుగుతన్నట్లు ప్రకటించాడు. ప్రస్తుతం వార్నర్‌ ఆస్ట్రేలియా జాతీయ జట్టుకు టీ20 ఫార్మాట్‌లో మాత్రమే అందుబాటులో ఉంటాడు.

బిగ్‌బాష్‌ లీగ్‌ అనంతరం వార్నర్‌ యూఏఈలో జరిగే ఇంటర్నేషనల్‌ టీ20 లీగ్‌ ఆడతాడు. ఈ లీగ్‌ అతను ఢిల్లీ క్యాపిటల్స్‌ కెప్టెన్‌గా వ్యవహరిస్తాడు. ఈ ఏడాది జూన్‌లో జరిగే టీ20 వరల్డ్‌కప్‌ దృష్ట్యా వార్నర్‌ అంతర్జాతీయ టీ20ల్లో కొనసాగాలని నిర్ణయించుకున్నట్లు తెలిపాడు.

త్వరలో విండీస్‌తో జరిగే టీ20 సిరీస్‌కు సైతం అందుబాటులో ఉంటానని వార్నర్‌ ప్రకటించాడు. వార్నర్‌ బిగ్‌బాష్‌ లీగ్‌లో ఇప్పటివరకు కేవలం 9 మ్యాచ్‌లు మాత్రమే ఆడాడు. ఇందులో అతను ఓ సెంచరీ (102) సాయంతో 201 పరుగులు చేశాడు.

Advertisement
 
Advertisement