
వీటిని దూరం నుంచి చూస్తే, బొగ్గుముక్కల్లా కనిపిస్తాయి. దగ్గరగా చూస్తే, మాడిపోయిన పూతరేకుల్లా కనిపిస్తాయి. నిజానికి ఇవి పూతరేకుల్లాంటి వంటకమే! కాకుంటే, మాడిపోలేదు, ఎవరూ కావాలని వీటిని మాడ్చేయలేదు. వీటి తయారీకి వాడే ముడిపదార్థాల కారణంగానే నల్లగా కనిపిస్తాయి.
‘పికి బ్రెడ్’ అని పిలుచుకునే ఈ సంప్రదాయ వంటకం తయారీలో నల్లని మొక్కజొన్న గింజల నూక, నల్లగా నిగనిగలాడే జూనిపర్ బెర్రీలను కాల్చి తయారు చేసిన బూడిదను ప్రధానంగా వాడతారు. తయారీ ప్రక్రియ దాదాపు మన పూతరేకుల మాదిరిగానే ఉంటుంది. పూతరేకుల తయారీలో కుండ అడుగున మంటపెట్టి, పిండిని కుండ మీద ఒక్కోపూతగా పూసి, వాటిని ఒద్దికగా చుడతారు. ‘పికో బ్రెడ్’ తయారీకి రాతిపలక కింద మంట పెడతారు.
వేడెక్కిన రాతి పలక మీద ముందుగా కలిపి ఉంచుకున్న పిండిని అతి సన్నని పొరలుగా కాలుస్తారు. కొన్ని పొరల దొంతరలను ఇలా పూతరేకుల్లా చుడతారు. అమెరికాలోని అరిజోనా రాష్ట్రంలో నివసించే ‘హోపీ’ తెగవారి సంప్రదాయ వంటకం ఇది. ఈ తీపి వంటకాన్ని పండుగలు, పుట్టినరోజులు వంటి ప్రత్యేక సందర్భాలలో తయారు చేసుకుంటారు.
(చదవండి: కొరకరాని గింజలే గాని...)